Telangana: తెలంగాణలో పోటీ పరీక్షలపై ఎన్నికల ప్రభావం.. నవంబర్ 2,3 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు

Impact Of Elections On Competitive Examinations In Telangana
x

Telangana: తెలంగాణలో పోటీ పరీక్షలపై ఎన్నికల ప్రభావం.. నవంబర్ 2,3 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు

Highlights

Telangana: పరీక్షలు వాయిదా వేసే అవకాశముందంటున్న నిపుణులు

Telangana: తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌ రాష్ట్రంలో పోటీ పరీక్షలు, ఉద్యోగాల భర్తీపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, గ్రూప్‌ 2 పరీక్షలు నిర్ణీత తేదీల ప్రకారం జరుగుతాయా.. లేదా.. అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇప్పటికే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్‌ ప్రకారం. నవంబరు 20-30వ తేదీల మధ్య ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. నవంబర్ 20 నుంచి 23వ తేదీ వరకు స్కూల్‌ అసిస్టెంట్స్‌, పండిట్‌ పోస్టులకు.. నవంబరు 24 నుంచి 30వరకు ఎస్జీటీ పోస్టులకు సంబంధించిన పరీక్షలను నిర్వహిస్తారు. అయితే, రాష్ట్ర అసెంబ్లీకి నవంబరు 30వ తేదీన పోలింగ్‌ జరుగనుంది. ఆ రోజు ఇతర పరీక్షలను నిర్వహించడానికి అవకాశం ఉండదు.

పైగా పోలింగ్‌కు రెండు మూడు రోజుల ముందు నుంచే అధికారులు ఏర్పాట్లను చేయాల్సి ఉండడంతో టీచర్‌ పోస్టుల పరీక్షల నిర్వహణ సాధ్యం కాదనే వాదన వినిపిస్తున్నది. ఈ నేపథ్యంలో టీచర్‌ పోస్టులకు సంబంధించిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తారా.. లేక 30 నాటి పరీక్షను మాత్రమే వాయిదా వేస్తారా.. అనే విషయంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం టీచర్‌ పోస్టుల పరీక్షలను మొత్తంగా వాయిదా వేసే అవకాశం ఉంది. తాజా పరిస్థితుల్లో గ్రూపు-2 పరీక్షలను నిర్వహిస్తారా లేదా అనే విషయంలో కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నోటిఫికేషన్‌ ప్రకారం గ్రూపు-2 పరీక్షలను నవంబరు 2,3వ తేదీల్లో నిర్వహించాల్సి ఉంది. అయితే, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నవంబరు 3వ తేదీ నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ నామినేషన్ల ప్రక్రియ మొదలైతే కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులంతా ఎన్నికల నిర్వహణపైనే దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది.

ఈ పరిస్థితుల్లో గ్రూపు-2 పరీక్షలను నిర్వహించడం సాధ్యం అవుతుందా లేదా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఒకసారి వాయిదాపడ్డ ఈ పరీక్షలు మరోసారి వాయిదా పడితే ఎన్నికల అనంతరమే మళ్లీ నిర్వహించే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు. కాగా, ఎన్నికల షెడ్యూల్‌ ప్రభావం గ్రూపు-4 పరీక్ష ఫలితాల విడుదలపై కూడా పడే అవకాశం కనిపిస్తున్నది. కోడ్‌ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఫలితాలను వెల్లడిస్తారా.. లేదా.. అనే విషయంపై సందిగ్ధత నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories