Amrapali Kata: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి షాక్.. ఏపీలో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశం

Amrapali Kata: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి షాక్.. ఏపీలో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశం
x
Highlights

Amrapali Kata: తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ కేడర్ ఐఎఎస్ లపై కేంద్రం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది.

Amrapali Kata: జీహెచ్ఎంసీ కమిషనర్ గా పనిచేస్తున్న ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్ లో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశించింది. ఏపీ కేడర్ కు చెందిన ఆమ్రపాలి తెలంగాణలో పనిచేస్తున్నారు. అయితే తన కేడర్ ను ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు మార్చాలని ఆమె డీఓపీటీని కోరారు. అయితే ఆమె వినతిని డీఓపీటీ తిరస్కరించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి.

2010 బ్యాచ్ కు చెందిన అమ్రపాలి తనను తెలంగాణ స్థానికత ఉన్న అధికారిగా గుర్తించాలని కోరారు. ఖండేకర్ కమిటీ సిఫారసుల ఆధారంగా ఆమె ఏపీ కేడర్ కు చెందుతారని డీఓపీటీ తేల్చి చెప్పింది. రాష్ట్ర విభజన తర్వాత సివిల్ సర్వీస్ అధికారుల కేటాయింపు కోసం ఖండేకర్ కమిటీని నియమించారు.

ఈ కమిటీ నిబంధనల మేరకు పలువురు సివిల్ సర్వీస్ అధికారులు తమ కేడర్ పై ఉన్న అభ్యంతరాలపై క్యాట్ కు దరఖాస్తు చేసుకున్నారు.

ఖండేకర్ కమిటీ నివేదిక తర్వాత ప్రత్యూష్ సిన్హా కమిటీ ఈ నివేదిక ఆధారంగా కేడర్ ను కేటాయించింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఖండేకర్ కమిటీ అమ్రపాలికి ఏపీ కేడర్ కేటాయించారు. తనను తెలంగాణ స్థానికురాలిగా పరిగణించి తెలంగాణకే కేటాయించాలని ఆమె చేసుకున్న అప్పీల్ ను అప్పట్లోనే ప్రత్యూష్ సిన్హా కమిటీ తిరస్కరించింది.

ఆమ్రపాలి వాదన ఏంటి?

ఆలిండియా సర్వీస్ అధికారుల కేడర్ కేటాయింపు విషయంలో ఖండేకర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నిబంధనలు రూపొందించింది. ఈ కమిటీ సిఫారసుల మేరకు స్థిర నివాసం అనే కాలమ్ ను కీలకంగా తీసుకున్నారు. యూపీఎస్ సీ కి దరఖాస్తు చేసిన సమయంలో ఆమ్రపాలి తన పర్మినెంట్ అడ్రస్ ను విశాఖపట్టణంగా చూపారు. దీంతో ఆమెను ఏపీ కేడర్ కేటాయించారు. అయితే తనను తెలంగాణ స్థానికురాలిగా పరిగణించి తెలంగాణకు కేటాయించాలని అప్పీల్ చేసుకున్నారు. ఈ అప్పీల్ ను ప్రత్యూష్ సిన్హా కమిటీ అప్పట్లోనే తిరస్కరించింది.

తెలంగాణలోనే ఆమ్రపాలి బాధ్యతలు

ఆమ్రపాలి 2010 ఐఎఎస్ అధికారిణి. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఆమె తెలంగాణలో పనిచేశారు. తొలుత ఆమె వికారాబాద్ సబ్ కలెక్టర్ గా పనిచేశారు. ఆ తర్వాత స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో కొంతకాలం ఉన్నారు.2015 జనవరిలో రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. 2016లో తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆమెకు పదోన్నతి కల్పించి వరంగల్ అర్బన్ కలెక్టర్ గా నియమించారు. అటు పిమ్మట వరంగల్ రూరల్ కలెక్టర్ గా కొనసాగారు.వరంగల్ నుంచి హైద్రాబాద్ కు బదిలీ అయ్యారు. జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ గా పనిచేశారు. 2019 జులై 12 ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణకు

కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆమ్రపాలి తెలంగాణకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తిరిగి రాష్ట్రానికి వచ్చారు. ఆమెను 2023 డిసెంబర్ 14న హెచ్ఎండీఏ కమిషనర్ గా నియమించారు. ఈ ఏడాది జూన్ 24న ఆమెను జీహెచ్ఎంసీ కమిషనర్ గా అపాయింట్ చేశారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఆమె కొనసాగుతున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories