నగరంలో సంచలనం రేపుతోన్న మిస్సింగ్ కేసులు

నగరంలో సంచలనం రేపుతోన్న మిస్సింగ్ కేసులు
x
Highlights

హైదరాబాద్‌లో మిస్సింగ్ కేసులు సంచలనం రేపుతున్నాయి. రోజు రోజుకు అదృశ్యం కేసులు పెరిగిపోతున్నాయి. ఎవరు ఎందుకు, ఎక్కడికి వెడుతున్నారో పోలీసులకే అంతు చిక్కడం లేదు.

హైదరాబాద్‌లో మిస్సింగ్ కేసులు సంచలనం రేపుతున్నాయి. రోజు రోజుకు అదృశ్యం కేసులు పెరిగిపోతున్నాయి. ఎవరు ఎందుకు, ఎక్కడికి వెడుతున్నారో పోలీసులకే అంతు చిక్కడం లేదు. వారం క్రితం నాలుగు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా 203 మంది కనిపించకుండా పోయారని సాక్షాత్తూ పోలీస్ వెబ్‌సైటే ప్రకటించింది.. ఆ మరుసటి రోజే.. మరికొంతమంది అదృశ్యం అయ్యారు. ఆ మిస్టరీ అలా ఉండగానే ఇవాళ నగరంలో మూడు కుటుంబాలకు చెందిన ఏడు మంది కనిపించకుండా పోవడం సంచలనంగా మారింది.

మహిళలు తమ పిల్లలను వెంట పెట్టుకుని మరీ అదృశ్యం అవ్వడం తీవ్ర సంచలనం రేపుతోంది. గంట వ్యవధిలోనే మూడు కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. కుటుంబ కలహాలో, భర్తలపై కోపమో తెలియదు కానీ, మహిళల మిస్సింగ్ కేసులు పోలీసులకే సవాల్‌గా మారుతున్నాయి. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లి, ఇద్దరు పిల్లలతో సహా అదృశ్యమైంది.

మియాపూర్ హఫీజ్ పేట్ ప్రేమ్ నగర్ లో నివాసం ఉంటున్న దీపిక.. తన పిల్లలు సాయి లిపి, చైతన్యతో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన దీపిక తిరిగి రాలేదు.. దాంతో రెండు రోజుల పాటు కుటుంబ సభ్యులు వెతికారు. కానీ, ఫలితం లేకపోవడంతో.. మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మరోవైపు.. ఇదే సమయంలో సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో మరో కేసు నమోదు అయింది. బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు అదృశ్యం అయ్యారు. చిన్న తోకట్ట ప్రాంతానికి చెందిన మహిళ తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఆరు రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఎంతకూ తిరిగి రాకపోవడంతో.. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు..

భావన కాలనికి చెందిన మరొక్క మహిళ నిన్నటి నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇలా నగరంలోమహిళలు పిల్లలతో సహా అదృశ్యం కావడం పోలీసులకే సవాల్‌గా మారుతోంది. మిస్‌ అయిన వారి కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పాడి గాలిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories