IT Companies in Hyderabad: నగరంలో మరిన్ని ఐటీ పరిశ్రమలు.. కేటీఆర్

IT Companies in Hyderabad:  నగరంలో మరిన్ని ఐటీ పరిశ్రమలు.. కేటీఆర్
x
KTR IT COMPANIES
Highlights

IT Companies in Hyderabad: హైదరాబాద్ నగర సమగ్రాభివృద్ది కోసం నగరం నలు మూలలా అభివృద్ది చెందేలా తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని తెలంగాణ ఐటీ శాఖామంత్రి కేటీఆర్ అన్నారు.

IT Companies in Hyderabad: హైదరాబాద్ నగర సమగ్రాభివృద్ది కోసం నగరం నలు మూలలా అభివృద్ది చెందేలా తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని తెలంగాణ ఐటీ శాఖామంత్రి కేటీఆర్ అన్నారు. ఈ రోజు ఉప్పల్ ఏన్ యస్ ఏల్ ఐటి సెట్ లో హైదరాబాద్ గ్రోత్ ఇన్ డిస్పర్శన్ (గ్రిడ్) కార్యక్రమంలో భాగంగా ఐటీ కంపెనీల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ఐదేండ్లలో తెలంగాణ ఐటీ పరిశ్రమ జాతీయ సగటు కన్నా అధికంగా వృద్ధి చెందుతూ వస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకు వస్తున్న గ్రిడ్ విధానంతో ఐటీ పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు తరలి వెళతాయన్న నమ్మకం ఉన్నదన్నారు. ఇప్పటికే నగరం నలువైపులా ఐటీ పరిశ్రమ, ఎలక్ట్రానిక్స్, ఏరో స్పేస్, మెడికల్ డివైస్ పార్క్ వంటి వివిధ రకాల పరిశ్రమలు విసర్తించి ఉన్నాయన్నారు. రానున్న సంవత్సరాల్లో ఈస్ట్ హైదరాబాద్ వైపు మరిన్ని ఐటి పరిశ్రమలు వస్తాయన్న నమ్మకం వ్యక్తం చేశారు.

ఐటి, ఐటి అనుబంధ కంపెనీలను హైదరాబాద్ నగరం నలుమూలలకు విస్తరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఐటీని నగరంలోని నలుమూలలకు విస్తరించే గ్రిడ్ పాలసీతో ముందుకు రానున్నట్లు తెలిపారు. ఐటీ పరిశ్రమలు ఈస్ట్ హైదరాబాద్ కి తరలించే ప్రయత్నంలో భాగంగా అవసరమైన ప్రోత్సాహకాలతో పాటు మౌలిక వసతులను కల్పిస్తామని మంత్రి ఈ సమావేశంలో తెలిపారు. హైదరాబాద్ పట్టణం నలువైపులా సమతుల్యంగా అభివృద్ధి చెందాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇతర ప్రాంతాలకు ఐటీ పరిశ్రమను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఉప్పల్ నుంచి ఘట్కెసర్ వైపు, అంబర్ పేట్ రామాంతాపూర్ ఫ్లై ఒవర్ల ద్వారా రోడ్డు మౌళిక వసతులు మరింత పెరుగుతాయన్నారు. ఇందుకోసం అవసరమైన రోడ్లు మరియు ఇతర మౌలిక వసతుల కల్పన పైన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

పారిశ్రామిక స్థలాలను ఐటీ పార్కులుగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన కన్వర్షన్ పత్రాలను 5 కంపెనీల ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ అందజేశారు. ఈ ఐదు కంపెనీలు సుమారు 25 లక్షల చదరపు అడుగుల ఐటీ పార్కుల ను లేదా కార్యాలయాలకి అవసరం అయిన ఆఫీస్ స్పేస్ ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. దీంతో ఉప్పల్ ప్రాంతంలో మరో 30వేల మంది ఉద్యోగులు పనిచేసే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. ఇప్పటికే ఇక్కడ అందుబాటులో ఉన్న మెట్రో, శిల్పారామం, మూసి నది అభివృద్ధి వంటి కార్యక్రమాల ద్వారా సామాజిక మౌలికవసతుల పెరుగుతున్నాయని తెలిపారు.

అవుటర్ రింగ్రోడ్ లోపల ఉన్న కాలుష్యకారక పరిశ్రమలు దూర ప్రాంతాలకు తరలి వెళ్ళితే వారి స్థలాలను ఐటీ రంగ కార్యాలయాల అభివృద్ధికి అనుమతి ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. ఈ పాలసీ ద్వారా పరిశ్రమల అభివృద్ది అన్ని మూలలా జరుగతుందన్న నమ్మకాన్ని మంత్రి వ్యక్తం చేశారు. రాచకొండ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ సమాచార సంచికను మంత్రి ఈ సందర్భంగా అవిష్కరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories