Huzurabad Bypoll: 100 కోట్లు దాటిన బెట్టింగ్‌..?

Huge Bettings on Huzurabad Bypolls
x

Huzurabad Bypoll: 100 కోట్లు దాటిన బెట్టింగ్‌..?

Highlights

Huzurabad Bypoll: రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన హుజురాబాద్ ఉప ఎన్నికలపై జోరుగా బెట్టింగులు మొదలయ్యాయన్న వార్తలు వినిపిస్తున్నాయి.

Huzurabad Bypoll: రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన హుజురాబాద్ ఉప ఎన్నికలపై జోరుగా బెట్టింగులు మొదలయ్యాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఐదు నెలలుగా ఉత్కంఠభరితంగా సాగుతున్న ప్రచారంలో చివరికి గెలుపు ఎవరిని వరిస్తుందో అన్న దానిపై బెట్టింగ్ రాజాలు బెట్టింగులు కాస్తూ ఫుల్ బిజీ అయిపోయారు. ఈ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లో రహస్యంగా కొనసాగుతోందట. ఓ అనధికార లెక్కల ప్రకారం బెట్టింగ్ లన్నీ వందల కోట్లకు చేరుతున్నాయని తెలుస్తోంది.

ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల చూపంతా హుజురాబాద్ పైనే ఉంది. ఇది సహజం. కాని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మిగిలిన రాష్ట్రాలూ హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఆసక్తిగా చూస్తున్నాయి. హుజురాబాద్‌పై గత నెల నుంచే మొదలైన బెట్టింగ్‌ గడువు సమీపించడంతో మరింత జోరందుకుంది. తెలంగాణతోపాటు ఆంధ్రా నుంచి విజయవాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, గుంటూరు, విశాఖపట్నంతో పాటు మహారాష్ట్రలోని షోలాపూర్, నాందెడ్, ముంబయ్‌ వంటి ప్రాంతాల వారు బెట్టింగ్‌లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.

బెట్టింగ్ బంగారు రాజులు కొందరు నేరుగా వచ్చి హుజురాబాద్‌లో అడ్డా వేసారు. ఇక ఆంధ్రా నాయకులు ఇక్కడ తెలిసిన వారికి ఫోన్‌ చేసి ఏ పార్టీ గెలుస్తుంది ఎన్ని ఓట్లతో గెలిచే అవకాశాలున్నాయంటూ టచ్‌లో ఉంటున్నారు. ఇదిలా ఉండగా మూడు రోజుల క్రితం ఆంధ్రాకు చెందినవారు వాహనాల్లో హుజూరాబాద్‌కు వచ్చి ప్రచార శైలిని చూశారంటే అర్థం చేసుకోవచ్చు ఉప ఎన్నిక ఉత్కంఠ ఏ స్థాయిలో ఉందో. ఆంధ్రాలో ఎక్కువ శాతం ఐపీఎల్‌ బెట్టింగ్‌లు కట్టినవారు అది ముగియడంతో ఇప్పుడు ఉప ఎన్నికపై దృష్టి పెడుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే బెట్టింగ్‌ విలువ 100 కోట్ల రూపాయలకు పైగానే దాటినట్లు అంచనా.

హుజూరాబాద్‌ ఎన్నికలకు సంబంధించిన బెట్టింగ్‌ నిర్వహించే బుకీలు ఆన్‌లైన్‌లోనే దందా నడుపుతున్నట్లు తెలిసింది. రూపాయికి 10 రూపాయలు, కొన్ని చోట్ల రూపాయికి 1000 రూపాయలు ఇలా కోట్లాది రూపాయాలు బెట్టింగ్‌ సాగుతోంది. ఎవరు గెలుస్తారు అన్న దానిపైనే కాకుండా చివరకు గెలిచే అభ్యర్థుల మెజార్టీపై కూడా బెట్టింగ్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఉత్కంఠ రేపుతున్న హుజురాబాద్‌ ఉప ఎన్నిక ముగిసే సరికి సుమారు 300 కోట్ల బెట్టింగ్‌లు జరుగుతాయని చర్చ జరుగుతోంది. ఏదిఏమైనా వారం రోజుల తర్వాత ఏ పార్టీ గెలుస్తుందో ఎవరు ఓడుతారో తెలిసేవరకు వేచిచూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories