ఆ నలుగురు మంత్రుల చాణక్యం ఎలా వర్కౌటయ్యింది?

ఆ నలుగురు మంత్రుల చాణక్యం ఎలా వర్కౌటయ్యింది?
x
ఆ నలుగురు మంత్రుల చాణక్యం ఎలా వర్కౌటయ్యింది?
Highlights

సహకార బ్యాంకు చైర్మన్‌లు, వైఎస్‌ చైర్మన్‌ల సింహాసనంపై తమవారిని కూర్చోబెట్టేందుకు, మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా ట్రై చేశారు. వారి హడావుడి చూస్తే, వారి...

సహకార బ్యాంకు చైర్మన్‌లు, వైఎస్‌ చైర్మన్‌ల సింహాసనంపై తమవారిని కూర్చోబెట్టేందుకు, మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా ట్రై చేశారు. వారి హడావుడి చూస్తే, వారి అనుచరులకే పక్కా పీఠాలనుకున్నారు. కానీ సీన్‌ కట్‌ చేసి, సీల్డ్‌ కవర్‌ ఓపెన్‌ చేస్తే, దిమ్మ తిరిగిపోయింది చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలకు. కానీ ఒక జిల్లాలో మాత్రం ఆ నలుగురు మంత్రులు చాకచక్యంగా వ్యవహరించారు. తమ నమ్మిన బంటులనే చైర్మన్‌ గిరి ఇప్పించుకోవడంలో సక్సెస్‌ అయ్యారు. మిగతా అందరూ ఫెయిలైనా, ఆ నలుగురే ఎలా సఫలయ్యారు? ఇంతకీ ఎవరా నలుగురు?

సహకార సంఘం ఎన్నికల్లో అంతా తమకు అనుకూలంగా ఉన్నప్పటికి టీఆర్ఎస్‌ అధిష్టానం మాత్రం, ప్రతీ అడుగూ జాగ్రత్తగా వేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సహకార ఎన్నికల్లో డైరెక్టర్‌లు మొత్తం వన్ సైడ్ గానే గెలిచారు. టీఆర్ఎస్‌ బలపరిచిన అభ్యర్థులే డైరెక్టర్‌లుగా విజయం సాధించినా, చైర్మన్ల విషయంలో కూడా పార్టీ ఆచితూచి నిర్ణయం తీసుకుంది. ఎక్కడా తిరుగుబాటు లేకుండా ఉండేందుకు ప్రతి అంశాన్నీ పరిగణలోకి తీసుకుని, సీల్డ్ కవర్లలో పేర్లను చివరి నిమిషంలో పంపించేంతగా జాగ్రత్తలు తీసుకుంది.

డైరెక్టర్లంతా వన్ సైడ్‌గా రావడంతో అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు తమ వారిని డిసిఎంఎస్, డిసిసిబి చైర్మన్‌లు చేసుకునేందుకు పైరవీలు స్టార్ట్ చేశారు. ఇటు మంత్రలు కూడా అధిష్టానం ద్రుష్టిలో కొన్ని పేర్లు పెట్టారు. చాలాచోట్ల ఇలానే జరిగినప్పటికీ, అందరి పేర్లూ పరిశీలించి చివరికి ప్లాన్డ్‌గా, తమ సీక్రెట్ రిపోర్ట్ ప్రకారమే హైకమాండ్ పదవులు కట్టబెట్టిందన్న చర్చ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సీల్డ్ కవర్లలో పేర్లు పంపించింది. అయితే కరీంనగర్‌లో మాత్రం ఎమ్మెల్యేల కంటే మంత్రుల వ్యూహాలు ఫలించాయనే చెప్పాలి. మంత్రలు తమ నియోజకవర్గంలోని ఒక్కో పేరునూ ప్రతిపాదించడంతో పాటుగా వారికే పదవులు వచ్చేలా అధిష్టానాన్ని ఒప్పించగలిగారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్. ఈ నలుగురూ, తమ నియోజకవర్గంలో నమ్మకస్తులైన వారికే పదవులు వచ్చేలా చక్రం తిప్పారట. ఉన్న నాలుగు పదవులను, నలుగురు మంత్రులు పంచేసుకున్నారనే చెప్పాలి. డిసిసిబి చైర్మన్‌గా తన నియోజకవర్గం నుంచి కొండూరి రవీందర్ రావు ఎంపిక కావడంలో కేటీఆర్ కీలక పోత్ర పోషించారన్న మాటలు వినపడ్డాయి. రవీందర్‌ ఇంతకుముందు కూడా చైర్మన్‌గా ఉన్నారు. తిరిగి మళ్లీ ఆయనకే ఈ పదవి దక్కింది. ఇక టెప్కాబ్ చైర్మన్‌గా కూడా కొండూరే ఉండే అవకాశాలున్నాయి.

ఇక జిల్లాలో డిసిసిబి వైస్ చైర్మన్ పదవి, తన నియోజకవర్గం నుంచి, తనకు అత్యంత నమ్మిన బంటులాంటి పింగళి రమేష్‌కు వచ్చేలా చక్రం తిప్పారట మంత్రి ఈటెల. అలాగే డిసిఎమ్మెస్ చైర్మన్‌గా మంత్రి కొప్పుల ఈశ్వర్ నియోజకవర్గం నుంచి ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, డిసిఎమ్మెస్ వైస్ చైర్మన్‌గా మంత్రి గంగుల నియోజకవర్గం నుంచి ఫక్రూద్దీన్ పేరు అధిష్టానం సీల్డ్ కవర్‌లో పంపించింది.

ఈ సహకార ఎన్నికల్లో కీలకమైన ఈ నాలుగు పదవులనూ తమ వారికి దక్కించుకోవడంలో మంత్రులు సక్సెస్ అయ్యారు. ఎక్కడా నిరసన జ్వాలలు లేకుండా అటు అధిష్టానం నుంచి వచ్చిన సీల్డ్ కవర్లలో పేర్లు ఉండేలా వ్యూహాలు ఫలించాయనే చెప్పాలి. అయితే ఈ పదవులపై ముందు నుంచి ఆశలు పెట్టుకున్న డైరెక్టర్‌లు కొందరు ఈ ఎన్నిక ప్రక్రియకి దూరంగా ఉన్నప్పటికి అవన్నీ సర్దుకుంటాయంటున్నారు గులాబీ నాయకులు. మరోవైపు జిల్లాలో ఉన్న నలుగురు మంత్రులు ఈ సహకార ఎన్నికల్లో తమ వ్యూహాలకు పదునుపెట్టి ఎక్కడా నిరసన జ్వాలలు రాకుండా చేయడంతో అధిష్టానం కూడా సంతృప్తి వ్యక్తం చేసిందట.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories