తెలంగాణలో రైతు రుణ మాఫీ అందని వాళ్ళు ఎందరు? ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజమెంత?
రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. నిరసనలకు దిగింది.
పంట రుణమాఫీని రెండు లక్షల వరకు మాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ఖాళీ ఖజానా హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టాయి. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఆగస్టు 15 లోపుగా 2 లక్షల పంట రుణాలను మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన వారందరికీ ఆగస్ట్ 15 నాటికి రుణమాఫీ చేశామని కూడా ప్రభుత్వం ప్రకటించింది.
రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. నిరసనలకు దిగింది. ఈ విషయమై రెండు పార్టీల మధ‌్య మాటల యుద్ధమే జరుగుతోంది. సాంకేతిక సమస్యలతో రుణమాఫీ అందని రైతులు ఆందోళన బాట పట్టారు. దీన్ని విపక్షాలు రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయి.
మూడు విడతల్లో రుణమాఫీ అమలు
పంట రుణమాఫీని మూడు విడతల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసింది. తొలి విడతలో లక్ష రూపాయల రుణాలను మాఫీ చేశారు. రెండో విడతలో లక్షన్నరను మాఫీ చేశారు. మూడో విడతలో 2 లక్షల వరకు రుణాలను మాఫీ చేశారు.
మూడు విడతల్లో మొత్తం 22 లక్షల 37 వేల 848 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 17 వేల 934 కోట్ల నిధులను జమ చేశారు. తొలి విడతలో 11 లక్షల 50 వేల 193 మంది రైతుల ఖాతాల్లో 6 వేల 98 కోట్లను జమ చేశారు.
రెండో విడతలో 6 లక్షల 40 వేల 823 మంది రైతులకు 6 వేల 190 కోట్లు బ్యాంకుల్లో క్రెడిట్ చేశారు. మూడో విడతలో 4లక్షల 46 వేల 832 మంది రైతులకు 5 వేల 644 కోట్లను విడుదల చేశారు. కేవలం 27 రోజుల్లోనే 22.37 లక్షల మంది రైతుల కుటుంబాలకు రూ.17 వేల 934 కోట్ల రుణమాఫీ నిధులు జమ చేశారు.
టెక్నికల్ సమస్యలతో 80 వేల మంది రైతులకు అందని రుణమాఫీ
పంట రుణమాఫీ నిధులు కొందరు రైతులకు అందలేదు. టెక్నికల్ సమస్యలే ఇందుకు కారణమని అధికారులు గుర్తించారు. బ్యాంకు ఖాతాలు, ఆధార్ నెంబర్లు, పాసు పుస్తకాల్లోని సమాచారం సక్రమంగా ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేశారు.
కుటుంబ నిర్ధారణ జరగని , బ్యాంకులో ఉన్న పేరుకు ఆధార్ లో ఉన్న పేరుకు మధ్య తేడా ఉన్న లబ్దిదారులకు రుణమాఫీ కాలేదు. బ్యాంకులోని టెక్నికల్ కారణాలతోనూ సుమారు 22 వేల ఖాతాల్లో వేసిన డబ్బులు కూడా వెనక్కి వచ్చాయి.
ఇందులో వీటిని సరిచేసి 8 వేల ఖాతాల్లో డబ్బులు తిరిగి జమ చేశారు. బ్యాంకు ఖాతాల్లో రుణమాఫీ నిధులు జమ కాకపోతే అగ్రికల్చర్ అధికారిని కలవాలని ప్రభుత్వం సూచించింది. టెక్నికల్ సమస్యలతో రుణమాఫీ పూర్తి కాని రైతుల కోసం కలెక్టర్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు.
పలు కారణాలతో సుమారు 80 వేల మంది రైతులకు రుణమాఫీ నిధులు అందలేదు. అయితే, ఈ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. రుణమాఫీ అందని వారి కోసం 5 వేల కోట్లను ప్రభుత్వం కలెక్టర్ల వద్ద ఉంచింది.
ఆగస్టు 15 తర్వాత ప్రతిపక్షాల వాదన ఏంటి?
రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులు కనీసం 40 శాతం మంది రైతులకు కూడా అందలేదని బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. 40 లక్షల మంది లక్ష రూపాయాలు రుణం తీసుకుంటే 17 లక్షల మందికి మాత్రమే మాఫీ చేశారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. రుణమాఫీకి స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ గణాంకాల ప్రకారంగా 49,500 కోట్లు అవసరమైతే, కేబినెట్ మాత్రం 31 వేల కోట్లకు ఆమోదం తెలిపిందని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు.
బడ్జెట్ లో 26 వేల కోట్లు కేటాయించి మూడు విడతల్లో 17 వేల 933 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని నిరంజరన్ రెడ్డి విమర్శించారు. ఏకకాలంలో రెండు లక్షల వరకు రుణాన్ని మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయలేదని గులాబీ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు.
రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ తో బీజేపీ జతకట్టింది. రెండు లక్షల వరకు రుణమాఫీ బోగస్ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఎందరు రుణాలు తీసుకున్నారు, ఎన్ని కోట్లు అవసరం, సరైన లెక్కలు చెప్పకుండానే మొక్కుబడిగా కొందరి రుణాలు మాఫీ చేసి ఆందోళనకు గురి చేస్తున్నారని చెప్పారు. రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
విపక్షాల విమర్శలకు ప్రభుత్వ సమాధానం ఏంటి?
అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేసినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. రుణమాఫీ అందని రైతుల నుంచి ఫిర్యాదులు తీసుకొని క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఇచ్చిన మాట మేరకు రుణమాఫీ నిధులను బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్టుగా ఆయన చెప్పారు.
22 లక్షల మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులు జమ చేసినట్టుగా ఆయన చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి 41 లక్షల 78 వేల 892 మంది రైతుల పేర్లపైనే రుణాలున్నాయని బ్యాంకు అధికారులు సమాచారం ఇచ్చారని ఆయన చెప్పారు.
40 బ్యాంకుల నుంచి వచ్చిన జాబితా మేరకు నగదును జమ చేసినట్టుగా ఆయన తెలిపారు. కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో 40 లక్షల మంది రైతుల్లో కేవలం 10 లక్షల మందికి మాత్రమే రుణాలను మాఫీ చేశారని కాగ్ రిపోర్ట్ బయటపెట్టిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
రేవంత్ రెడ్డి ఏమంటున్నారు?
రుణమాఫీపై విపక్షాల విమర్శలను రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు. మూడు విడతల్లో 2 లక్షల రుణాన్ని మాఫీ చేసినట్టుగా ఆయన చెప్పారు. 2022 మే 6న వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ రైతులకు ఇచ్చిన మాట మేరకు 2 లక్షలు రుణమాఫీ చేసినట్టుగా ఆయన చెప్పారు.
పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 28 వేల కోట్లు కూడా రుణమాఫీ చేయలేదని ఆయన ఎద్దేవా చేశారు. రుణమాఫీ కష్టమని ఆర్ధిక నిపుణులు చెప్పినా ఇచ్చిన మాటను నిలుపుకున్నామని ఆయన చెప్పారు. అధికారంలోకి వచ్చిన 8 నెలలు దాటకముందే 2 లక్షలు రుణమాఫీ చేశామని వైరా సభలో ఆయన చెప్పారు.
కేసీఆర్ ప్రభుత్వంలో ఎంతమందికి రుణమాఫీ చేశారు
కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన సమయంలో లక్ష రూపాయాల పంట రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. అయితే విడతల వారీగా రుణమాఫీ చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన నిధులు వడ్డీలకు సరిపోయాయని కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. 2014-15 లో 4 వేల 040 కోట్లు, 2015-16 లో 4040 కోట్లు, 2016-17 లో 4025 కోట్లు, 2017-18 లో 4038 కోట్లను బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసింది.
2018లో కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రెండోసారి కూడా పంట రుణమాపీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా పంట రుణమాఫీకి 2018-19, 2019-20, 2022-23 లో ఎలాంటి నిధులు విడుదలను విడుదల చేయలేదు.
2020-21లో రూ.408.3 కోట్లను 2.96 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేశారు. 2021-22 లో 3,88,908 మందికి 1339.5 కోట్లను ఇచ్చారు. సెకండ్ టర్మ్ లో కూడా అసలు కంటే వడ్డీకే ఎక్కువ నిధులు సర్దుబాటు అయ్యాయి. 20.84 లక్షల ఖాతాలకు సంబంధించి రూ. 8,579 కోట్లను గత ప్రభుత్వం రుణమాఫీ చేయలేదని కాంగ్రెస్ నాయకులు గులాబీ పార్టీపై విమర్శలు చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందెంత? ఇచ్చిందెంత?
పంట రుణమాఫీపై 49, 500 కోట్లు అవసరమని రేవంత్ రెడ్డి సర్కార్ తొలుత భావించింది. ఆ తర్వాత 31 వేల కోట్లను రుణమాఫీ కోసం కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బడ్జెట్ లో 26 వేల కోట్లు కేటాయించింది. అయితే ఇందులో రూ. 17 వేల 933 కోట్లను ఖర్చు చేసిందని బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది.
రుణమాఫీ అందని రైతులకు నిధులు జమ చేసేందుకు మరో 5 వేల కోట్లను ప్రభుత్వం కలెక్టర్ల వద్ద ఉంచింది. రుణమాఫీ కోసం కలెక్టర్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. మరో వైపు ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేయాలని ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది.
రుణమాఫీ కోసం రైతుల ఆందోళన
పంట రుణమాఫీ నిధులు తమ ఖాతాల్లో జమ కాలేదని రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. సాంకేతిక సమస్యలను సాకుగా చూపి తమకు రుణమాఫీ నిధులు దక్కకుండా చూస్తున్నారని వారు విమర్శిస్తున్నారు.
టెక్నికల్ సమస్యలను సరిచేసుకొనేందుకు రైతులు అధికారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ ఆందోళనలకు బీఆర్ఎస్ నాయకులు మద్దతుగా నిలుస్తున్నారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీని అమలు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఆగస్టు 22న రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో నిరసనకు దిగింది.
క్షేత్ర స్థాయిలో ఇంటింటి సర్వే చేయడం ద్వారా రుణమాఫీ అందని రైతులకు న్యాయం చేస్తామని ప్రభుత్వం హామీ ఇస్తోంది. అయితే ఈ అంశాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకునేందుకు విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. రుణమాఫీ అంశాన్ని లబ్దికోసం పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire