Hospitals inflating Covid bills: తీరుమారని కార్పోరేట్.. వెంటిలేటర్ కు రూ. లక్ష వరకు వసూలు
Hospitals inflating Covid bills: ప్రభుత్వం ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా కార్పోరేట్ ఆస్పత్రుల తీరు మారడం లేదు... వెంటిలేటర్ వైద్యం పేరు చెబితే చాలు... లక్షల్లో వసూలు చేస్తున్నారు.
Hospitals inflating Covid bills: ప్రభుత్వం ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా కార్పోరేట్ ఆస్పత్రుల తీరు మారడం లేదు... వెంటిలేటర్ వైద్యం పేరు చెబితే చాలు... లక్షల్లో వసూలు చేస్తున్నారు. ఇదే సమయం అనుకుంటున్నారో.. ఏమో కాని... ప్రభుత్వం హెచ్చరికలను సైతం పెడచెవిన పెడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు సరిపడా వెంటిలేర్లు లేకపోవడంతో ఈ దుస్తితి వస్తోంది.
కోవిడ్‌తో బాధపడుతూ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జనగాం జిల్లా పాలకుర్తికి చెందిన వ్యక్తికి అకస్మాత్తుగా శ్వాస సంబంధ సమస్య తలెత్తింది. ఆయనకు వెంటిలేటర్ సహాయం అవసరమైంది. ఆస్పత్రిలో 105 వెంటిలేటర్లు ఉండగా, అప్పటికే అవన్నీ రోగులతో నిండిపోయాయి. బాధితున్ని గాంధీకి తీసుకెళ్లాల్సిందిగా వైద్యులు బాధితుని బంధువులకు సూచించారు. విధిలేని పరిస్థితుల్లో శనివారం రాత్రి అతికష్టం మీద గాంధీకి తీసుకొచ్చారు. తీరా.. ఇక్కడ వెంటిలేటర్లు ఖాళీ లేవని వైద్యులు చేతులెత్తేశారు.
అప్పటికే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో స్థానికంగా ఉన్న ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వెంటిలేటర్ చికిత్సకు రోజుకు రూ.లక్ష ఖర్చు అవుతుందని, ఇందుకు అంగీకరిస్తేనే అడ్మిట్ చేస్తామని సదరు ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేయడంతో చేసేది లేక వారు అడిగినంత చెల్లించి అడ్మిట్ చేయాల్సి వచ్చింది. ఇలా పాలకుర్తికి చెందిన వ్యక్తికి మాత్రమే కాదు..కోవిడ్ బారిన పడి హోం ఐసోలేషన్‌లో ఉన్న అనేక మంది ఆఖరి నిమిషంలో ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కోవాల్సి వస్తుంది. తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(టిమ్స్), కింగ్‌కోఠిలో 50, ఛాతి ఆస్పత్రిలో 28 వెంటిలేటర్ల చొప్పున ఉన్నప్పటికీ..టెక్నీషియన్లు, ఇతర వైద్య సిబ్బంది కొరత వల్ల వాటిని పూర్తిస్థాయిలో వినియోగించలేక పోతున్నారు.
గాంధీ ఐసీయూ హౌస్‌ఫుల్
1890 పడకల సామర్థ్యం ఉన్న ప్రతిష్టాత్మాక గాంధీ జనరల్ ఆస్పత్రిలో రోగుల నిష్పత్తికి తగినన్ని వెంటిలేటర్లు అందుబాటులో లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి చేరుకున్న పేద, మధ్య తరగతి రోగులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. సాధారణ ఐసోలేషన్ వార్డులో 390 పడకలు ఏర్పాటు చేయగా, ప్రస్తుతం 144 మంది చికిత్స పొందుతున్నారు. 1000 పడకలకు ఆక్సిజన్ ఏర్పాటు చేయగా, వీటిలో 117 మంది చికిత్స పొందుతున్నారు. ఇక కీలకమైన ఐసీయూలో 500 వెంటిలేటర్ పడకలు ఉండగా, ప్రస్తుతం ఇవన్నీ రోగులతో నిండిపోయాయి.
అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన వారికి వెంటిలేటర్ దొరకని పరిస్థితి. అంతేకాదు ఆక్సిజన్, సాధారణ ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్న వారిలో ఎవరికైనా వెంటిలేటర్ అనివార్యమైతే..అప్పటికప్పుడు ఇతరులకు అమర్చిన వెంటిలేటర్ తొలగించి అవసరమైన వారికి అమర్చాల్సి వస్తుంది. కొత్తగా ఆస్పత్రికి చేరుకున్న వారికి వెంటిలేటర్ కావాలంటే..ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో ఎవరో ఒకరు చనిపోతే కానీ..సమకూర్చలేని దుస్థితి. విధిలేని పరిస్థితుల్లో చాలా మందిని సాధారణ ఆక్సిజన్‌తోనే నెట్టుకొస్తుండటం గమనార్హం. ఆస్పత్రిలో రోగుల నిష్పత్తికి తగినన్ని వెంటిలేటర్లు లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో బాధితులు కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తుంది. పలు ఆ స్పత్రులు దీన్ని అవకాశంగా తీసుకుని ఇష్టం వచ్చినట్లు బిల్లులు వసూలు చేస్తున్నాయి.
ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు...
ప్రభుత్వ గాంధీ ఆస్పత్రిలోనే కాదు...సికింద్రాబాద్, మాదాపూర్, మలక్‌పేట్, బంజారాహిల్స్, సోమాజిగూడలోని పలు ప్రతిష్టాత్మాక కార్పొరేట్ ఆస్పత్రుల్లోని ఐసీయూ వెంటిలేటర్ పడకలు కూడా దాదాపు నిండిపోయాయి. ఇతర ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకలు ఖాళీగా ఉన్నప్పటికీ..వాటిలో చేరేందుకు వెనుకాడుతున్నారు. ఎంత ఖర్చైనా ఫర్వాలేదు కానీ...ప్రతిష్టాత్మాక ఆయా కార్పొరేట్ ఆస్పత్రుల్లోనే చేరాలని భావిస్తున్నారు. రోగుల బంధువుల్లో ఉన్న ఈ బలహీనతను ఆయా ఆస్పత్రులు ఆసరాగా చేసుకుంటున్నాయి.
అడిగినంత చెల్లించేందుకు ముందుకు వచ్చిన వారికే ఐసీయూ పడకలు కేటాయిస్తున్నాయి. వెంటిలేటర్ చికిత్సలకు ప్రభుత్వం రోజుకు రూ.9000 ధర నిర్ణయించగా..ఆయా ఆస్పత్రులు ఒక్కో వెంటిలేటర్ రోగి నుంచి రోజుకు రూ.80 నుంచి 90 వేల వరకు వసూలు చేస్తున్నాయి. బాధితులు చెల్లించిన డబ్బుకు కనీసం రసీదులు కూడా ఇవ్వడం లేదంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతార్ చేస్తున్న ఆయా కార్పొరేట్ ఆస్పత్రులపై 1200పైగా ఫిర్యాదులు అందినా ఇప్పటి వరకు రెండు మినహా మరే ఇతర ఆస్పత్రిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అంతేకాదు ప్రేవేటు ఆస్పత్రుల్లో 50 శాతం పడకలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోనున్నట్లు ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు స్పష్టమైన విధివిధానాలు అంటూ ఖరారు చేయక పోవడంతో ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire