కోమటిరెడ్డి బ్రదర్స్‌లో చీలిక వచ్చిందా? సోదరుల్లో రాజకీయం, చిచ్చు పెడుతోందా? ఒకపక్క గాంధీభవన్ పీఠం కోసం, అన్న వెంకట్‌రెడ్డి హస్తినలో రాజకీయం...
కోమటిరెడ్డి బ్రదర్స్‌లో చీలిక వచ్చిందా? సోదరుల్లో రాజకీయం, చిచ్చు పెడుతోందా? ఒకపక్క గాంధీభవన్ పీఠం కోసం, అన్న వెంకట్‌రెడ్డి హస్తినలో రాజకీయం చేస్తుంటే ఇక్కడ తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి సరికొత్త పాచికలు వేస్తున్నారా? త్వరలోనే తాను బీజేపీలో చేరబోతున్నా అంటూ కామెంట్ చేసి కలకలం రేపారు. రాజకీయ వ్యూహంలో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేశారా? లేదంటే అధిష్టానాన్ని నయాన్నో భయాన్నో ఒప్పించే ఎత్తుగడ వేశారా? ఒక పార్టీలో ఉంటూనే మరో ప్రత్యర్థి పార్టీ గురించి గొప్పగా మాట్లాడటమే కాకుండా అందులో చేరబోతున్నానంటూ రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. ఇంతకీ కోమటిరెడ్డి బ్రదర్స్ లెక్కేంటి?
కోమటిరెడ్డి బ్రదర్స్. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని రాజకీయ నాయకులు. ముఖ్యంగా తెలంగాణ పాలిటిక్స్‌లో ఫైర్ బ్రాండ్ లీడర్లు. అలాంటి నాయకులు ఇప్పుడు తలోదారి అవ్వబోతున్నారా? అన్న మాటే వేదంగా, అన్న మాటే శాసనంగా, అన్న వేసిన దారిలో నడిచిన తమ్ముడి అవుటర్ వాయిస్‌కు అర్థం ఏంటి? తిరుమల వెంకన్న సాక్షిగా తాను కమలం తీర్థం పుచ్చుకోబోతున్నాన్న రాజగోపాలుడి మాట వెనుకున్న వ్యూహమేంటి?
కోమటిరెడ్డి బ్రదర్స్‌లో వెంకట్‌రెడ్డి కాస్త సాఫ్ట్‌గా కనిపించినా తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి దుకూడుగా ముందుకు వెళ్లే రకం. ఆ వ్యక్తిత్వమే ఆయనను రాజకీయాల్లో కీలకమై నాయకుడిగా ఎదిగేలా చేసింది. అలాంటి రాజగోపాల్‌రెడ్డి తాజాగా కాంగ్రెస్ అధిష్టానానికి ఓ వార్నింగ్‌లాంటి మెసేజ్ పంపించారు. ఆయన మాటలపై గాంధీభవన్ గుసగుసలాడుతూనే ఓపెన్‌గా కొన్ని కామెంట్స్ చేస్తోంది.
అన్నయ్య వెంకట్‌రెడ్డికి పీసీసీ బాధ్యతలు అప్పగించాలన్న దానిపై ఒక క్లారిటీ మీదున్న రాజగోపాల్‌రెడ్డి, అన్నను సారథి చేయకుంటే పార్టీ మారుతామని బెదిరింపులకు దిగుతున్నారన్న చర్చ నడుస్తోంది. ఇలా ముందే పార్టీ మారుతున్నట్లు ప్రకటించి, అధిష్టానానికి హెచ్చరికలు పంపిన్నట్లుగానే హస్తం పార్టీ శ్రేణులు భావిస్తున్నాయట. పార్టీ మారాలనుకున్న నేతలు సైలెంటుగా కండువా కప్పుకునేదాకా రెండో కంటికి తెలియనియ్యరు. అంత ఈజీగా బయటపడరు. కానీ అందుకు భిన్నంగా అలాంటిది రాజగోపాల్‌రెడ్డి, ముందే పార్టీ మారుతానని చెప్పడం వెనుక బ్రదర్స్ వ్యూహం ఉండే ఉంటుందన్న అనుమానాలు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది.
నమ్ముకున్న పార్టీలో ఎలివేషన్ లేదు పార్టీ పగ్గాలు దక్కుతాయన్న ఆశా లేదు అందివచ్చిన అవకాశాలని వినియోగించడంలో పార్టీలో ఇతర నేతల సహకారం అసలే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యర్ధుల నుంచి అనూహ్యంగా వస్తున్న బంపర్ ఆఫర్లు సయోధ్య ఈ ఆలోచనలే కోమటిరెడ్డి బ్రదర్స్‌లో ఒకరైన రాజగోపాల్‌రెడ్డి రూటు మారాలన్న నిర్ణయానికి కారణమయ్యాయా? అవుననే అంటున్నాయి గాంధీభవన్ రాజకీయాలు.
ఒకవైపు నుంచి పెరుగుతున్న ఒత్తిడి, మరోవైపు కాంగ్రెస్‌లో సరైన గుర్తింపు లేదన్న భావన, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని మరోలా ఆలోచించేలా చేసిందన్న టాక్ నడుస్తోంది. కాంగ్రెస్‌లో కీలక బాధ్యతలు దక్కుతాయని ఆశిస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఇంకా క్లారిటీ రాలేదు. ఇన్నాళ్లూ నమ్ముకొని ఉంటున్న హస్తం పార్టీపై పై చేయి సాధించాలన్న ఆలోచనతోనే తిరుమలలో అలా మాట్లాడి ఉంటారన్న వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటున్న కోమటిరెడ్డి బ్రదర్స్ అధికార పక్షాన్ని విమర్శించడంలో స్వపక్ష నేతలను సైతం తూర్పారబట్టడంలోనూ దిట్ట. కానీ ఇప్పుడు ఇద్దరు నేతల్లో కనిపిస్తున్న మార్పుపై రాజకీయ చర్చ నడుస్తోంది. అందులో భాగమే, ఆ వ్యూహంలో కోణమే తమ్ముడి పార్టీ మార్పు ప్రకటనగా చెప్పుకుంటున్నారు.
2014, 2018లో పార్టీ ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీపై ఇద్దరు అన్నదమ్ములు ఓ రేంజ్‌లో విమర్శలు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అయితే, కాంగ్రెస్ నేతలను తీవ్రంగా తిట్టిపోశారు. రాహుల్‌గాంధీతో పాటు అప్పటి ఇంచార్జ్ కుంతియా, నాటి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అదే నోటితో మోడీతో పాటు బీజేపీ మీద ప్రశంసలు కురిపించారు. అప్పట్లో బీజేపీలో చేరడానికే రాజగోపాల్‌రెడ్డి ఢిల్లీ వెళ్లారన్న చర్చ కూడా జోరు మీద నడిచింది. ఇదే మాటను మొన్న తిరుమలలో కూడా ప్రస్తావించారు రాజగోపాల్‌రెడ్డి.
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎప్పటినుంచో టీపీసీసీ పీఠంపై కన్నేశారు. ఆ కుర్చీ కోసమే అనేకసార్లు ఢిల్లీ వెళ్లారు. ఒక్క అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తానని అన్నారు. అటు రేవంత్‌రెడ్డి ఇటు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్లు మాత్రమే టీపీసీసీ రేసులో వినిపిస్తున్నాయి. కానీ అన్న వెంకట్‌రెడ్డికి టీపీసీసీ కావాలని తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి ఇంతవరకూ, ఎక్కడా డిమాండ్ చేయలేదు కానీ ఇలా పార్టీ మారుతానని ప్రకటించి అధిష్టానాన్ని దారి తెచ్చుకునే వ్యూహంలో భాగంగానే ఈ ప్రకటన చేశారన్న చర్చకు మాత్రం ఎవ్వరూ సమాధానం ఇవ్వడం లేదు.
రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి, కమలంతో దోస్తీకి సై అన్నప్పటి నుంచి, వెంకటరెడ్డి కూడా పార్టీ మారతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పటికప్పుడు కాంగ్రెస్‌ను వీడేది లేదని ప్రకటిస్తున్నారు. అంతేకాదు బహిరంగంగా ఖండించారు. కూడా. అయినా కోమటిరెడ్డి పార్టీ మారతారన్న ఊహాగానాలు మాత్రం, పూర్తిగా చల్లారడం లేదు. ఎందుకంటే మొన్న దుబ్బాక, తర్వాత గ్రేటర్ ఫలితాల తర్వాత బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ పకడ్బందీగా సాగుతోంది. రాష్ట్రంలో కూడా వలసలు పెరగడం, టీఆర్‌ఎస్‌లోనూ కాంగ్రెస్ నుంచి జంపింగ్‌లతో, క్యాడరలో నిస్తేజం నెలకొంది. అలాంటి సమయంలోనే తాను బీజేపీలోకి వెళ్తున్నాను అన్న ప్రకటనతో ఈక్వేషన్స్ కచ్చితంగా మారుతాయన్న ప్రచారం జరుగుతోంది.
పీసీసీ పదవి కోసం రేవంత్‌రెడ్డి గట్టిగా పోటీ పడుతుండటం, ఆయన వైపే అధిష్టానం కూడా మొగ్గుచూపుతుందన్న ప్రచారాల మధ్య రాజగోపాల్‌రెడ్డి తాను పార్టీ మారుతానని ప్రకటించారనే చర్చ బలంగా వినిపిస్తోంది. అన్నయ్యకి గనుక పీసీసీ పదవి ఇవ్వకుంటే మొదట తాను, తర్వాత అన్న పార్టీ మారడానికి సిద్ధమన్న ముందస్తు హెచ్చరికలు పంపిన్నట్లు కొందరు నేతలు రాజగోపాల్ ప్రకటనపై చర్చించుకుంటున్నారు. ఇలా గతంలో ఎప్పుడైనా పార్టీ మార్పుపై తమ్ముడు ఏ ప్రకటన చేసినా వెంటనే స్పందించే వెంకట్‌రెడ్డి తమ్ముడి తాజా ప్రకటన తర్వాత స్పందించకపోవడం కూడా వ్యూహంలో భాగమన్న ప్రచారం నడుస్తోంది. కాకపోతే ఈ ప్రకటనను కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నారు.
ఇక్కడ రాజకీయ విశ్లేషకులు ఓ సమీకరణాన్ని చూపెడుతున్నారు. ఎలా అంటే, ఇప్పటి వరకు పార్టీ మారాలని నిర్ణయించుకున్న వాళ్లు.. ఇలా ముందు ప్రకటించి మరీ ఆయా పార్టీల్లో చేరలేదు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన డీకే అరుణే కానీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డో కానీ ఇలా ముందుగా చెప్పలేదు. రెండో కంటికి తెలియకుండా సైలెంట్‌గా పార్టీ కండువా కప్పుకునే వరకు విషయం బయటపడలేదు. అంతెందుకు మొన్నీ మధ్య విజయశాంతి కూడా అంతే. కాంగ్రెస్ నుంచి కమలం పార్టీలో చేరే వరకు ఏమాత్రం లీకులు ఇవ్వలేదు. కానీ రాజగోపాల్‌రెడ్డి మాత్రం తాను బీజేపీలో చేరడానికి సిద్ధమని ముందుగా ప్రకటించి అనుమానాలకు దారి తీశారని చెప్పుకుంటున్నారు. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం తనకేమీ తెలియదన్నట్టు మాట్లాడారు.
వాస్తవానికి తాను బీజేపీలో చేరుతానని రాజగోపాల్‌రెడ్డి చెప్పింది ఇది ఫస్టేమీ కాదు. గతంలో చాలాసార్లు, చాన్నాళ్ల కిందటే కమలం పార్టీకి అనుకూలంగా మాట్లాడారు. కానీ తర్వాత మనసు మార్చుకున్నారు. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఎక్కడా కనిపించలేదు. అలాంటిది సడన్‌గా ఆయన తిరుపతిలో ప్రత్యక్షమై సంచలన ప్రకటన చేశారు. ఏమైనా పీసీసీ పీఠం దక్కించుకోవడానికే బ్రదర్స్ చివరి అస్త్రంగా ఈ రాజకీయ పాచిక వేసినట్టు రాజకీయవర్గాల్లో చర్చించుకుంటున్నారు. మరి వీరి హెచ్చరికలను కాంగ్రెస్ అధిష్టానం పరిగణలోనికి తీసుకుంటుదా లేక సీరియస్‌గా తీసుకుంటుందా? చూడాలి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire