రెవెన్యూ శాఖలో అవినీతి బాగోతాలు.. అధికారాల కోతతో.. అవినీతి బాటలో అధికారులు..

రెవెన్యూ శాఖలో అవినీతి బాగోతాలు.. అధికారాల కోతతో.. అవినీతి బాటలో అధికారులు..
x
Highlights

తెలంగాణ రెవెన్యూ అధికారుల అవినీతి తారాస్థాయికి చేరుకుంటోంది. వివాదాస్పద భూములను క్యాష్‌ చేసుకుని అందిన కాడికి దోచుకుంటున్నారు. వందలు, వేలు కాదు లక్షలు...

తెలంగాణ రెవెన్యూ అధికారుల అవినీతి తారాస్థాయికి చేరుకుంటోంది. వివాదాస్పద భూములను క్యాష్‌ చేసుకుని అందిన కాడికి దోచుకుంటున్నారు. వందలు, వేలు కాదు లక్షలు దోచుకుంటూ కోట్లకు పడగెత్తుతున్నారు. బంజారాహిల్స్‌ ల్యాండ్‌ కేసులో ముగ్గురు అధికారులు అడ్డంగా బుక్కవటమే వారి అవినీతి బాగోతానికి నిదర్శనంగా నిలుస్తోంది. అయితే రెవెన్యూ శాఖలో రాబోతున్న సంస్కరణలే ఈ అవినీతి దందాకు కారణమనే ఆరోపణలు వస్తున్నాయి.

తెలంగాణ రెవెన్యూ శాఖలో కీలక సంస్కరణలకు తుదిమెరుగులు దిద్దుతుంది ప్రభుత్వం. క్షేత్ర స్థాయిలో ఆ శాఖకు వెన్నెముక అయిన తహశీల్దార్ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతోంది. ప్రస్తుతం భూ వ్యవహారాలపై సర్వాధికారాలు ఎమ్మార్వో లకే ఉండగా అందులో సగం అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం కత్తెర వేయబోతుంది.

రెవెన్యూ అంశాల్లోనే కాకుండా తసీల్ధార్లు ప్రతిష్టాత్మకంగా భావించే రేషన్ వ్యవహారాల్లోను కొత విధిస్తోంది. రైతు సంబంధ వ్యవహారాల్లోనూ తహశీల్ధార్ లు పాత్రను పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం ఎమ్మార్వోలకు 44 అధికారాలు ఉండగా సంస్కరణలు చేపడితే అధికారాలు 20కి తగ్గే అవకాశాలున్నాయి.

ఇలా తహశీల్దార్ల అధికారాలు కత్తిరింపులకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా వార్తలు బయటకి పొక్కగానే, కొందరు తహశీల్దార్లు అవినీతి వైపు అడుగులు వేస్తున్నారు. దీపం ఉన్నపుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్లుగా అధికారాలు చేజారే లోపే తమ పెండింగ్‌ లావాదేవీలను క్లియర్‌ చేసే పనిలో పడ్డారు. బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి లక్షలు వసూలు చేస్తున్నారు.

ఇలా రెవెన్యూ శాఖలో వస్తోన్న మార్పులతో అధికారులు వివాదాస్పద భూములను టార్గెట్‌ చేశారనే టాక్‌ వినిపిస్తోంది. రీసెంట్‌గా ఆ శాఖలో అవినీతిని బహిర్గతం చేసిన బంజారాహిల్స్‌ భూ వివాదం కూడా ఈ కోవకు చెందిందే అనే ఆరోపణలొస్తున్నాయి. ఒక్క వివాదాస్పద భూ వ్యవహారంలో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు పట్టుబడటంతో ఈ వివాదం హాట్‌ టాపిక్‌గా మారగా మిగిలిన అధికారులపైనా దృష్టి పెట్టింది ఏసీబీ.

బంజారాహిల్స్ రోడ్‌‌ నెంబర్ 14లోని ఓ వివాదాస్పద భూమి అవినీతి బాగోతాన్ని బయటపెట్టింది. సర్వే నెంబర్ 17,19 లో ఉన్న ఎకరం 20 గుంటల ఈ స్థలానికి సర్వే చేయించాలని ఖలీద్‌ అనే ఓ వ్యక్తి 2019 డిసెంబర్‌లో దరఖాస్తు పెట్టుకున్నారు. కానీ అధికారులు పట్టించుకోకపోవటంతో 5నెలల క్రితం భూమి తనకు చెందిందంటూ బోర్డు పెట్టాడు ఖలీద్‌. దీంతో ఆ భూమిని ఆక్రమించారంటూ బంజారాహిల్స్ పీఎస్‌లో ఎమ్మార్వో సుజాత ఫిర్యాదు చేసింది.

ఇక చేసేదేమీ లేక బాధితుడు ఖలీద్ హైకోర్టును ఆశ్రయించాడు. విచారణ కొనసాగిస్తుండగానే కేసు మాఫీ చేస్తానని ఎస్సై రవీంద్ర నాయక్ డబ్బులు డిమాండ్ చేశాడు. ఆ తరువాత యాబై లక్షలు ఇస్తే భూమి నీకే అని రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి ఖలీద్‌తో బేరం మొదలుపెట్టాడు. ఈ విషయంపై ఎమ్మార్వో సుజాతను కలవగా భూమి దక్కాలంటే రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ చెప్పినట్లు చేయాలనటంతో ఖలీద్‌ 30 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో షేక్ పేట్ తహశీల్దార్ కార్యాలయం దగ్గర 15లక్షలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు ఆర్‌ఐ నాగార్జున రెడ్డి.

ఈ అవినీతి బాగోతంలో షేక్‌పేట ఎమ్మార్వో సుజాత హస్తం కూడా ఉందని నిర్ధారించిన అధికారులు ఆమెను అరెస్ట్‌ చేశారు. ఇక కేసు మాఫీకి మూడు లక్షలు డిమాండ్‌ చేసిన బంజారాహిల్స్‌ ఎస్సై రవీంద్రనాయక్‌‌ను కూడా అరెస్ట్‌ చేశారు. బంజారాహిల్స్‌ కేసు విచారణతో సంచలన విషయాలు బయటకు రావటంతో రాష్ట్ర వ్యాప్తంగా వివాదాల్లో ఉన్న భూములపై నిఘా పెట్టారు ఏసీబీ అధికారులు. మెదక్ , రంగారెడ్డి , అదిలాబాద్ , మేడ్చల్ జిల్లాల్లో దాదాపు 36 మంది తహశీల్దార్లపై ఫిర్యాదులు అందటంతో వారిపై ఫోకస్‌ పెట్టారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories