Weather Report: తెలగురాష్ట్రాలను ఠారెత్తిస్తోన్న ఎండలు

High Temperature In Telugu States
x

Weather Report: తెలగురాష్ట్రాలను ఠారెత్తిస్తోన్న ఎండలు 

Highlights

Weather Report: రాబోయే 5 రోజలు మరిత పెరగనున్న ఎండలు

Weather Report: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. భానుడు నిప్పులు కక్కుతున్నాడు. మాడు పగిలే ఎండల తీవ్రతతో జనాలు విలవిలలాడిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుంటే.. రాత్రి సమయంలోనూ వేడి గాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాష్ట్రంలో సగటున 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో అయితే.. 45 డిగ్రీలకు చేరింది. రాబోయే 5 రోజులు మరింత పెరగనున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తీవ్రమైన ఎండల దృష్ట్యా తెలంగాణలోని 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.

ఉమ్మడి కరీంగనర్ జిల్లాలో భానుడు భగభగమంటున్నాడు. కరీంనగర్ జిల్లాలో 41.7 డిగ్రీలు, జగిత్యాల జిల్లాలో 41.8, పెద్దపల్లి జిల్లాలో 40.6, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 41.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా 32.9 డిగ్రీల సెల్సియస్ పెరగటంతో ఉక్కపోత పెరిగిపోతోంది. మరో 3 రోజులు ఎండలు పెరుగుతుండటం.. వడగాల్పులు వీస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. వీటితో పాటు.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల్, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.

అటు ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత శనివారం నమోదైంది. నంద్యాల జిల్లా చాగలమర్రిలో 45.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటేశాయి. ఇక చిత్తూరు, తిరుపతి జిల్లా రేణిగుంటలో 45.7°C ఉష్ణోగ్రతలు నమోదైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 77 మండలాల్లో తీవ్రవడగాల్పులు,98 మండలాల్లో స్వల్ప వడగాల్పులు వీచినట్లు వాతావరణ అధికారులు తెలిపారు. ఓవైపు మండుతున్న ఎండలు, మరోవైపు ఉక్కపోతతో జనం విలవిల్లాడిపోతున్నారు. ఈరోజు కూడా 58 మండలాల్లో తీవ్రవడగాల్పులు,148 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. సోమవారం 51 మండలాల్లో తీవ్రవడగాల్పులు,111 వడగాల్పులు వీచే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

రోజురోజుకూ పెరుగుతున్న ఎండలు, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో.. అమరావతి వాతావరణ కేంద్రం ఊరట నిచ్చే వార్త చెప్పింది. వచ్చే మూడురోజులు ఉత్తరకోస్తాలో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో దక్షిణ ఛత్తీస్‌గఢ్, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమైన ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా, యానాంలలో రాబోయే మూడు రోజులు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది.

ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు, రేపు ఉత్తరకోస్తాలో ఒకటి రెండుచోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి జల్లులు కురుస్తాయని.. మరికొన్ని చోట్ల వేడి, తేమతో కూడిన వాతావరణం ఏర్పడుతుందని తెలిపింది. అలాగే తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో ఈరోజు, రేపు వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. వడగాల్పులు వీస్తాయని అంచనా వేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories