Chennamaneni Ramesh: చెన్నమనేని రమేష్ పౌరసత్వం వివాదం ఏంటి?
Chennamaneni Ramesh: చెన్నమనేని రమేశ్ పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం చేయడంతో మరోసారి ఆయన పౌరసత్వ వివాదం చర్చకు వచ్చింది.
Chennamaneni Ramesh:
వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడేనని తెలంగాణ హైకోర్టు సోమవారం తీర్పును వెల్లడించింది. భారత పౌరసత్వాన్ని కేంద్రం రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ రమేష్ దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
1956 ఫిబ్రవరి 3న ఆయన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జన్మించారు. రమేశ్ తండ్రి చెన్నమనేని రాజేశ్వరరావు. రాజేశ్వరరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీపీఐ కీలక నాయకులు. ఉమ్మడి ఏపీ రాష్ట్ర అసెంబ్లీకి ఆయన పలు దఫాలు ఎన్నికయ్యారు. రాజేశ్వరరావు సీపీఐ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నమనేని రమేశ్ బాబు వేములవాడ అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచారు. అప్పట్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగిన ఆది శ్రీనివాస్ పై 1821 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత రమేశ్ పౌరసత్వంపై ఆది శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయమై హైకోర్టును ఆశ్రయించారు.
ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రమేశ్ బాబు టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరారు.తెలంగాణ ఉద్యమ సాధన కోసం అప్పట్లో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్లారు. ఇలా 2010లో రమేశ్ బాబు రాజీనామాతో వేములవాడ అసెంబ్లీ స్థానానికి కూడా ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికల్లో కూడా రమేశ్ బాబు గెలిచారు. 2014, 2018 ఎన్నికల్లో కూడా రమేశ్ బాబు విజయం సాధించారు. రమేశ్ బాబు పై కాంగ్రెస్ అభ్యర్ధిగా ఆది శ్రీనివాస్ పోటీ చేసిన ప్రతిసారి ఓటమి పాలయ్యారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రమేశ్ బాబుకు టిక్కెట్టు ఇవ్వలేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి ఆది శ్రీనివాస్ గెలిచారు.
రమేశ్ బాబు జర్మనీకి ఎందుకు వెళ్లారు?
రమేశ్ బాబు అగ్రికల్చర్ లో ఎమ్మెల్సీని పూర్తి చేశారు. 1987లో జర్మనీ హంబోల్డ్ యూనివర్శిటీ ఆఫ్ బెర్లిన్ నుంచి ఆయన పీహెచ్ డీ పట్టా పొందారు. 1990లో ఆయన జర్మనీకి వెళ్లారు. అక్కడే ఉద్యోగం చేశారని ఆయన ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు.1993లో రమేశ్ బాబుకు జర్మనీ పౌరసత్వం వచ్చింది. దీంతో ఆయన తన భారతీయ పాస్ పోర్టును అప్పగించారు. 2008లో చెన్నమనేని రమేశ్ బాబు ఇండియాకు తిరిగి వచ్చారు. భారతీయ పౌరసత్వం కోసం తిరిగి దరఖాస్తు చేసుకున్నారు. 2009 ఎన్నికల్లో ఆయన వేములవాడ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు.
రమేశ్ బాబు పౌరసత్వంపై పోరాటం చేసిన ఆది శ్రీనివాస్
2009 లో వేములవాడ అసెంబ్లీ స్థానం నుంచి చెన్నమనేని రమేశ్ గెలిచిన తర్వాతి నుంచి ఆయన పౌరసత్వంపై కాంగ్రెస్ అభ్యర్ధి ఆది శ్రీనివాస్ పోరాటం చేస్తున్నారు.2009ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆది శ్రీనివాస్ రమేశ్ పౌరసత్వంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2010 ఉప ఎన్నిక సమయంలో కూడా ఆయన ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించారు. ఆ సమయంలో వేములవాడ ఎన్నికలను నిలిపివేయాలని ఈసీ ఆదేశించింది. దీనిపై అప్పట్లో బీఆర్ఎస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికలు జరపాలని అప్పట్లో హైకోర్టు ఆదేశించింది. దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్ కు వెళ్లారు ఆది శ్రీనివాస్. ఆది శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా 2013లో ఆయన ఎమ్మెల్యే పదవిని రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశించింది. దీనిపై రమేశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. 2017 డిసెంబర్ లో కేంద్ర హోంశాఖ ఆదేశాలతో రమేశ్ భాబు పౌరసత్వం రద్దైంది. హోంశాఖ హైకోర్టును సంప్రదించవచ్చని చెప్పడంతో మళ్లీ బంతి హైకోర్టుకు చేరింది. దీనిపై శ్రీనివాస్ పట్టువదలకుండా పోరాటం చేశారు. దీంతో 2019 నవంబర్ 19న రమేశ్ బాబు పౌరసత్వాన్ని రద్దు చేసింది కేంద్రం.
హైకోర్టులో చెన్నమనేని రమేశ్ పిటిషన్
తన భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ ను రద్దు చేయాలని కోరుతూ చెన్నమనేని రమేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రెండు దేశాల పౌరసత్వాన్ని రమేశ్ కలిగి ఉన్నారని ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా అడిషనల్ సొలిసిటర్ జనరల్ సూర్యకిరణ్ రెడ్డి హైకోర్టులో వాదించారు. పౌరసత్వచట్టంలోని సెక్షన్ 10 ప్రకారంగా మరోటి చట్టంలోని సెక్టన్ 7 బీ సిటిజన్ ఆఫ్ ఇండియా హోదా కలిగి ఉన్నారని చెప్పారు. రెండు చోట్ల వివిధి కేటగిరిల కింద పౌరసత్వం కలిగి ఉండడం చట్టం అనుమతించదని కోర్టుకు తెలిపారు. రెండు పౌరసత్వాల్లో ఒక దానిని వదులుకోవాలని కేంద్రం సూచించింది. రెండు పౌరసత్వాలకు సంబంధించిన పత్రాలను కేంద్రం కోర్టు ముందుంచింది. దీనిపై ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు. దీనిపై ఇవాళ తీర్పును సోమవారం వెల్లడించింది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire