టీపీసీసీ కొత్త బాస్ ఎవరు?...రేసులో ముందుంది వీళ్లే...

Here are the Leaders in Race Got TPCC
x

టీపీసీసీ కొత్త బాస్ ఎవరు?...రేసులో ముందుంది వీళ్లే...

Highlights

తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి ఎంపిక కోసం కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు చేస్తుంది. టీపీసీసీ అధ్యక్ష పదవికి కొత్తవారిని నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా జాతీయ నాయకత్వాన్ని కోరారు.

జూలై 7తో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పదవీ కాలం ముగుస్తుంది. పీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు కాబట్టి, ఇప్పుడు ఆ పదవిలో మరొక సీనియర్ నేతను నియమించాల్సి ఉంది.

టీపీసీసీ బాస్‌ను ప్రకటించే సమయం సమీపిస్తుండడంతో పార్టీలోని ఆశావహులు ఇప్పటికే దిల్లీలో మకాం వేశారు. కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ఈ విషయమై రాష్ట్రంలోని కీలక నాయకుల నుండి అభిప్రాయాలను తెలుసుకుంటోంది.

టీపీసీసీ చీఫ్ ఎంపిక పనిలో దీపాదాస్ మున్షీ

తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి ఎంపిక కోసం కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు చేస్తుంది. టీపీసీసీ అధ్యక్ష పదవికి కొత్తవారిని నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా జాతీయ నాయకత్వాన్ని కోరారు. ఈ దిశగా పార్టీ నాయకత్వం కసరత్తు ప్రారంభించింది. సామాజిక సమీకరణలు కూడా పీసీసీ అధ్యక్ష ఎంపికలో కీలకంగా మారనున్నాయి.

వారం రోజులుగా రాష్ట్రానికి చెందిన కీలక నాయకులు దిల్లీలోనే ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నాలుగైదు రోజులుగా హస్తినలోనే ఉన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ అధ్యక్షులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దిల్లీకి వెళ్లారు. పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ దీపాదాస్ మున్షి పీసీసీ అధ్యక్ష ఎంపిక కోసం నాయకుల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు.

టీపీసీసీ చీఫ్ రేసులో ఎవరెవరు...

తెలంగాణ పీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్న నాయకులు అధిష్టానం పెద్దలను ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి రెడ్డి సామాజిక వర్గానికి దక్కింది. డిప్యూటీ సీఎం పదవి దళిత సామాజిక వర్గానికి కేటాయించారు. రాష్ట్ర జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు పీసీసీ అధ్యక్ష పదవిని కేటాయించాలని ఆ సామాజిక వర్గానికి చెందిన పార్టీ నాయకులు కోరుతున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవిని కేటాయించిన సమయంలో బీసీ సామాజిక వర్గానికి పీసీసీ అధ్యక్ష పదవిని కేటాయించిన విషయాన్ని ఆ పార్టీ నాయకులు గుర్తు చేస్తున్నారు.

బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ లు బీసీ సామాజిక వర్గం నుండి ఈ పదవికి రేసులో ముందంజలో ఉన్నారు. ఎమ్మెల్యే టిక్కెట్టు దక్కని కారణంగా ఆయనకు ఎమ్మెల్సీ పదవిని పార్టీ నాయకత్వం కట్టబెట్టింది. ఎల్ బీ నగర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసినా మధు యాష్కీ గెలవలేదు. రాహుల్ గాంధీతో మంచి సంబంధాలున్న యాష్కీ కూడా పీసీసీ చీఫ్ రేసులో ఉన్నారు. బీసీ సామాజిక వర్గం నుండి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పేరును కూడా అధిష్టానం పరిశీలనలో ఉంది.

రెడ్డి సామాజిక వర్గానికే ఈ పదవిని కేటాయించాల్సి వస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేబినెట్ లో చోటు కోరుకుంటున్నారు. కేబినెట్ బెర్త్ దక్కకపోతే పీసీసీ చీఫ్ పదవిని కట్టబెట్టే అవకాశం లేకపోలేదనే ప్రచారం కూడ పార్టీ వర్గాల్లో ఉంది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా పీసీసీ చీఫ్ రేసులో ఉన్నారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి కూడా ఈ రేసులో ఉన్నారు. మహబూబ్ నగర్ నుండి ఎంపీ స్థానం నుండి పోటీ చేసి ఆయన ఓడిపోయారు.

దళిత సామాజిక వర్గం నుండి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పేర్లు కూడా పీసీసీ చీఫ్ పదవి కోసం పరిశీలనలో ఉన్నాయి. కేబినెట్ లో ఉన్నందున భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహలకు అనివార్యమైన పరిస్థితులు నెలకొంటే తప్ప పీసీసీ చీఫ్ పదవి దక్కదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. దీంతో సంపత్ కుమార్ ఈ రేసులో ముందంజలో ఉన్నారు. ఎస్టీ సామాజిక వర్గం నుండి మంత్రి సీతక్క , బాలు నాయక్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సీతక్క మంత్రిగా ఉన్నారు. దీంతో బాలు నాయక్ వంటి నాయకులు ఈ పదవి కోసం అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. మైనార్టీలకు కనుక ఇచ్చే అవకాశం ఉంటే మాజీ మంత్రి షబ్బీర్ అలీ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories