Heavy Rains: అల్పపీడనం ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు

Heavy Rains in Telugu States Due to Low Pressure
x

తెలుగు రాష్ట్రాల్లో భారి వర్షాలు (ఫైల్ ఇమేజ్)

Highlights

Heavy Rains: మూడురోజులుగా దంచికొడుతున్న వానలు * వర్షాలకు ఉప్పొంగిన వాగులు.. పలు గ్రామాలకు రాకపోకలు బంద్‌

Heavy Rains: తెలంగాణలో అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాష్ట్రమంతా ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కురవడంతో జనజీవనం స్తంభించింది. హైదరాబాద్‌లో మధ్యాహ్నం వరకు ఎండ దంచికొట్టగా ఆ తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది.

అటు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురవడంతో చెరువులు మత్తడి పోస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వికారాబాద్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో పరిగి, నస్కల్ మధ్య వాగు పొంగిపొర్లుతుంది. రోడ్డుకి ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గత మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి రంగారెడ్డి జిల్లాలో ఈసీ, మూసీ వాగులు పొంగిపొర్లుతున్నాయి. షాబాద్ మండలంలోమూసీ వాగు పొంగిపొర్లుతోంది. దీంతో గండిపేట చెరువులోకి నీరు భారీగా చేరుకుంది. ఇక ఈసీ వాగులో ప్రవాహం పెరిగిన వరదనీరు.. హిమాయత్ సాగర్‌కు చేరుతున్నాయి.

ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలో చీక్‌మాన్‌ వాగు ఉప్పొంగింది. దీంతో రాంపూర్ గ్రామానికి రాకపోకలు నిలిచాయి. ఊరికి వెళ్లేందుకు బ్రిడ్జి లేకపోవడంతో వేరే మార్గం లేక.. వాగులో నుంచే ఇళ్లకు చేరుకుంటున్నారు ఆ గ్రామస్థులు. ఇక ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు తోడు.. రాష్ట్రంలో భారీగా వానలు పడుతుండటం.. వాగులు పొంగడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కి వరద పోటెత్తింది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నీటినిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. ఇప్పటికే 50 టీఎంసీల నీరు చేరింది.

ఇక తెలంగాణలో మరో రెండు రోజులు పరిస్థితులు ఉంటాయని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడినా.. అనుబంధ ద్రోణి కొనసాగుతుండటంతో మరో రెండు రోజులు రాష్ట్రంలో వర్షాలు పడతాయంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని.. పలుచోట్ల అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని హెచ్చరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories