Heavy Rains: క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశం ఉందన్న వాతావరణశాఖ.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం

Heavy Rains in Telangana Red Alert to Hyderabad
x

Heavy Rains: క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశం ఉందన్న వాతావరణశాఖ.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం

Highlights

Heavy Rains: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది.

Heavy Rains: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది.. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలతో పాటు క్లౌడ్ బ్లరస్ట్ అయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలపడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది.. ఆయా జిల్లాల్లో వర్షం కురుస్తున్న పరిస్థితులను బట్టి పాఠశాలలకు సెలవులను ఇవ్వాలా.. వద్దా... అనే విషయంలో కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ సూచించారు.

రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్లతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, డీజీపీ డా.జితేందర్, మున్సిపల్ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శి దాన కిషోర్, ప్రణాళికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, నీటి పారుదలశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ, పంచాయితీ రాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, ఫైర్ సర్వీసుల శాఖ డీజీ నాగిరెడ్డి, జీహెచ్ ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, మున్సిపల్ పరిపాలన విభాగం సంచాలకుడు గౌతమ్ పాల్గొన్నారు.

తెలంగాణతోపాటు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోను భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఏ విధమైన ఆకస్మిక విపత్తు ఎదురైనా... వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలని కలెక్టర్లకు సూచించారు.. కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు. ప్రతీ జిల్లా కలెక్టర్ కార్యాలయంతోపాటు జీహెచ్ఎంసీ, రాష్ట్ర సచివాలయంలోనూ కంట్రోల్ రూములను తెరవాలని తెలిపారు. లోతట్టు, వరద ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా తగు నిఘా పెట్టాలన్నారు. ముఖ్యంగా ఉధృతంగా పారే వాగుల వద్ద ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించి పర్యవేక్షించాలని చెప్పారు. వర్షాల దృష్ట్యా జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించుకునే నిర్ణయం ఆయా జిల్లాల కలెక్టర్లు తీసుకోవాలని సీఎస్ స్పష్టం చేశారు.

వరద ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను తరలించి పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసే విషయంలో ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. భారీ వర్షాలు, వరదల వల్ల తీసుకునే జాగ్రత్తలపై ప్రజలను ఎప్పటికప్పుడు ప్రసార మాధ్యమాల ద్వారా చైతన్య పరచాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లోని మంచి నీటి వనరులైన ట్యాంకులు కలుషితం కాకుండా తగు చర్యలు తీసుకోవడంతోపాటు, అంటువ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ పౌడర్, క్లోరినేషన్ చేపట్టాలని తెలిపారు. వైద్య బృందాలను అప్రమత్తం చేశామని, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందులను సిద్ధంగా ఉంచామని సీఎస్ శాంతి కుమారి తెలిపారు.

ప్రస్తుతం NDRF బృందాలు హైదరాబాద్, విజయవాడలలో ఉన్నాయని, ఏవిధమైన అవసరమున్నా ముందస్తు సమాచారం ఇస్తే ఈ NDRF బృదాలను పంపిస్తామని తెలిపారు. గోదావరి, కృష్ణా నదుల పరీవాహక ప్రాంతాల్లోని కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వరదలు, వర్షాల వల్ల కొన్ని చోట్ల చెరువులకు గండ్లు పడే అవకాశం ఉందని, దీంతో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. నీటిపారుదల శాఖ అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. జిల్లాలో పోలీస్, నీటిపారుదల శాఖ, విపత్తుల నిర్వహణ శాఖ, పంచాయితీ రాజ్ తదితర శాఖలతో కలిసి సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్లను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తం చేయడంతోపాటు, మ్యాన్‌హోళ్లను తెరవకుండా నిఘా ఉంచాలని ఆదేశించారు.

రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమిషనర్ కార్యాలయాలు, ఎస్.పీ లను అప్రమత్తం చేశామని డీజీపీ తెలిపారు. ప్రధానంగా కలెక్టర్ల సమన్వయంతో పనిచేయాలని, అన్ని కమిషనరేట్లు, ఎస్.పీ కార్యాలయాల్లో కంట్రోల్ రూమును ఏర్పాటు చేయాలని ఆదేశించినట్టు సీఎస్ వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories