Heavy Rains in Telangana: తెలంగాణాలో అధిక వర్షపాతం.. 12 ఏళ్ల తరువాత రికార్డ్ నమోదు

Heavy Rains in Telangana: తెలంగాణాలో అధిక వర్షపాతం.. 12 ఏళ్ల తరువాత రికార్డ్ నమోదు
x

Heavy Rains in Telangana

Highlights

Heavy Rains in Telangana: ఖరీఫ్ సీజనుకు సంబంధించి నాలుగు నెలల్లో చూస్తే తెలంగాణాలో అధిక వర్షపాతం నమోదయ్యింది.

Heavy Rains in Telangana: ఖరీఫ్ సీజనుకు సంబంధించి నాలుగు నెలల్లో చూస్తే తెలంగాణాలో అధిక వర్షపాతం నమోదయ్యింది. సాధారణ వర్షపాతంతో చూస్తే సీజను ముగియకుండానే నమోదు కావడం విశేషం. గత 12 సంవత్సరాల్లో ఇంతటి వర్షాలు కురవడం ఈ ఏడాదే. వర్షాలు ఎక్కువ కావడం వల్ల కొన్ని ప్రతికూల అంశాలు చోటుచేసుకున్నా చివరకు పంటల సాగు తదితర అంశాలపై దీని ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

తెలంగాణలో 12 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదయింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు కురవాల్సిన వర్షం కంటే ఏకంగా 51 శాతం అధికంగా వానలు పడ్డాయి. వాతావరణశాఖ లెక్కల ప్రకారం 2009 నుంచి 2020 వరకు 791.6 మి.మీ వర్షపాతం నమోదు కావటం ఇదే ప్రథమం. వానాకాలం సీజన్‌ ఇంకా 40 రోజులు మిగిలి ఉండగానే రాష్ట్రంలో సగటు వర్షపాతాన్ని మించి వానలు కురవడం గమనార్హం. జూన్‌, జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలలు కలిపి రాష్ట్ర సగటు వర్షపాతం 720.4 మి.మీ నమోదు కావాలి. జూన్‌లో 129.2 మి.మీ, జులైలో 244.2 మి.మీ, ఆగస్టులో 219.2 మి.మీ కలిపి 592.6 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాలి.

ఆగస్టు 20 వరకు అయితే 524.9 మి.మీ నమోదు కావాలి. నిరుడు ఇదే సమయానికి 482.3 మి.మీ వర్షపాతం నమోదైంది. కాగా, ఈ సీజన్‌లో ఇప్పటి వరకు(ఆగస్టు20)ఏకంగా 791.6 మి.మీ వర్షపాతం నమోదైంది. ఏడాది సగటు వర్షపాతమే 720.4 మి.మీ అయితే.. మరో 40 రోజులు వానాకాలం సీజన్‌ మిగిలి ఉండగానే అంతకంటే 71.2 మి.మీ ఎక్కువ వర్షపాతం నమోదుకావటం విశేషం. అంటే ఇప్పటి వరకు నమోదు కావాల్సిన వర్షపాతంతో పోలిస్తే 51 శాతం ఎక్కువగా వానలు పడ్డాయి. సెప్టెంబరు 30తో వర్షాకాలం పూర్తయ్యే నాటికి ఎంత వర్షపాతం నమోదవుతుందని ఉత్కంఠ నెలకొంది.

గడిచిన పుష్కర కాలంలో తెలంగాణ జిల్లాల్లో నమోదైన వర్షపాతాన్ని పరిశీలిస్తే.. ఆరేళ్లు లోటు వర్షపాతం, మరో ఆరేళ్లు అధిక వర్షపాతం నమోదయింది. నైరుతి సీజన్‌లో 2009 నుంచి 2018 వరకు రాష్ట్ర సగటు 755.1 మి.మీ ఉండేది. 2020కి 720.4 మి.మీ.కు రాష్ట్ర సగటు తగ్గిపోయింది. 2009, 2014, 2015 సంవత్సరాల్లో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. 2009లో 35, 2014లో 34, 2015లో 21శాతం లోటు వర్షపాతం నమోదుకావటంతో కరువు వాతావరణం ఏర్పడింది. 2018లో కేవలం 2 శాతం వర్షపాతం లోటు ఏర్పడగా, మిగిలిన సంవత్సరాల్లో సాధారణం కంటే మించి వర్షపాతమే నమోదైంది. కానీ ఈ ఏడాది నమోదైన వర్షపాతమే ఆల్‌టైమ్‌ రికార్డు కావటం గమనార్హం.


Show Full Article
Print Article
Next Story
More Stories