హైదరాబాద్‌, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో కుంభవృష్టి

Heavy Rains in Hyderabad, Ranga Reddy and Vikarabad Districts
x

హైదరాబాద్‌, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో కుంభవృష్టి

Highlights

Telangana: రోడ్లపై వరదలతో పలుచోట్ల నిలిచిన రాకపోకలు

Telangana: హైదరాబాద్ సహా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కుంభవృష్టి ముంచెత్తింది. రెండు రోజులా వచ్చిన భారీ వర్షాలకు వాగులు, వంకలు చెరువుల పొంగి పొర్లాయి. పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాజస్థాన్ నుంచి ఏపీ తీరంలోని బంగాళాఖాతం వరకు 15 వందల మీటల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. మరో వైపు రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా శ్రీలంక సమీపంలోని కోమరీన్ ప్రాంతం వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో మరో ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణలో అక్కడకక్కడ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ రేపు భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతవరణ శాఖ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది.

హైదరాబాద్ నగర వ్యాప్తంగా చాలా చోట్ల కుండపోతగా వాన పడింది. నగరంలోని నాలాలు పొంగి పొర్లాయి. లోతట్టు ప్రాంతాలు మురుగునీటిలో కూరుకుపోయాయి. కూకట్ పల్లి, గాజులరామారం, ఎస్.ఆర్.నగర్, జీడిమెట్ల, అమీర్ పేట, చార్మినార్, బహుదూర్ పుర, మలక్ పేట, జియాగూడ దిల్ షుక్ నగర్, ముసారంభాగ్ సహా పలు ప్రాంతాల్లో కాలనీల్లోని రహదారులు చెత్త చెదారంతో నిండిపోయాయి. ఎంజీబీఎస్, హైకోర్టు, చాదర్ ఘట్ ప్రాంతాల్లో మూసీ వరద ప్రవహిస్తంది. ముసారంబాగ్ వంతెనపై రాకపోకలను నిషేధించారు. మరోసారి రికార్డు స్థాయిలో జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లకు వరద పోటెత్తింది. పది వేల క్యూసెక్కులకు పైగా మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కురిసిన కుండపోత వర్షాలకు మూసి, కాగ్నా నదులు పెద్ద ఎత్తున వరద వచ్చి చేరింది. సమీప ప్రాంతాల్లోని ఇళ్లు, పంటలు నీట మునిగాయి. వికారాబాద్ జిల్లాలో వందకు పైగా ఇళ్లు నీట మునిగాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రాంతంలో 12 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. సిద్దిపేట జిల్లా కోహెడ రహదారిపై మోయతుమ్మెద వాగు వరద రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

గండిపేట జలాశయం దిగువన మూసీ కాలువ సమీపంలో ఉంటున్న ఓ కుటుంబం వరదలో చిక్కుకుంది. గండిపేట నుంచి చిలుకూరు వెళ్లే దారిలోని కల్వర్టు సమీపంలో ఓ చిన్న ఇంట్లో ఉంటున్న సునీల్‌, ఆయన భార్య లక్ష్మి, వారి ముగ్గురు పిల్లలు వరదలో చిక్కుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది అర్ధరాత్రి పడవలో అక్కడికి వెళ్లి కుటుంబం మొత్తాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు.

తెలంగాణ రాష్ట్రానికి మరో రెండు రోజులు భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ డైరెక్టర్ నాగరత్నం హెచ్చరికలు చేశారు. 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో రాత్రి భారీ వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలు ఉన్నాయి. భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్లతో సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories