మూసీ చరిత్రలోనే భారీ వరద

మూసీ చరిత్రలోనే భారీ వరద
x
Highlights

హైదరాబాద్లో వర్షం దంచికొడుతోంది. ఉరుములు మెరుపులతో జోరువాన బీభత్సం సృష్టిస్తోంది. జోరువానకు ఈదురు గాలులు కూడా తోడవడంతో హైదరాబాద్ నగరం...

హైదరాబాద్లో వర్షం దంచికొడుతోంది. ఉరుములు మెరుపులతో జోరువాన బీభత్సం సృష్టిస్తోంది. జోరువానకు ఈదురు గాలులు కూడా తోడవడంతో హైదరాబాద్ నగరం అతలాకుతలమవుతోంది. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనివిధంగా కుండపోత వర్షం కురుస్తోంది. ఏకధాటిగా కురుస్తోన్న గాలివానకు భాగ్యనగరం కకావికలమవుతోంది. మరోవైపు, భారీ శబ్దాలతో ఉరుములు ఉరమడంతో హైదరాబాదీలు భయంతో బెంబేలెత్తిపోయారు. పిడుగులు పడుతున్నాయేమోనని వణికిపోతున్నారు. ఆకాశం విరిగి మీదపడుతుందన్న రేంజులో ఉరుములు ఉరుముతున్నాయి. ఒకవైపు ఉరుములు మెరుపులు మరోవైపు కుండపోత వర్షంతో హైదరాబాద్లో జనజీవనం ఒక్కసారిగా స్తంభించింది. ఎగతెరిపి లేకుండా కురుస్తోన్న అతి భారీ వర్షంతో హైదరాబాద్‌లో రోడ్లు కాలువలను చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ప్రధాన రహదారులపై పెద్దఎత్తున వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్లయితే, రోడ్లపై మోకాళ్ల లోతు నీరు నిలవడంతో వరద నీటిలో వాహనాలు ఇరుక్కుపోయాయి.

ఈ క్రమంలోనే మూసీకి కూడా మునుపెన్నడూ లేనంత భారీగా వరద వచ్చింది. నగరంలో కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు మూసీకి చేరడంతో బుధవారం తెల్లవారుజామున ఈ ప్రాజెక్టు చరిత్రలోనే మొదటిసారిగా 2.36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినట్లు ఇంజినీర్లు తెలిపారు. ఈ మూసీ ప్రాజెక్టును 1963లో నిర్మించగా, 1983లో మొట్టమొదటి సారి అత్యధికంగా 2.26 లక్షల క్యూసెక్కులు వరద వచ్చింది. అయితే గతేడాది కురిసిన వర్షాలకు 40 వేల క్యూసెక్కుల నీరు చేరడంతో మూసీ గేట్ల నిర్వహణలో చాలా ఇబ్బందులు వచ్చాయి. అయితే ఈ ఏడాది గత రెండురోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఆలేరు వాగుకు వచ్చిన వరదతో మూసీ ఉప్పొంగింది. దీనికితోడు బుధవారం హిమాయత్‌సాగర్‌ జలాశయం 13 గేట్లను ఎత్తడంతో మూసీలోకి వరద వచ్చి చేరింది. 4.46 టీఎంసీల నిల్వ సామర్థ్యం గల ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా, 647 అడుగుల వరకు నీటిని నిల్వ చేశారు.

ఇక మూసీ నది ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అధికారులు 30 గేట్లను అమర్చారు. అయితే ఆ గేట్ల నిర్వహణ ఇబ్బందిగా మారుతుండడంతో 1990లో 10 గేట్లను ప్రభుత్వం కాంక్రీటుతో మూసేసింది. ప్రస్తుతం వరద పెరగడంతో అతి కష్టం మీద 13 గేట్లను ఎత్తి నీటిని వదిలారు. భారీ వరదతో డ్యాంకు ఏం జరుగుతుందో అన్న ఆందోళన వ్యక్తమైంది. నిర్వహణ సమస్యల వల్ల ఏడు గేట్లు ఎత్తడానికి అసలు అవకాశమే లేకుండాపోయింది. చీఫ్‌ ఇంజినీర్‌ నరసింహ, ఎస్‌ఈ రమేష్‌ తదితరులతో మంత్రి జగదీశ్‌రెడ్డి ఎప్పటికప్పుడు సంప్రదింపులు నిర్వహించి సూర్యాపేట జిల్లాలోని రత్నాపేరం వద్ద గండి పెట్టి దిగువకు నీటిని వదలాలని ఆదేశించారు. అలా వదలడంతో కొన్ని పొలాలు నీట మునిగాయి. మూసీ పరీవాహక ప్రాంతంలో పలు చోట్ల 24 గంటల్లో 20 నుంచి 25 సెం.మీ వరకు వర్షపాతం నమోదైంది. దీనికి తగ్గట్లుగా దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. దీంతో మూసీకి ఇరువైపులా అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories