మీ పాలన వైఫల్యానికి ఇదే నిదర్శనం: సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ట్వీట్

మీ పాలన వైఫల్యానికి ఇదే నిదర్శనం: సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ట్వీట్
x
Highlights

Harish Rao takes a dig at CM Revanth Reddy: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గురుకులాల దీనస్థితి చూస్తే, బాసర సరస్వతి తల్లి మనసు తల్లడిల్లుతుందని హరీష్ రావు...

Harish Rao takes a dig at CM Revanth Reddy: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గురుకులాల దీనస్థితి చూస్తే, బాసర సరస్వతి తల్లి మనసు తల్లడిల్లుతుందని హరీష్ రావు అన్నారు. నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ కేజీబీవీ పాఠశాలలో “ఈ బువ్వ మేము తినలేము, మమ్మల్ని తీసుకెళ్లండి” అని విద్యార్థులు తల్లిదండ్రులను వేడుకుంటున్నారని అన్నారు. అనంతపేట్ కేజీబీవీ పాఠశాలలో విషాహారం తిని పదిమంది విద్యార్థులు ఆసుపత్రి పాలైన దుస్థితి నెలకొందని తెలిపారు. విషాహారం తిని వాంకిడి గురుకుల విద్యార్థిని మరణించిన ఘటన మరువకముందే ఇలాంటివి పునరావృతం కావడం సిగ్గుచేటు అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.

ఒకప్పుడు గురుకులాల్లో సీట్ల కోసం క్యూ కట్టేవారని.. ఇప్పుడేమో అదే గురుకులాల నుంచి ఇంటి బాట పట్టేందుకు విద్యార్థులు క్యూ కడుతున్నారని హరీష్ రావు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఊదరగొట్టిన మార్పు ఇదేనా అని ఆయన ప్రశ్నించారు.

ఈ బువ్వ మాకొద్దు, ఇక్కడ మేము ఉండలేము అని విద్యార్థులు వేడుకుంటున్నారు. కాంగ్రెస్ పాలనలో చదువు సంగతి దేవుడెరుగు, పిల్లలు ప్రాణాలతో బతికుంటే చాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. కన్నబిడ్డల ఆవేదన చూడలేని తల్లిదండ్రులు గురుకులాలకు వచ్చి బిడ్డలను తోలుకపోతున్నారు. ఏడాదిలో మీ పాలన వైఫల్యానికి ఇంతకంటే నిదర్శనం ఇంకా ఏముంటుంది అని సీఎం రేవంత్ రెడ్డిని ఎక్స్ ద్వారా నిలదీస్తూ హరీష్ రావు ఈ పోస్టు పెట్టారు.

విద్యాశాఖను మీ దగ్గరే ఉంచుకుని కూడా మీరు భావి భారత పౌరుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారని ఆరోపించారు. మీ చేతగాని పాలన గురుకుల విద్యార్థులకు శాపంగా మారిందని హరీష్ రావు ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం స్పందించి, విద్యార్థుల ప్రాణాలను కాపాడే చర్యలు తీసుకోవాలని హరీష్ రావు (Harish Rao demands to CM Revanth Reddy) తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories