గుత్తాకు కేబినెట్‌లో బెర్త్‌ దొరికితే ఎర్త్‌ ఎవరికి?

గుత్తాకు కేబినెట్‌లో బెర్త్‌ దొరికితే ఎర్త్‌ ఎవరికి?
x
Highlights

ఆయన ఒక కల కన్నారు. పార్లమెంట్‌కు కాదు, అసెంబ్లీకి వెళ్లాలని తపించారు. కానీ కొన్ని అనివార్య కారణాలతో శాసన సభలోకి అడుగుపెట్టలేకపోయారు. కొన్నాళ్లుగా...

ఆయన ఒక కల కన్నారు. పార్లమెంట్‌కు కాదు, అసెంబ్లీకి వెళ్లాలని తపించారు. కానీ కొన్ని అనివార్య కారణాలతో శాసన సభలోకి అడుగుపెట్టలేకపోయారు. కొన్నాళ్లుగా అలిగారు. అయితే, అధిష్టానం మాత్రం, శాసన సభలోకి కాకపోయినా, అలాంటిదే శాసన మండలిలోకి పంపేందుకు సర్వం సిద్దం చేసింది. అయితే, ఆయన రాష్ట్ర చట్టసభల్లోకి వెళ్లాలనుకున్నది ఏదో, ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీనో అనిపించుకోవడానికి కాదు. మంత్రి అవడానికి. అదే ఆయన స్వప్నం. మరి మంత్రి అయ్యేందుకే అన్నట్టుగా, ఎమ్మెల్సీ అయితే అవుతున్నారు. మరి మంత్రిగా కూడా ఆయనకు అవకాశం వస్తుందా, ఆయన కల నెరవేరుతుందా అన్నదే ఇప్పుడు ఉత్కంఠ కలిగిస్తోంది. అయితే ఆయనకు గనుక, కేసీఆర్ కేబినెట్‌లో బెర్త్‌ దొరికితే, మరొకరికి ఎర్త్‌ తప్పదన్న ప్రచారం కూడా, రాజకీయాలను వేడెక్కిస్తోంది. ఇంతకీ ఎవరికి బెర్త్‌..ఎవరికి ఎర్త్...?

తెలంగాణ‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి నామినేష‌న్ దాఖ‌లు చేశారు. కాంగ్రెస్‌లో చేరిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ యాదవరెడ్డిపై అనర్హత వేటు పడటంతో వ‌చ్చిన ఉప ఎన్నిక‌ల్లో, ఎమ్మెల్సీ ప‌ద‌వికి నామినేష‌న్ దాఖ‌లు చేశారు గుత్తా. ప్రధాన ప్రతిప‌క్షం కాంగ్రెస్‌కు, పోటీకి స‌రిప‌డా ఎమ్మెల్యేల బ‌లం లేక‌పోవ‌డంతో, ఇక గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి గెలుపు ఏక‌గ్రీవం కావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. గుత్తా సుఖేంద‌ర్ ఎమ్మెల్సీగా పెద్దల స‌భలో అడుగు పెట్టడం దాదాపు లాంఛన‌ప్రాయ‌మే. అయితే పెద్దల స‌భ‌లో సీటు ఖాయం చేసుకున్న గుత్తా, కేసీఆర్ కెబినెట్‌లో కూడా బెర్తు ద‌క్కించుకోనున్నారా అన్నది ఇప్పుడు టిఆర్ఎస్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌.

కాంగ్రెస్ ఎంపీగా టిఆర్ఎస్‌లో చేరిన నాటి నుంచి, రాష్ట్ర మంత్రి కావాల‌న్నదే గుత్తా క‌ల అని ఆయ‌న స‌న్నిహితులు అంటున్నారు. త‌న మ‌న‌సులోని మాట‌ను గుత్తా గులాబీ బాస్‌కు ఇప్పటికే చెప్పార‌ని తెలుస్తోంది. అందుకే మొన్నటి పార్లమెంట్ ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉన్నార‌ని పార్టీలో టాక్. దీంతో ఇప్పుడు అనుకున్న విధంగా, ఎమ్మెల్సీని ద‌క్కించుకున్న గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, తన‌కు కేసీఆర్ ఏ ప‌ద‌వి ఇచ్చినా, చేసేందుకు సిద్దంగా ఉన్నాన‌ని అంటున్నారు.

ఇదిలావుంటే, ఇప్పటికే ఉమ్మడి న‌ల్గొండ జిల్లా నుంచి కేబినెట్‌లో జ‌గ‌దీశ్వర్ రెడ్డి విద్యాశాఖ‌ మంత్రిగా కొనసాగుతున్నారు. ఇంట‌ర్ బోర్డ్ అవ‌క‌త‌వ‌క‌లతో జ‌గ‌దీశ్వర్ రెడ్డిని త‌ప్పించాల‌ని ప్రతిప‌క్షాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ కూడా, జ‌గ‌దీశ్వర్ రెడ్డి ప‌నితీరుపై సంతృప్తిగా లేర‌ని తెలుస్తోంది. అయితే జ‌గ‌దీశ్వర్ రెడ్డిని అప్పుడే త‌ప్పిస్తే, ప్రతిప‌క్షాల‌కు అస్త్రం అందించినట్టవుతుందని భావించిన కేసీఆర్, త్వర‌లో జ‌ర‌గనున్న కేబినెట్ విస్తర‌ణలో జ‌గ‌దీశ్వర్ రెడ్డికి ఖ‌టీఫ్ చెబుతార‌న్న చ‌ర్చ సాగుతోంది. అదే జ‌రిగితే, గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి మంత్రి కావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇదిలావుంటే, నల్గొండ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని, జ‌గ‌దీశ్వర్ రెడ్డితో పాటు, గుత్తాను కూడా కేబినెట్‌లోకి తీసుకునే అవ‌కాశం లేక‌పోలేద‌ని కూడా పార్టీలో మ‌రో చ‌ర్చ.

మొత్తానికి కాంగ్రెస్ ఎంపీగా, టిఆర్ఎస్‌కు ద‌గ్గరైన నాటి నుంచి కేసీఆర్ కేబినెట్‌లో బెర్త్ సాధించడమే ల‌క్ష్యంగా పెట్టుకున్న గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, తాను అనుకున్నట్టే ఎమ్మెల్సీ కాబోతున్నారు. ఇక మిగిలింది మంత్రి ప‌ద‌వే. మ‌రి గులాబీ బాస్ గుత్తాకు మంత్రిగా ప‌గ్గాలు అప్పగిస్తారా లేదా అన్నదే ఉత్కంఠ కలిగిస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories