GHMC Elections 2020: గ్రేటర్ హైదరాబాద్‌లో బీజేపీకి నిరసన సెగలు

GHMC Elections 2020: గ్రేటర్ హైదరాబాద్‌లో బీజేపీకి నిరసన సెగలు
x
Highlights

* చిక్కులు తెచ్చిపెడుతోన్న అభ్యర్థుల ఎంపిక * టికెట్ల కేటాయింపులపై ఆశావహుల అసంతృప్తి * కొత్తగా వచ్చిన వారికే టికెట్లు ఇస్తున్నారంటూ మండిపాటు * బుజ్జగింపుల కోసం ప్రత్యేక ప్రణాళికలు చేస్తోన్న బీజేపీ

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక బీజేపీకి చిక్కులు తెచ్చిపెడుతోంది. టికెట్ల కేటాయింపుపై అసంతృప్తి జ్వాలలు రగులుకున్నాయి. పార్టీని నమ్ముకున్న వారికి మొండిచేయి చూపుతున్నారంటూ.. ఆశావహులంతా పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వెల్లగక్కుతున్నారు. దీంతో రాష్ట్ర పార్టీ అధినాయకత్వానికి టికెట్ల కేటాయింపు కత్తిమీద సాములా మారింది.

గ్రేటర్‌ హైదరాబాద్ బీజేపీలో అసంతృప్త జ్వాలలు రగులుకున్నాయి. టికెట్ల కేటాయింపుల్లో పార్టీ తీరుపై నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. టికెట్‌ రాలేదని పార్టీ నేతలు నిరసనలకు దిగుతున్నారు. మంగళవారం బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ కు నిరసన సెగ తగిలింది. గోశామహల్ నియోజకవర్గంలో తన బంధువులకు మాత్రమే జీహెచ్ఎంసీ టికెట్లు కేటాయిస్తున్నారంటూ స్థానిక బీజేపీ కార్యకర్తలు లక్ష్మణ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. బుధవారం పార్టీ ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితాలో తనకు టికెట్ రాదని ముషీరాబాద్ బీజేపీ కార్యాలయం ఎదుట ఆ పార్టీ డివిజన్ నాయకుడు శివ ముదిరాజ్ తన మద్దతుదారులతో కలిసి బైఠాయించారు.

రెండో జాబితాలో జాంబాగ్ అభ్యర్ధిగా రూప్ ధారక్ పేరును ప్రకటించిన బీజేపీ... అంతలోనే తొలగించింది. దాంతో, రూప్ ధారక్ అనుచరులు.... బీజేపీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. కొత్తగా వచ్చి చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. ఇక నాచారంలో బీజేపీ నాయకురాలు విజయలతారెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నాచారం టికెట్ ఆశించినా.. పార్టీ మొండిచేయి చూపటంతో మనస్తాపం చెందారు విజయలతారెడ్డి. మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ఎస్ ప్రభాకరే... తనకు టికెట్ రాకుండా మోసం చేశారని ఆరోపించారు.

ఇలా ఒక్కో జాబితా విడుదలతో.. కమల దళంలో అసమ్మతి పెరుగుతోంది. దీంతో కమలం పార్టీకి అభ్యర్థుల ఎంపిక సవాల్‌గా మారింది. అయితే అసమ్మతి నాయకులను బుజ్జగించడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు పార్టీ నేతలు. టికెట్ దక్కించుకున్న అభ్యర్థులు నామినేషన్ వేయాలని పార్టీ పెద్దలు ఆదేశించారు. కన్ఫర్మేషన్ అభ్యర్థులు కూడా జాబితా కోసం ఎదురు చూడకుండా నామినేషన్ దాఖలు చేసి... ప్రచార పర్వాన్ని కొనసాగించాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories