ప్రతిపక్షాలకు అస్త్రాలు మనమే అందిస్తున్నామా? టీఆర్ఎస్ లో అంతర్మథనం

ప్రతిపక్షాలకు అస్త్రాలు మనమే అందిస్తున్నామా? టీఆర్ఎస్ లో అంతర్మథనం
x
Highlights

గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులే ప్రతిపక్షాలకు అస్త్రాలు అందిస్తున్నారు. అధికార పార్టీలోని కొందరు చేస్తున్న వ్యాఖ్యలే కాంగ్రెస్‌, బీజేపీలకు...

గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులే ప్రతిపక్షాలకు అస్త్రాలు అందిస్తున్నారు. అధికార పార్టీలోని కొందరు చేస్తున్న వ్యాఖ్యలే కాంగ్రెస్‌, బీజేపీలకు ఆయుధాలుగా మారుతున్నాయి. సున్నితమైన అంశాల్లో అధికార పార్టీ నేతలు మరింత జాగ్రత్తగా మసలుకోవాలి. వారి వ్యాఖ్యలు ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తాయనే స్ప్రుహతో వ్యవహరించాలి. అయితే వీరి వివాదాస్పద కామెంట్స్‌ ఇప్పుడు టీఆర్‌ఎస్ నాయకత్వానికి..ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతున్నాయి.

అధికారంలో ఉన్న పార్టీకి ఏదో ఒక దశలో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలోను...గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకత బయటపడింది. ఈ పరిస్థితుల్ని సానుకూలంగా మలుచుకునేందుకు కాషాయసేన, కాంగ్రెస్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇటువంటి సున్నిత పరిస్థితుల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు...స్వయంగా తమ పార్టీనే ఇబ్బందుల పాల్జేస్తున్నారు. దేశంలో మెల్లగా బీజేపీ వ్యతిరేక గాలి ప్రారంభమైన తరుణంలో కాషాయ పార్టీపై వ్యతిరేకతను మరింతగా పెంచాల్సింది పోయి తమ పార్టీ కిందకే నీళ్ళు తెస్తున్నారు టీఆర్‌ఎస్‌ నాయకులు కొందరు. వీటినే ఆయుధాలుగా మలుచుకుని బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు గులాబీ పార్టీపై ఫైటింగ్‌ చేస్తున్నాయి.

అయోధ్య రామమందిరంపై పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వరంగల్‌ జిల్లాలో దుమారం రేపాయి. బీజేపీ రాముడిని తన స్వార్థం కోసం వాడుకుంటోందని ధర్మారెడ్డి ఆరోపించారు. రాముడ్ని రాజకీయాల్లోకి లాగి అపవిత్రం చేస్తున్నారంటూ కామెంట్స్‌ చేశారు. బీజేపీ నాయకులు అయోధ్యరాముడి పేరుతో దొంగ పుస్తకాలు ముద్రించుకుని విరాళాలు వసూలు చేస్తున్నారంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు చల్లా ధర్మారెడ్డి.

ధర్మారెడ్డి కామెంట్స్‌కు పూర్తిగా రాజకీయ రంగు అంటుకుంది. బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేశారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కూడా కౌంటర్‌ ఎటాక్‌ చేశారు. వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఇప్పటికే ఇక్కడి రాజకీయాలు వేడెక్కాయి. ధర్మారెడ్డి కామెంట్స్‌తో అధికార పార్టీ మీద హిందూ వ్యతిరేక ముద్ర వేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇదేకాదు బలహీన వర్గాల అధికారుల మీద కూడా ఈ ఎమ్మెల్యే నోరు జారారు. 99 శాతం మార్కులు వచ్చిన అగ్రవర్ణాల వారికి ఉద్యోగాలు రావడంలేదని చదువు సరిగ్గా రాని వారికి ఉద్యోగాలు వస్తున్నాయంటూ తీవ్రమైన కామెంట్స్‌ చేశారు ధర్మారెడ్డి.

పరకాల ఎమ్మెల్యే వ్యాఖ్యల మీద దుమారం రేగడంతో తర్వాత క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది. దీనికి ముందే కరీంనగర్‌ జిల్లాకు చెందిన కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగరరావు కూడా రామమందిరం మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తర్వాత సారీ చెప్పారు. ఉత్తరప్రదేశ్‌ రాముడు మాకెందుకు మాకు తెలంగాణ రాముడు చాలంటూ చేసిన కామెంట్స్‌పై కూడా బీజేపీ శ్రేణులు తీవ్రంగా స్పందించాయి. మరో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ఏకంగా సొంత పార్టీ మీదే అభాండాలు మోపారు. తాను లిమిటెడ్‌ కంపెనీలో పనిచేస్తున్నానంటూ పార్టీని కంపెనీగా మార్చేశారు. గతంలో కూడా ఇదేవిధంగా వివాదాస్పద కామెంట్స్‌ చేసిన రసమయి..తర్వాత తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. మంత్రులు ఈటల రాజేందర్‌, తలసాని శ్రీనివాసయాదవ్‌ చేసిన కామెంట్స్‌ కూడా గులాబీ పార్టీని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేవే. అటు మంత్రులు...ఇటు ఎమ్మెల్యేలు వరుసగా వివాదాస్పద కామెంట్స్‌ చేస్తూ టీఆర్‌ఎస్‌ నాయకత్వానికి చుక్కలు చూపిస్తున్నారు.

అధికార పార్టీలో ఉండే నాయకులు నోటిని అదుపులో ఉంచుకోవాలి. ఎక్కడ ఏ చిన్న తప్పు దొరికినా ప్రతిపక్షాలు దాన్ని అవకాశంగా మలుచుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటాయి. ఇటీవల కాలంలో పార్టీ నాయకత్వం దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నా అక్కడక్కడా ఇటువంటివి సంభవిస్తూ కాంగ్రెస్‌, బీజేపీలకు అస్త్రాలను అందిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories