Flowers Business: ఇవి పూల తోటలు కావు.. రైతులకు కాసుల పంటలు

Flowers Business: ఇవి పూల తోటలు కావు.. రైతులకు కాసుల పంటలు
x
Highlights

Flowers Business: తెలుగు రాష్ట్రాల్లో పూల ధరలకు రెక్కలొచ్చాయి. దీపావళి, కార్తీక మాసం పూల రైతులకు కాసుల వర్షం కురిపిస్తోంది. దీపావళి పండుగ రోజున...

Flowers Business: తెలుగు రాష్ట్రాల్లో పూల ధరలకు రెక్కలొచ్చాయి. దీపావళి, కార్తీక మాసం పూల రైతులకు కాసుల వర్షం కురిపిస్తోంది. దీపావళి పండుగ రోజున లక్ష్మీ దేవిని పూజిస్తారు. అలాగే ప్రతి కార్తీక సోమవారం అమ్మవారికి పూజలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా దీపావళి రోజున చేసే లక్ష్మీ పూజకు పలు రకాల పూలు ఉపయోగిస్తారు. గుడి అలంకారాలు, ఇంటి గుమ్మాలు, ఆఫీసులు, షాపులను పూల తోరణాలతో అందంగా అలంకరిస్తారు. పూలు, లైటింగ్‌తో దగదగ మెరిపిస్తారు. దీపావళి రోజున ఉదయం ఇళ్లల్లోనూ.. సాయంత్ర పూట వ్యాపార సంస్థల్లో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. దీంతో పూలకు ఒక్కసారిగా భారీ డిమాండ్ ఏర్పడింది. అదే సమయంలో పూల ధరలు కూడా అంతే భారీగా పెరిగిపోయాయి.

ఇటీవల కురిసిన వర్షాల వల్ల నష్టపోయిన తమకు దీపావళి పండగ వెలుగులు తెచ్చిందంటున్నారు పూల పంటల్ని సాగు చేసే రైతులు. పండగ సీజన్ కావడంతో వ్యాపారుల మధ్య కొనుగోళ్లకు పోటీ రావడంతో ధరలు అమాంతం పెరిగాయంటున్నారు. మరో రెండు రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. వర్షాల వల్ల సరైన ధరలు లేకపోవడం వల్ల కోసిన పూలను రోడ్డు పక్కన పడేశామని చెబుతున్నారు. కానీ ఇప్పుడు పూల తోటల దగ్గరకే వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారని సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

ఇక చిత్తూరు జిల్లాలోని వి.కోట ప్రాంతంలో పండించే పూలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇక్కడి నుంచి తిరుపతి, హైదరాబాద్, శ్రీశైలం, విజయవాడ, రాజమండ్రి, మధురై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా తదితర ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలకు పూలను ఎగుమతి చేస్తారు. వారం రోజుల క్రితం బంతి పూలు 30 కిలోల బస్తా కేవలం యాభై నుంచి వంద రూపాయల వరకు మాత్రమే పలికింది.

అయితే, ఇప్పుడు దీపావళి పండగ సీజన్ కావడంతో పూలకు మంచి డిమాండ్ ఉంది. దీంతో ప్రస్తుతం వి.కోట పూల మార్కెట్‌లో కిలో బంతి పూలు గరిష్టంగా నలభై రూపాయలు పలకగా.. కిలో చామంతి పూలు అత్యధికంగా 150 రూపాయల వరకు పలికాయి. వర్షాల వల్ల నష్టాలను చవిచూసిన తమకు దీపావళి కాసుల వర్షం కురిపిస్తోందంటూ పూల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories