Srisailam Fire Accident: అత్యవసర స్విచ్ పనిచేయకపోవడం వల్లే.. ప్రమాదంపై ప్రాధమిక నిర్ధారణ

Srisailam Fire Accident: అత్యవసర స్విచ్ పనిచేయకపోవడం వల్లే.. ప్రమాదంపై ప్రాధమిక నిర్ధారణ
x
Highlights

Srisailam Fire Accident: గతంలో ఎన్నడూ చూడని విధంగా శ్రీశైలం ఎడమ గట్టు తెలంగాణా పరిధిలోని జలవిద్యుత్ కేంద్రంలోని అగ్ని ప్రమాదం నుంచి ప్రభుత్వం ఇంకా తేరుకోలేదు.

Srisailam Fire Accident: గతంలో ఎన్నడూ చూడని విధంగా శ్రీశైలం ఎడమ గట్టు తెలంగాణా పరిధిలోని జలవిద్యుత్ కేంద్రంలోని అగ్ని ప్రమాదం నుంచి ప్రభుత్వం ఇంకా తేరుకోలేదు. ఇలాంటి ప్రమాదాలు సంభవించినప్పుడు అత్యవసర సమయాల్లో సరఫరాను నిలిపివేసేందుకు అవసరమైన ఏర్పాట్లు ఎక్కడికక్కడ ఉంటాయి. అయితే దీనిపై విచారణ చేస్తున్న దర్యాప్తు బృందం ఇంకా ఒక నర్ధారణకు రాలేకపోతోంది. అయితే ప్రమాదం సంభవించిన సమయంలో అత్యవసరంగా సరఫరా నిలిపివేసే స్విచ్ పనిచేయకపోవడం ఒక కారణంగానే వారు ఒక అంచనాకు వచ్చారు.

శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్‌ కేంద్రంలో అగ్ని ప్రమాదానికి కారణాలు, ఆస్తి నష్టంపై ఇంకా స్పష్టత రాలేదు. సోమవారం ఎట్టకేలకు ప్రమాద స్థలానికి నిపుణుల బృందం చేరుకోగలిగింది. 150 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 6 యూనిట్లు ఉండగా, మంగళవారం వీటికి సంబంధించిన టర్బయిన్లను తెరిచి చూసే అవకాశం ఉంది. అప్పుడే నష్టంపై పూర్తి అంచనా రానుందని జెన్‌కో ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. టర్బయిన్ల పైన ఉండే జనరేటర్లు, వైన్డింగ్‌ కాయిల్స్‌ కాలిపోతే మాత్రం నష్టం రూ.వందల కోట్లలో ఉండే అవకాశం ఉంది. ఆరు యూనిట్లలో తొలి రెండింటి టర్బయిన్లు బాగానే ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

స్విచ్‌ పని చేయకపోవడంతోనే..

ఆరో యూనిట్‌కు సంబంధించిన ఎక్సైలేషన్‌ ప్యానెల్‌లో నిప్పురవ్వలు వచ్చిన వెంటనే.. దీనికి డీసీ కరెంట్‌ సరఫరా ఆటోమేటిక్‌గా ట్రిప్‌ కావాల్సి ఉంది. అలా జరిగి ఉంటే మంటలు ఆగిపోయి అగ్ని ప్రమాదం జరిగి ఉండకపోయేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఒక వేళ ఆటోమేటిక్‌గా పవర్‌ ట్రిప్‌ కాకున్నా, స్విచ్‌ ద్వారా నిలుపుదల చేసే ఏర్పాటు సైతం ఉంటుంది. ఈ స్విచ్‌ సైతం ఆ కీలక సమయంలో పని చేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అంచనాకు వస్తున్నారు. టర్బయిన్లలో ఉండే జనరేటర్లలోని వైన్డింగ్‌ కాయిల్స్‌ పరిధిలో అయస్కాంత క్షేత్రం ఏర్పాటు చేయడానికి ఎక్సైలేషన్‌ ప్యానెల్స్‌ ద్వారా డీసీ విద్యుత్‌ను వాటికి సరఫరా చేస్తారు. దీనితో జనరేటర్‌ రోటర్లు తిరిగి విద్యుదుత్పత్తి జరుగుతుంది.

ప్రారంభంలో డీసీ విద్యుత్‌ను బ్యాటరీల ద్వారా ప్యానెల్‌కు అక్కడి నుంచి వైన్డింగ్‌ కాయిల్స్‌కు పంపుతారు. పూర్తిస్థాయిలో ఉత్పత్తి జరపడానికి బ్యాటరీలతో సరఫరా చేసే విద్యుత్‌ సరిపోదు. జనరేటర్ల నుంచి ఉత్పత్తి అయిన హైడెల్‌ పవర్‌నే ఏసీ విద్యుత్‌గా మార్చి మళ్లీ జనరేటర్లకు పంపిస్తే పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతుంది. ఇలా పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరిగేటప్పుడే ‌ప్యానెల్‌లో స్పార్క్స్‌ వచ్చాయి. అప్పటికప్పుడు ఎక్సైలేషన్‌ ప్యానెల్‌కు పెద్ద మొత్తంలో డీసీ విద్యుత్‌ సరఫరాను నిలుపుదల చేసి ఉంటే ప్రమాదం జరిగి ఉండకపోయేదని చెబుతున్నారు. కీలక సమయంలో డీసీ విద్యుత్‌ సరఫరాను నిలుపుదల చేసే స్విచ్‌ పని చేయలేదని నిపుణులు అంటున్నారు. చివరి నిమిషంలో సాంకేతిక కారణాలతో బ్యాటరీలు పని చేయకపోవడంతోనే స్విచ్‌ పని చేయలేదని తెలుస్తోంది.

పునరుద్ధరణ పాక్షికమే!

శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంపై సీఐడీ విచారణ కొనసాగుతోంది. మూడు రోజుల తర్వాత పవర్‌హౌస్‌లో పొగలు అదుపులోకి వచ్చినా పునరుద్ధరణ పనులు ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యేలా లేవు. అతికష్టం మీద కేబుల్‌ పునరుద్ధరణ పనులు చేపట్టడంతో పవర్‌హౌస్‌లోని కొన్ని విద్యుత్‌ లైట్లు, ఎగ్జిట్స్‌ ఫ్యాన్లు పనిచేస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద నీరు ఉధృతి అధికంగా ఉండటం వల్ల ఇప్పటికే భూగర్భ పవర్‌హౌస్‌లోకి నీరు వచ్చి చేరుతున్నట్టు భాస్తున్నారు. దీంతో ఒకటి, రెండు యూనిట్లలో ఉత్పత్తి చేపట్టేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. నాలుగో యూనిట్‌లోని ట్రాన్స్‌ఫార్మర్‌ పేలడంతోనే 9 మంది మృతి చెందారని భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories