ఇది ఈటల మాటేనా.. అధిష్టానం తూటానా?

Etela Rajender Next Target CM KCR Gajwel
x

ఇది ఈటల మాటేనా.. అధిష్టానం తూటానా?

Highlights

Etela Rajender: దేవుడు శాసిస్తాడు...అరుణాచలం పాటిస్తాడు. ఇదే తరహాలోనే, అధిష్టానం ఆదేశిస్తే, ఏకంగా సీఎం కేసీఆర్‌పైనే పోటీ చేస్తానంటున్నారు ఈటల రాజేందర్.

Etela Rajender: దేవుడు శాసిస్తాడు...అరుణాచలం పాటిస్తాడు. ఇదే తరహాలోనే, అధిష్టానం ఆదేశిస్తే, ఏకంగా సీఎం కేసీఆర్‌పైనే పోటీ చేస్తానంటున్నారు ఈటల రాజేందర్. హైకమాండ్‌ అలా ఆర్డర్ ఇస్తే చాలు, గజ్వేల్ గడ్డపై తొడకొడతానని శపథం చేస్తున్నారు. ఈటల సీరియస్‌గానే అన్నారా? లేదంటే క్యాజువల్‌గానే మాట్లాడారా? బీజేపీ హైకమాండ్‌ కావాలనే, ఈటలతో ఇలా మాట్లాడిస్తోందా? నిజంగా కాషాయ పెద్దల ఆలోచన కూడా అదేనా? ఈ వ్యూహం వెనక కమలం కథాకళి ఏంటి?

వాళ్లు, వీళ్లతో కాదు ఏకంగా కేసీఆర్‌‌తోనే లడాయి. గజ్వేల్‌ గడ్డపై కేసీఆర్‌పై పోటీ చేస్తానన్న ఈటల. ఈటల ఊరకే అన్నారా? కసితో డైలాగ్ పేల్చారా? మమతపై సువేంధులా.. కేసీఆర్‌పై ఈటల పోటీనా? ఎన్నికలను రసవత్తరంగా మార్చేందుకే బీజేపీ ఎత్తుగడనా? గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీకి ఈటలను దింపాలని వ్యూహమా? అధిష్టానం ఆలోచనే ఈటల నుంచి జాలువారిందా?

హుజూరాబాద్‌ గెలుపు ఊపులో ఈటల రాజేందర్ తెలంగాణ అంతటా తిరుగుతున్నారు. బైపోల్ జరిగిన తీరు, అందులో కేసీఆర్‌‌ వేసిన వ్యూహాలను ఎత్తిచూపుతూ, జనంలో క్రేజ్‌ను మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈటల, కేసీఆర్‌పై మాటల తూటాలు పేల్చారు. అంతటితో ఆగలేదు ఈటల రాజేందర్. మరోసారి పతాకశీర్షికలయ్యే ఈటెలాంటి మాట దూశారు. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే, గజ్వేల్‌‌లో సీఎం కేసీఆర్‌పై పోటీ చెయ్యడానికి సిద్దమని అన్నారు.

ఇది ఈటల మాటేనా? అధిష్టానం తూటానా? పక్కా వ్యూహం ప్రకారమే ఈటలతో మాట్లాడించారా? తెలంగాణపై భారతీయ జనతా పార్టీ ఫోకస్‌ పెట్టిందన్నది వాస్తవం. 2019లో పార్లమెంట్‌ ఎన్నికల్లో నాలుగు సీట్లు వెనకేసుకోవడంతోనే, కాషాయానికి బాటలు పడ్డాయని భావించింది. దుబ్బాక, గ్రేటర్‌లో విజయం తర్వాత బీజేపీ నమ్మకం మరింత పెరిగింది. హుజూరాబాద్‌ అఖండ విజయం కమలం కాన్ఫిడెన్స్‌ను పీక్స్‌కు చేర్చింది. అందుకే తెలంగాణపై మరింత దూకుడు పెంచింది. ఏకంగా కేంద్రమంత్రులతో కేసీఆర్‌పై కౌంటర్లు వేయించింది. కేసీఆర్‌ కూడా కాంగ్రెస్‌ను వదిలేసి, తమనే టార్గెట్ చెయ్యడం, కమలం పార్టీకి ప్లస్సయ్యింది. ఇప్పుడంతా చర్చ టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీగా మారింది. ఈ వార్‌‌ను మరింత పతాకస్థాయికి చేర్చేందుకు, మరో వ్యూహం వేసినట్టుంది బీజేపీ. అదే కేసీఆర్‌పై ఈటల పోటీ అంటూ ప్రచారం.

పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ వర్సెస్ సువేంధు అధికారి పోటీ, ఆ రాష్ట్రమంతా సంచలనమైంది. మమతకు నమ్మినబంటులాంటి సువేంధును బయటకు లాగి, అదే మమతపై నందిగ్రామ్‌లో బరిలోకి దింపి, చాలా స్ట్రాటజిక్‌గా పావు కదిపింది బీజేపీ. మమతను ఆ సెగ్మెంట్‌పైనే ఎక్కువ దృష్టి సారించేలా ఉక్కిరిబిక్కిరి చేసింది. అక్కడ బీజేపీ అధికారంలోకి రాకపోయినా, ప్రధాన ప్రతిపక్షంగా కూర్చుంది. ఇప్పుడు తెలంగాణలోనూ అలాంటి ప్రయోగమే చెయ్యాలనుకుంటున్నట్టుంది బీజేపీ. అందుకే అవసరమైతే కేసీఆర్‌పై పోటీ చేస్తానని ప్రకటించారు ఈటల. ఇదే జరిగితే, తెలంగాణలో సంచలనమే.

హుజూరాబాద్‌లో పేరుకు గెల్లు శ్రీనివాస్ వర్సెస్ ఈటల రాజేందర్‌గా ఎన్నిక జరిగినా, కేసీఆర్‌, ఈటల మధ్యే యుద్ధంగా సాగింది. అదే రియల్‌గా గజ్వేల్ గడ్డపై కేసీఆర్‌పై ఈటల పోటీ చేస్తే, రాష్ట్రం మొత్తం అటెన్షన్‌, ఈ పోటీపైనే మళ్లుంది. బీజేపీకి మాంచి క్రేజ్ వస్తుంది. అయితే, ఈటల రాజకీయ జీవితం మాత్రం ప్రమాదంలో పడుతుంది. ఒకవేళ ఓడిపోతే, ఈటల పొలిటికల్ కెరీర్‌ ప్రశ్నార్థకమైనట్టే. మరి గజ్వేల్‌ గడ్డపై కేసీఆర్‌‌పై ఈటల పోటీకి అధిష్టానం ఆలోచించినా, ఈటల సుముఖత వ్యక్తం చేస్తారా సై అంటారా అన్నది మాత్రం సస్పెన్సే. చూడాలి ఏమవుతుందో.

Show Full Article
Print Article
Next Story
More Stories