Engineering Colleges tobe Started August in Telangana: కరోనా మహమ్మారి వ్యాప్తితో తాళాలు పడిన అన్ని సంస్థలను తిరిగి తెరిచేందుకు తెలంగాణా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
Engineering Colleges tobe Started August in Telangana: కరోనా మహమ్మారి వ్యాప్తితో తాళాలు పడిన అన్ని సంస్థలను తిరిగి తెరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే కేంద్రం ఆదేశాల మేరకు డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం తాజాగా ఆగష్టు 17 నుంచి ఇంజనీరింగు తరగతులు ప్రారంభిస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వచ్చే నెల పదిహేడు నుంచి ఇంజనీరింగ్ విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. విలువైన విద్యా సంవత్సరాన్ని విద్యార్థులు కోల్పోకుండా ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం రూపొందిస్తుందని స్పష్టం చేశారు. యూజీసీ, ఏఐసీటీఈ సూచించిన మేరకు రాష్ట్రంలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ తుది సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మిగతా వారిని మాత్రం ప్రస్తుతం ఎలాంటి పరీక్షలూ లేకుండా పై తరగతులకు పంపించాలని అధికారులకు సూచించారు.
కరోనా వైరస్ నేపథ్యంలో విద్యావ్యవస్థకు సంబంధించిన అంశాలపై, తెలంగాణలో ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయడంపై గురువారం ప్రగతి భవన్‌లో విస్తృత స్థాయి సమీక్షా సమావేశాన్ని సీఎం కేసీఆర్ నిర్వహించారు. 'తెలంగాణ ఏర్పడ్డాక ఒక్కొక్క రంగంపై దృష్టి పెట్టి దీర్ఘకాలిక సమస్యల నుంచి ప్రజలకు శాశ్వత విముక్తి కలిగిస్తూ వస్తున్నాం. విద్యుత్ సమస్యకు పరిష్కారం చూపాం. మంచినీటి గోస తీరింది. సాగునీటి సమస్య పరిష్కారం అవుతోంది. వ్యవసాయ రంగం కుదుటపడుతోంది. రాష్ట్రంలో భూకబ్జాలు లేవు. పేకాట క్లబ్బులు పోయాయి. గుడుంబా బట్టీలు ఆగిపోయాయి. ఇలా అనేక సమస్యలను పరిష్కరించుకోగలుగుతున్నాం. ఇక విద్యావ్యవస్థ బలోపేతం, రెవెన్యూ శాఖ ప్రక్షాళనపైనే దృష్టి పెడతాం' అని సమీక్షా సమావేశంలో ఆయన స్పష్టం చేశారు.
విద్యావ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి, ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడానికి అవసరమైన దీర్ఘకాలిక వ్యూహాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో వివిధ రకాల విద్యాసంస్థల నిర్వహణ, పరీక్షల నిర్వహణ, సిలబస్ తదితర విషయాలపై యూజీసీ, ఏఐసీటీఈ తదితర సంస్థల మార్గదర్శకాలను పాటించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థల పనితీరును గణనీయంగా మెరుగుపరిచి, అత్యుత్తమ విద్యాబోధన జరిగేలా చేయడం ద్వారానే.. విద్య పేరు మీద జరుగుతున్న దోపిడిని అరికట్టడం సాధ్యమవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగా.. ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియెట్, డిగ్రీ కాలేజీలు, ఇతర ప్రభుత్వ విద్యాసంస్థలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి?. వాటిని గొప్పగా తీర్చిదిద్దేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి?. విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఏం చేయాలి? అనే విషయాలపై త్వరలోనే ఓ వర్క్ షాప్ నిర్వహించి విద్యారంగ నిపుణులు, అనుభవజ్ఞుల అభిప్రాయాలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. పాఠశాలల పునఃప్రారంభం ఎప్పుడు చేయాలి, విద్యాబోధన ఎలా జరగాలి అనే విషయాలపై కేంద్ర మార్గదర్శకాలను, ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న పద్థతిని పరిశీలించి, ఇక్కడ ఏం చేయాలనే విషయంపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.
వైద్యరంగంలో దోపిడీ ఆగింది!
''కేసీఆర్ కిట్స్ పథకం అమలు చేయడంతోపాటు ప్రభుత్వ వైద్యశాలల్లో సదుపాయాలు పెంచడం పేదలకు ఉపయోగపడింది. ప్రజలకు ప్రభుత్వ వైద్యశాలలపై ప్రజలకు నమ్మకం ఏర్పడింది. ఔట్ పేషెంట్ల సంఖ్య పెరిగింది. వైద్యరంగంలో దోపిడీ ఆగింది.'' అని సీఎం ఈ భేటీలో అభిప్రాయపడ్డారు. అదే విధంగా ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడం ద్వారా ప్రజలకు మేలు కలుగుతుందని, దోపిడీ కూడా ఆగిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పదో తరగతి దాకా కస్తూర్బా పాఠశాలల్లో చదువుతున్న అనాథ బాలికలకు.. పై చదువులకు కావాల్సిన ఏర్పాట్ల బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు. దీనిపై త్వరలోనే విధాన నిర్ణయం ప్రకటిస్తామన్నారు. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, సీనియర్ అధికారులు నవీన్ మిట్టల్, ఉమర్ జలీల్, శ్రీహరి, శేషు కుమారి, పాఠశాల విద్య డైరెక్టర్ శ్రీ దేవసేన, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire