ED Raids: ఈఎస్ఐ కుంభకోణంలో ఈడీ సోదాలు

Enforcement Directorate Raids ESI scandal In Hyderabad
x

ED Raids: (File Image)

Highlights

ED Raids: ఈ రోజు ఉదయం నుండి హైదరాబాద్ లో 10 చోట్ల ఒకే సారి ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.

ED Raids: తెలంగాణలో సంచలనం రేపిన ఈఎస్ఐ మందుల కుంభకోణంపై మరో సారి ఈ రోజు ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ ఈఎస్ఐ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ అధికారులు ఈ రోజు ఉద‌యం నుంచి దాదాపు పది ప్రాంతాల్లో సోదాలు కొన‌సాగుతున్నాయి. మాజీ మంత్రి దివంగత నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డితో పాటు నాయిని మాజీ పీఎస్‌ ముకుందారెడ్డి, మాజీ అధికారిణి దేవికారాణి వంటి ప‌లువురి ఇళ్లలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి.

ఈ స్కామ్‌లో ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి సహా తొమ్మిది మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. వైద్య కిట్లు, మందుల కొనుగోళ్ల వ్యవహారంలో నకిలీ బిల్లులు సృష్టించి రూ.6.5 కోట్లు స్వాహా చేసిన వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. కుంభకోణంలో కీలక నిందితురాలు దేవికారాణి అక్రమార్జనలో భాగమైన రూ.4.47 కోట్ల సొమ్మును గతేడాది సెప్టెంబరులో ఏసీబీ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

కూకట్‌పల్లికి చెందిన ఓ స్థిరాస్తి వ్యాపార సంస్థకు ఈ సొమ్ము చెల్లించారు. గతంలోనే ఈ లావాదేవీల గురించి ఆ స్థిరాస్తి సంస్థ నిర్వాహకులు ఏసీబీకి సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారం వెలుగు చూసినట్టు అధికారులు తెలిపారు. అనిశా ఈ సొమ్మును న్యాయస్థానం అనుమతి తీసుకుని స్వాధీనం చేసుకుంది. ఇదే కేసులో సహా నిందితురాలైన మాజీ ఫార్మాసిస్ట్‌ నాగలక్ష్మీతో కలిసి దేవికారాణి ఫ్లాట్లు కొందామని చూసినట్టు ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. ఎర్రగడ్డలోని ఈఎస్ఐ కార్యాలయంలోనూ ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories