ఏజెన్సీ పల్లెల్లో టెన్షన్ వాతావరణం.. తుపాకుల మోతతో..

ఏజెన్సీ పల్లెల్లో టెన్షన్ వాతావరణం.. తుపాకుల మోతతో..
x
Highlights

నిన్నటి వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ పల్లెలు పక్షుల కిలకిల రాగాలు పచ్చని పంట పొలాలతో కళకళలాడాయి. ఇప్పుడు పోలీసుల బూట్ల చప్పుళ్లు, తుపాకుల...

నిన్నటి వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ పల్లెలు పక్షుల కిలకిల రాగాలు పచ్చని పంట పొలాలతో కళకళలాడాయి. ఇప్పుడు పోలీసుల బూట్ల చప్పుళ్లు, తుపాకుల మోతతో గజగజ వణుకుతున్నాయి. 15 రోజుల వ్యవధిలోనే మూడు ఎన్ కౌంటర్లు జరిగాయి. ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. దీంతో గిరిజన గ్రామాల్లో టెక్షన్ వాతావరణం నెలకొంది.

తెలంగాణ - చత్తీస్‌గఢ్ సరిహద్దులోని దండకారణ్యం వరుస ఎన్ కౌంటర్లు, దాడులు, ప్రతిదాడులతో దద్ధరిల్లుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వరుస ఎన్ కౌంటర్లలో మావోయిస్టు పార్టీకి చెందిన ఆరుగురు దళ సభ్యులు చనిపోయారు. ప్రతీకారేచ్చతో రగిలిపోతున్న మావోయిస్టులు ఏం చేస్తారో అని సరిహద్దు గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ నెల 3న గుండాల మండలంలో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు దళ కమాండర్ దూది దేవాల్ అలియాస్ శంకర్ ను కాల్చి చంపారు పోలీసులు. ఆ తర్వాత పూసుగుప్ప, చెన్నాపురం లో వరుసగా ఎన్ కౌంటర్లు జరిపి పోలీసులు మావోలపై పైచేయి సాధించారు.

గుండాల ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ నెల 6న మావోయిస్టులు బంద్ పాటించారు. అదేరోజు రాత్రి చర్ల మండలం పెద్దమిడిసిలేరు _ తిప్పాపురం ప్రధాన రహదారిని మందుపాతరలతో పేల్చి పోలీసులకు సవాల్ విసిరారు. రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటలు గడవక ముందే చర్ల మండలం ఒద్దిపేట _ పూసుగుప్ప అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ చేసి ప్రతీకారం తీర్చుకున్నారు. పోలీసుల కాల్పుల్లో చర్ల మావోయిస్టు ఏరియా కమిటీ దళ కమాండర్ మడివి జోగయ్య అలియాస్ శ్రీనుతో పాటు మరో దళ సభ్యుడు ఐతు అలియాస్ ప్రభాకర్ చనిపోయారు.

అక్టోబర్ 21 నుంచి 27 వరకు మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు నిర్వహించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జగన్ పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. గ్రేహౌండ్, స్పెషల్ పార్టీ, సీఆర్ పీ ఎఫ్ బలగాలతో దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 23 న చర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు ఎదురుపడ్డారు. ఇరు వర్గాలు కాల్పులు జరుపుకోవడంతో మావోయిస్టు మిలీషియా కమాండర్ సోడి జోగయ్యపాటు మరో ఇద్దరు మహిళా మావోయిస్టులు చనిపోయారు. గత 15 రోజుల్లో మొత్తం 6 గురు సభ్యులను కోల్పోయిన మావోయిస్టులు ప్రతీకారేచ్చతో రగిలిపోతున్నారు‌. దీంతో దండకారణ్యం లోని ఏజెన్సీ గ్రామాల్లో పరిస్థితి నివురుగప్పున నిప్పులా మారింది. ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో తాజాగా చోటుచేసుకున్న ఘటనలు భయాంధోళనకు గురిచేస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories