Electricity Charges: విద్యుత్ ఛార్జీలు పెంపునకు రంగం సిద్దం.. 14 శాతం పెంపు...

Electricity Charges Hike in Telangana | Telangana Live News
x

Electricity Charges: విద్యుత్ ఛార్జీలు పెంపునకు రంగం సిద్దం.. 14 శాతం పెంపు...

Highlights

Electricity Charges: చార్జీల పెంపుతో డిస్కంలకు రూ.6,831 కోట్ల ఆదాయం...

Electricity Charges: సామాన్యుడిపై మరో అదనపుభారం పడనుంది. అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే వచ్చే నెలనుంచి చేతి చమురు వదలనుంది. నిరంతర విద్యుత్ సంతోషం ఆవిరై చేబికి చిల్లు పడబోతోంది. అవును తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు పెంపునకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి పచ్చజెండా ఊపింది. 19శాతం పెంపునకు ప్రతిపాదనలు పంపగా..వాటిలో 14 శాతం మేర పెంచుకునేందుకు ఈఆర్సీ అంగీకరించింది.

ఈ చార్జీల పెంపుతో డిస్కంలకు అదనంగా 6వేల831 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఇక తాజా నిర్ణయంతో డొమెస్టిక్‌ విద్యుత్ యూనిట్స్ పై 40 నుంచి 50 పైసలు, ఇతర కేటగిరీలపై యూనిట్‌కు రూపాయి పెరగనుంది. దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ఒకవేళ సీఎం కేసీఆర్ ఈ చార్జీల పెంపునకే మొగ్గు చూపితే రాష్ట్రంలో ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త కరెంటు ఛార్జీలు అమల్లోకి రానున్నాయి.

ఇక ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అనేక వర్గాలకు విద్యుత్ సబ్సిడీ అమలుచేస్తోంది. అలా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ డొమెస్టిక్ వినియోగదారులకు 101 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. ఇక రైతులకు అందించే ఉచిత విద్యుత్‌లో భాగంగా 25 లక్షల పంపుసెట్లకు విద్యుత్ సరఫరా అవుతోంది. సెలూన్లకు 250 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తుండటంతో పాటు పవర్ లూమ్స్ లలో, పౌల్ట్రీ రంగానికి యూనిట్‌కు 2 రూపాయల సబ్సిడీ ఉంది.

అయితే రైల్వే చార్జీలు, బొగ్గు, రవాణా చార్జీలు పెరగడంతో విద్యుత్ చార్జీల పెంచక తప్పలేదని ఈఆర్సీ ఛైర్మన‌ శ్రీరంగారావు, విద్యుత్ శాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రభుత్వం నుంచి టారిఫ్‌ సబ్సిడీ 5వేల652 కోట్లు మాత్రమే రానుందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలికి డిస్కమ్‌లు వివరించాయి. అయితే ఈ సబ్సిడీని 8వేల322 కోట్లకు పెంచుతున్నట్లు ప్రభుత్వం తాజాగా తెలిపింది.

అదనంగా 2వేల670 కోట్ల టారిఫ్‌ సబ్సిడీ ఇస్తున్నట్లు ఈఆర్‌సీకి ఇచ్చిన లేఖలో పేర్కొంది. దీంతో చార్జీల పెంపు ద్వారా వినియోగదారుల నుంచి అదనంగా 6వేల831 కోట్లు వసూలు చేయాలని డిస్కమ్‌లు నిర్ణయించాయి. ఇదిలా ఉంటే.. ఈ చార్జీల పెంపు భారం తీవ్రంగా ఉండబోదని చెబుతున్నారు విద్యుత్ శాఖ అధికారులు.. ఇటీవల రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణలో టిఎస్‌ఎస్‌ఎస్పీడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి పాల్గొని డిస్కంల నష్టాల గురించి వివరించారు. గృహ అవసరాల కరెంటు చార్జీలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ చార్జీల పెంపును ప్రజలందరూ సానుకూలంగా స్వాగతించాలన్నారు. ఇతర రాష్ట్రాలతో కరెంట్ చార్జీలను పోల్చి చూశాకే ఈ ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories