తెలంగాణలో మొదలైన ఎన్నికల హడావుడి.. రానున్న 6 నెలల్లో పలు ఎన్నికలు

తెలంగాణలో మొదలైన ఎన్నికల హడావుడి.. రానున్న 6 నెలల్లో పలు ఎన్నికలు
x
Highlights

తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. రాష్ట్ర రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. వచ్చే6 నెలల పాటు వరుసగా ఎన్నికలు జరగనుండటంతో అధికార టీఆర్ఎస్‌తో పాటు అన్ని...

తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. రాష్ట్ర రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. వచ్చే6 నెలల పాటు వరుసగా ఎన్నికలు జరగనుండటంతో అధికార టీఆర్ఎస్‌తో పాటు అన్ని పార్టీలు గట్టిగా ఫోకస్ పెట్టాయి. దుబ్బాక ఉప ఎన్నిక, నిజాంబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల కావడంతో పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు వేస్తున్నాయి. ఇక గ్రేటర్ ఎన్నికలు కూడా త్వరలోనే జరగనున్నట్లు సంకేతాలు వస్తున్నాయి మరోపక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా దగ్గర పడటంతో అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయి.

తెలంగాణలో రాజకీయాలు ఊపందుకున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో ప్రచార పర్వం మొదలయింది. నవంబర్ 3న దుబ్బాక ఎలక్షన్స్ నవంబర్ 10వ తేదీన కౌంటింగ్ ఫలితాలు వస్తాయి. దుబ్బాక ఉప ఎన్నికను టిఆర్ఎస్ సీరియస్‌గా తీసుకుంది. గత ఆగస్టులో టిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చనిపోవడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమయింది. ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టిఆర్ఎస్ ముందుకు వెళుతోంది. మంత్రి హరీష్ రావు ఇప్పటికే దుబ్బాకలో ప్రచారంలో దూసుకు పోతున్నారు. మరోవైపు బీజేపీ నుంచి రఘునందర్ రావు ప్రచారంలో అధికార టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు. కాంగ్రెస్ ఇంకా అభ్యర్దిని ప్రకటించక పోవండంతో అక్కడ ప్రచారం పెద్దగా ఊపందుకోలేదు.

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అక్టోబర్ 9న ఉపఎన్నిక జరగనుంది. భూపతిరెడ్డిపై అనర్హత వేటుతో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఖాళీ ఏర్పడింది. ఇక ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులను ముందే ఖరారు చేశాయి పార్టీలు. టీఆర్‌ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ నుంచి సుభాష్‌రెడ్డి బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి యెండల లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయి బలం ఉండటంతో కల్వకుంట్ల కవిత గెలుపు ఖాయం అంటోంది టిఆర్ఎస్ పార్టీ.

ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకమండలి పదవీ కాలం పూర్తి కానుంది. ఇంకా ఐదు నెలల కాలం ఉన్న గడువు ముగియకముందే గ్రేటర్ హైదరాబాదు లో ఎన్నికలు జరగనున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. గత 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 డివిజన్ లో గెలుపొందిన అధికార టీఆర్ఎస్ పార్టీ మళ్లీ అదే టార్గెట్ పెట్టుకొని ఎన్నికలకు వెళ్లాలని ప్లాన్ చేస్తుంది. అటు కాంగ్రెస్ బీజేపీలు కూడా అంతే స్పీడుతో అధికార టీఆర్ఎస్ కారుకు బ్రేకులు వేయాలని ముందుకు సాగుతున్నారు.

జీహెచ్ఎంసీ ముగిసిన వెంటనే ఖమ్మం, గ్రేటర్ వరంగల్ కార్పోరేషన్ ఎన్నికలు కూడా రానున్నాయి. వీటితో పాటు మరో మూడు నాలుగు మున్సిపాలిటీల ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. అదే విధగాం హైదరాబాద్ ,రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికలు తో పాటు ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరగనుండటంతో వాటిపై కూడా అధికార టీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలను కూడా గెలుపొందేందుకు ముందు నుంచే వ్యూహాలు రచిస్తతోంది. మొత్తానికి రానున్న ఆరు నెలలు వరుస ఎన్నికలతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. ఇటు అధికార ప్రతిపక్షాలు ఎవరికి వారు ఆయా ఎన్నికల్లో తమ సత్తా చాటాలని వ్యూహాలు సిద్దం చేసుకుంటున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories