Lok Sabha Elections: తెలంగాణలో ఓట్ల లెక్కింపునకు 1,855 టేబుళ్లు..

EC Arranged 1855 Tables for Counting Votes in Telangana for Lok Sabha Elections
x

Lok Sabha Elections: తెలంగాణలో ఓట్ల లెక్కింపునకు 1,855 టేబుళ్లు..

Highlights

తెలంగాణ రాష్ట్రంలో 34 చోట్ల లెక్కింపు జరుగుతుండగా, ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

Lok Sabha Elections: తెలంగాణలో లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ఈ నెల 13వ తేదీన పోలింగ్‌ జరిగింది. వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 119 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో లెక్కింపునకు 1,855 టేబుళ్లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. అత్యధికంగా మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 24 రౌండ్లలో... అత్యల్పంగా మూడుచోట్ల 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది.

తెలంగాణ రాష్ట్రంలో 34 చోట్ల లెక్కింపు జరుగుతుండగా, ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. వచ్చే నెల 4వ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపుతో కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సుమారు 2.18 లక్షల వరకు పోస్టల్‌ బ్యాలెట్లు ఉంటాయన్నది అధికారుల అంచనా. వీటి లెక్కింపు కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక హాల్‌ చొప్పున కేటాయించారు. చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాలకు రెండేసి హాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో టేబుల్‌పై పోస్టల్‌ బ్యాలెట్లు 500 మించకుండా ఉండేలా ప్రణాళికను సిద్ధంచేశారు.

చొప్పదండి, దేవరకొండ, యాకుత్‌పుర స్థానాల్లో 24 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. సిర్పూర్, ఆసిఫాబాద్, స్టేషన్‌ ఘన్‌పూర్, ముథోల్, మానకొండూరు, ఆందోలు, జహీరాబాద్, గజ్వేల్, కార్వాన్, నకిరేకల్, శేరిలింగంపల్లి, ఆలేరు సెగ్మెంట్లలో 23 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుంది. ఆర్మూర్, భద్రాచలం, అశ్వారావుపేటల్లో 13 రౌండ్లు మాత్రమే ఉంటాయి. ప్రతి రౌండ్‌ ఓట్ల లెక్కింపు పూర్తయిన తరవాత మూడు దశల్లో పరిశీలన ఉంటుంది. ప్రతి రౌండ్‌లో రెండు టేబుళ్ల ఓట్ల లెక్కలను మరోసారి క్రాస్‌ చెక్‌ చేయాలని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ఓట్ల లెక్కింపు పరిశీలకుడి ఆమోదం తరవాత ఆ రౌండ్‌లో ఏయే పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయన్నది ప్రకటిస్తారు.

ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యాక ఆ నియోజకవర్గంలోని వీవీప్యాట్ల నుంచి ర్యాండమ్‌గా ఐదింటిని ఎంపిక చేసి అందులోని ఓట్లను లెక్కించి ఆ పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన టేబుళ్లలోని ఓట్ల లెక్కలతో సరిపోలుస్తారు. అన్నీ సక్రమంగా ఉన్నాయని గుర్తించిన మీదటే ఓట్ల లెక్కింపును అనుసరించి పరిశీలకుడు ఫలితాన్ని ప్రకటిస్తారు. ఆ నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన టేబుల్స్‌లో ఒక దఫా ఓట్ల లెక్కింపు పూర్తయితే ఒక రౌండ్‌ పూర్తి అయినట్లు లెక్క.

ఓటర్ల సంఖ్య, బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య ఆధారంగా ఎన్ని రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టాలన్నది ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుంది. 34 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. 11 లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును ఒక్కో ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ లోక్‌సభ ఓట్లు ఏడు చోట్ల, సికింద్రాబాద్‌ ఓట్లు ఆరు ప్రాంతాల్లో కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేశారు. ఆదిలాబాద్, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాల ఓట్లు మూడేసి ప్రాంతాల్లో, మెదక్, పెద్దపల్లి నియోజకవర్గ ఓట్ల లెక్కింపు రెండేసి ప్రాంతాల్లో చేపట్టనున్నారు. ఇలా ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories