E-Office Policy: తెలంగాణలో ఈ-ఆఫీస్ ప్రారంభం

E-Office Policy: తెలంగాణలో ఈ-ఆఫీస్ ప్రారంభం
x
Highlights

E-Office Policy:తెలంగాణ రాష్ట్రంలో మొద్దమొదటి సారిగా ఈ-ఆఫీస్ ద్వారా పాలన ప్రారంభమైంది

E-Office Policy: తెలంగాణ రాష్ట్రంలో మొద్దమొదటి సారిగా ఈ-ఆఫీస్ ద్వారా పాలన ప్రారంభమైంది. జవాబుదారీతనం, పరిపాలనలో పారదర్శకతను పెంపొందించేందుకు ఈ-ఆఫీస్‌ విధానం అమలువైపు ప్రభుత్వశాఖలు దృష్టిసారిస్తున్నాయి. ఈ-ఆఫీస్ పాలన తొలివిడతలో భాగంగా అబ్కారీ, మద్యనిషేధశాఖ, సాధారణ పరిపాలనశాఖ, వాణిజ్యపన్నులు, ప్రధాన కమిషనర్‌, భూపరిపాలనశాఖలు ఈ-ఆఫీస్‌ విధానాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రస్తుతం 1,600 మంది ఉద్యోగులు ఈ-ఆఫీస్ కొత్త విధానం ద్వారా విధులు నిర్వర్తిస్తారని సీఎస్ వివరించారు.

ఈ విధానం ద్వారా జాప్యానికి తావులేకుండా పౌరులకు సత్వర, మెరుగైన సేవలు అందుతాయని చెప్పారు. నమోదు చేసిన ప్రతి దరఖాస్తు, పరిష్కారానికి జవాబుదారీతనం ఏర్పడుతుందని చెప్పారు. మిగతా శాఖలు కూడా త్వరగా ఈ ఆఫీసు సేవలు ప్రారంభించాలని సూచించారు. స్వల్పకాలంలోనే ఈ-ఆఫీస్‌ సేవలకు శ్రీకారం చుట్టిన అధికారులను అభినందించారు. ఈ సమావేశంలో పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, ఎస్సీ డెవలప్‌మెంట్‌ కార్యదర్శి రాహుల్‌బొజ్జా, ఎక్సైజ్‌ డైరెక్టర్‌ సర్ఫరాజ్‌అహ్మద్‌, జీఏడీ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్‌, వాణిజ్యపన్నులశాఖ కమిషనర్‌ నీతూకుమారిప్రసాద్‌, ప్రొహిబిషన్‌, మహిళా,శిశుసంక్షేమశాఖ కార్యదర్శి దివ్య, ఫైనాన్స్‌ సెక్రటరీ రొనాల్డ్‌రాస్‌, భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ రజత్‌కుమార్‌ పాల్గొన్నారు. కంప్యూటర్‌ యుగంలోనూ పాలనలో ఈ-ఆఫీస్‌ విధానాన్ని తీసుకురావడానికి 25 ఏండ్లు పట్టింది.

ఇక ఈ పాలన ద్వారా కార్యాలయాల్లో కాగితాలతో పని లేకుండా పోతుంది. పరిపాలనలో పారదర్శకత, ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది. ఇందులో భాగంగానే భూ రికార్డులన్నింటినీ ప్రక్షాళనచేసి కంప్యూటరీకరించారు. ఏ భూమి ఎవరికి ఏ విధంగా వచ్చిందనే వివరాలను కూడా పొందుపరిచారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచే సమస్త సమాచారాన్ని కంప్యూటరీకరించే కార్యక్రమం చేపట్టారు. ఇంటర్నెట్‌లో భూములకు చెందిన సమస్త వివరాలు అందులో ఉంటాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories