దుబ్బాక నర్సింహారెడ్డితో కోమటిరెడ్డి గొడవేంటి?

దుబ్బాక నర్సింహారెడ్డితో కోమటిరెడ్డి గొడవేంటి?
x
Highlights

ఆయన మొన్నటి వరకు కారులో కూర్చున్నారు. ఇరుకిరుకు భరించలేక, బయటికొచ్చి హస్తం అందుకున్నారు. కాంగ్రెస్‌లోనైనా తడాఖా చూపించే చాన్స్ వస్తుందని చాలా అంచనాలే...

ఆయన మొన్నటి వరకు కారులో కూర్చున్నారు. ఇరుకిరుకు భరించలేక, బయటికొచ్చి హస్తం అందుకున్నారు. కాంగ్రెస్‌లోనైనా తడాఖా చూపించే చాన్స్ వస్తుందని చాలా అంచనాలే పెట్టుకున్నారు. దశాబ్దాలుగా అక్కడే తిష్టవేసి, ఓటమితో ఓ నేత ఎక్కడికో వెళ్లిపోవడంతో, ఆయన ఆశలు మరింత చిగురించాయట. కానీ ఎక్కడికో వెళ్లిపోయిన లీడర్, మళ్లీ అక్కడే తన మనసుందని చెప్పడంతో, ఇక్కడే ఆశలు పెట్టుకున్న నాయకునికి దిగులు మొదలైంది. ఇలాగైతే రాజకీయ జీవితం అంతే, ఢీ అంటే ఢీ అనాల్సిందేనని డిసైడయ్యారట. ఆ ఇద్దరు నేతల్లో ఒకరు దుబ్బాక నర్సింహారెడ్డి, మరొకరు కోమటిరెడ్డి వెంకట రెడ్డి. నల్గొండ సాక్షిగా, వీరిద్దరి మధ్య ప్రచ్చన్నయుద్దం మండుతోంది.

దుబ్బాక నర్సింహా రెడ్డి. ఒకప్పుడు టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ నోట నర్సన్న అని పిలిపించుకున్న నేత. ప్రజారాజ్యం పార్టీ నుంచి 2009 లో నల్గొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఉమ్మడి నల్గొండ ప్రజారాజ్యం టీంతో పాటు, ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిన వారందర్నీ టిఆర్ఎస్‌లో, తన నాయకత్వంలో ‌జాయిన్ చేశారు. నల్గొండ నియోజకవర్గం టిఆర్ఎస్ బాధ్యత నిర్వహించారు. 2014లో నల్గొండ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతిలో మరోమారు ఓడారు. ఆ తర్వాత గులాబీ పార్టీ అధికారంలోకి రావడంతో, నల్గొండ నియోజకవర్గంలో టిఆర్ఎస్ ఇంచార్జ్‌గా, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్గానికే చుక్కలు చూపించారని అనుచరులు చెప్పుకునేవారు. కానీ రాజకీయ దుందుడుకుతో, దుబ్బాక నర్సింహా రెడ్డి పట్ల టిఆర్ఎస్‌లో‌ కొంత వ్యతిరేకతకు కారణమైంది. దీంతో 2018 ఎన్నికల ముందు నల్గొండ నియోజకవర్గం బాధ్యుని నుంచి దుబ్బాకను తప్పించి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా గెలిచిన, కంచర్ల భూపాల్ రెడ్డికి ఇంచార్జ్ బాధ్యతలు ఇచ్చింది. అక్కడితో దుబ్బాక పొలిటికల్ లైఫ్ అనుకోని మలుపు తిరిగింది.

అసలే అటు కోమటిరెడ్డితో శతృత్వం, ఇటు ‌మరో రాజకీయ శత్రువుకు టిఆర్ఎస్ బాధ్యతలు ఇవ్వడంతో, దుబ్బాక నర్సింహా రెడ్డి, టిఆర్ఎస్‌ను వదిలి, తన చిరకాల ప్రత్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మద్దతుదారుడిగా మారారు. నల్గొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ కోసం పనిచేసారు. కానీ ఇద్దరు రాజకీయ శత్రువులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దుబ్బాక నర్సింహ్మ రెడ్డిలు కలిసి పని చేసినా, కంచర్ల భూపాల్ రెడ్డి విజయాన్ని ఆపలేకపోయారు. దుబ్బాకకు ఇది మరో దెబ్బ.

‌గత అసెంబ్లీ ఎన్నికల్లో కంచర్ల భూపాల్ రెడ్డి గెలుపు కోసం‌ పనిచేయాలని, సముచిత స్థానంగా ఎమ్మెల్సీ ఇస్తామని కేసీఆర్ స్వయంగా హామీ ఇచ్చినా, టిఆర్ఎస్‌ను వదిలి కాంగ్రెస్‌లో చేరిపోయారు దుబ్బాక. అయితే‌ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ ఎమ్మెల్యేగా ఓడాక, అదృష్టవశాత్తు ‌భువనగిరి ఎంపీగా గెలిచారు. దీంతో నల్గొండ నియోజకవర్గం, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రాజకీయంగా దూరమైంది‌. అప్పటికే పట్టు ఉన్న నేతగా పేరొందిన దుబ్బాక నర్సింహా రెడ్డి, ఇపుడు నల్గొండ నియోజకవర్గంలో, తన పర్యటన లు పెంచారు. కోమటిరెడ్డికి‌ భిన్నంగా నల్గొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలకు ఆర్ధిక సాయంతో పాటు ఒకప్పటి‌ తన అనుచరుల బాగోగులు చూసుకుంటున్నారని టాక్. అధికార పార్టీ చేతిలో ఇబ్బందులు పడుతున్న కార్యకర్తలకు అండగా, ఇప్పటికే పలుమార్లు ధర్నాలు చేపట్టారు. ఇవేవి కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేకుండానే, కాంగ్రెస్ ‌నేతగా దుబ్బాక కానిచ్చేస్తున్నారు. అదే కాంగ్రెస్‌లో మరో కోల్డ్‌వార్‌కు దారి తీసింది.

ఇక నల్గొండ ఎంపీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచిన దగ్గర నుంచి, ఆయన వ్యవహారాలు నల్గొండలో దాదాపు దుబ్బాక నర్సింహా రెడ్డినే చూస్తున్నారట. ఎంపీ ఉత్తమ్ కోసం ఇళ్లు తీసుకోవడం, అదే ఇంటి నుంచి దుబ్బాక పార్టీ వ్యవహారాలు నడిపిస్తుండటం, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్గానికి కొంత ఇబ్బందిగా మారిందని టాక్.

ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేవు అంటారు. ఇదే సామెత ఇపుడు నల్గొండలో మొదలైంది. భువనగిరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తన‌ కంచుకోట నియోజకవర్గం నల్గొండకు అప్పుడపుడు వస్తుండటం, మరో నేత దుబ్బాక పూర్తిస్థాయిలో నియోజకవర్గంలో పర్యటించడం, పాత యుద్ధాన్ని కొత్తగా రేపింది. రాజకీయంగా దుబ్బాక నర్సింహా రెడ్డి ప్లాన్‌ను నిశితంగా పరిశీస్తోందట కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్గం. వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా నియోజకవర్గంలో బలపడాలని దుబ్బాక నర్సింహ్మ రెడ్డి ఫ్లాన్ చేస్తుంటే, భువనగిరి ఎంపీగా ఉన్నా, తన‌ మనస్సంతా నల్గొండపైనే ఉందని, ఏ అవసరం వచ్చినా తన దగ్గరికి రండి అంటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన వర్గానికి చెబుతున్నారట. ఏది ఏమైనా నల్గొండ నియోజకవర్గంపై కాంగ్రెస్‌లో పాత,కొత్త నేతలు కన్ను వేయడం కోల్డ్‌వార్‌కు దారి తీస్తోంది. చూడాలి రానున్న కాలంలో నల్లొండ కాంగ్రెస్‌లో టగ్‌ ఆఫ్ వార్‌ ఎలా ఉండబోతోందో, దుబ్బాక పొలిటికల్‌ లైఫ్‌ ఇంకెలాంటి టర్న్ తీసుకుంటుందో.

Show Full Article
Print Article
Next Story
More Stories