TS Elections 2023: ఓటుకు నోట్ల పంపిణీ షురూ.. నియోజకవర్గంలో లక్ష నుంచి రెండు లక్షల మందికి..

Distribution of Notes for Vote
x

TS Elections 2023: ఓటుకు నోట్ల పంపిణీ షురూ.. నియోజకవర్గంలో లక్ష నుంచి రెండు లక్షల మందికి..

Highlights

TS Elections 2023: పలుచోట్ల ఓటుకు రూ.2 వేల నుంచి 3 వేలు

TS Elections 2023: గతంతో పోలిస్తే ఈసారి అసెంబ్లీ ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా మారుతున్నాయి. తెలంగాణ ఎన్నికల ప్రచారం రేపు సాయంత్రంతో ముగియనుంది. దీంతో అభ్యర్థులు పోల్‌మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెంచారు. ఒక్కో ఓటుకు వెయ్యి నుంచి ఐదు వేలదాకా పంచుతున్నట్లు తెలుస్తోంది. పలుచోట్ల రెండు వేల నుంచి మూడు వేల చొప్పున ఓటర్లకు ఇస్తున్నట్లు సమాచారం. కొందరు అభ్యర్థులు ఇప్పటికే నోట్ల పంపిణీ ఒక విడత పూర్తిచేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు నియోజకవర్గంలో కనీసం లక్ష మందికి డబ్బు పంచాలని నిర్ణయించి కార్యాచరణ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో ఏకంగా రెండు లక్షల మందికి పంచాలని భావిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

గతంలో తటస్థ ఓటర్లకు మాత్రమే అభ్యర్థులు తాయిలాలు ఇచ్చేవారు. వారిలో కూడా ఎంపికచేసిన ప్రాంతాలు, ఓటర్లకే డబ్బు పంపిణీ జరిగేది. ఈసారి సొంత పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులతో పాటు సుమారు 80 శాతం మందికిపైగా పంచేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రత్యర్థి పార్టీకి చెందిన కరడుకట్టిన కార్యకర్తలకు మినహా, మిగిలిన వారందరికీ నోట్ల పంపిణీ చేయాలంటూ క్షేత్రస్థాయి నాయకులను అభ్యర్థులు ఆదేశించారట.

ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పటికే చాలాచోట్ల అభ్యర్థులు.. దావత్‌లు, మద్యం పంపిణీ ప్రారంభించేశారు. నియోజకవర్గంలో ఒక్కో పార్టీ పోలింగ్‌ దాకా సుమారు ఐదు కోట్లు మద్యానికే ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. సొంతూరిలో కాకుండా హైదరాబాద్‌లో, ఇతర నగరాలు, పట్టణాల్లో ఉండే ఓటర్లకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఫోన్‌ చేస్తున్నారు. ఓటు వేసేందుకు సొంత ఊరికి వచ్చే వారి కోసం రవాణా ఖర్చులను సైతం ఇస్తున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా పెట్రోలు, హోటల్ బిల్లులు, వాహనాల అద్దెలను పలు మార్గాల ద్వారా చెల్లిస్తూ కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు. పోలింగ్ తేదీకి రెండు రోజులు ముందు నేరుగా ప్రజలకు అందించే డబ్బులు ఒక ఎత్తు. ఏ ఎన్నికకు అయినా ఇదే కీలకం. కొంత మంది అభ్యర్థులు ముందు జాగ్రత్తగా ఇప్పటికే ఎక్కడి నగదు అక్కడికి చేర్చుకున్నారు. మెజారిటీ అభ్యర్ధులు అంతా గ్రామాలకు నగదు ఎలా పంపిణీ చేయాలా అని మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈసారి నగదు సోదాలు గట్టిగా జరుగుతున్నాయి. ఇప్పటికే వందల కోట్ల నగదు పట్టుపడింది. ఓటు కనీసంలో కనీసం వెయ్యి రూపాయలు ఇవ్వకుండా ఎన్నికలు జరగని రోజులు ఇవి. ప్రతి అభ్యర్థి ఇందుకోసం కోట్లకు కోట్లు బయటకు తీయాల్సి ఉంది.

కొన్నిచోట్ల అభ్యర్థులు ఖర్చు విషయంలో ఓ అవగాహన కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో బరిలోకి దిగుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో పాల్గొనే వారికి సమానంగా డబ్బు పంచుతున్నారట. ఓటు విషయంలో సైతం పలుచోట్ల అభ్యర్ధులు అవగాహనతో వెయ్యి చొప్పున మాత్రమే ఇవ్వాలని మాట్లాడుకున్నట్లు సమాచారం. కొందరు సొంత ఆర్థిక వనరులు తక్కువగా ఉండటం, పార్టీ నుంచి ఫండ్‌ అనుకున్నంత రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. మొత్తంమీద పోలింగ్ తేదీ దగ్గరపడటంతో డబ్బు పంపిణీతో పాటు అన్ని రకాలుగా ప్రలోభాల పర్వం ఊపందుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories