Digital Land Survey: తెలంగాణలో భూముల డిజిటల్ సర్వే ఆలస్యం

Digital Land Survey Delay in Telangana
x

Digital Land Survey: తెలంగాణలో భూముల డిజిటల్ సర్వే ఆలస్యం 

Highlights

Digital Land Survey: తెలంగాణలో భూముల డిజిటల్ సర్వే ప్రాజెక్టు ప్రారంభానికి మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది.

Digital Land Survey: తెలంగాణలో భూముల డిజిటల్ సర్వే ప్రాజెక్టు ప్రారంభానికి మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. జూన్‌లో సర్వే చేపడతామని ప్రభుత్వం చెప్పినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రగతి భవన్‌లో సర్వే సంస్థలతో భేటి అయిన సీఎం కేసీఆర్.. సీఎస్ కి సర్వేని ఫైనల్ చేయాలని సూచించారు. కానీ ఇప్పటి వరకు సర్వే సంస్థలకి క్లారిటీ ఇవ్వకపోవడంతో వాయిదా పడుతూ వస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 11 నుంచి డిజిటల్ సర్వే చేయాలని ప్రభుత్వం భావించింది. మొదటగా పైలట్ గ్రామలుగా జిల్లాకు ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసి డిజిటల్ సర్వే చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే గజ్వేల్‌లో మూడు గ్రామాలను ఎంపిక చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు పైలెట్ గ్రామాల్లో కూడా డిజిటల్ సర్వే ప్రారంభించలేదు. రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ సర్వే చేయడానికి 8 సంస్థలు ముందుకు వచ్చాయి. దానితో ప్రభుత్వం ఆయా సంస్థలకు ఒక్కో జిల్లాకు ఒక్కో గ్రామాన్ని సర్వే చేయాలని ఆదేశించింది. 5 నెలల కిందట పైలట్ గ్రామాలలో సర్వే చేయాలని ఆయా సంస్థలకు ప్రభుత్వం చెప్పింది. ఒక గ్రామాన్ని 6 రోజుల్లో సర్వే చేసే విధంగా సర్వే సంస్థలు ప్రణాళికను రూపొందించుకున్నాయి. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి మళ్ళీ ఆదేశాలు రాలేదు.

ధరణి పోర్టల్ ద్వారా ఏ సమస్య లేదన్న ఫీడ్ బ్యాక్‌తోనే సర్కార్ డిజిటల్ సర్వే ఆలోచనకు వెళ్లిందని అధికారులలో చర్చ జరుగుతుంది. కానీ ఇంకా చాలా జిల్లాలలో ధరణి సమస్యలు చాలా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కరించకుండా క్షేత్రస్థాయిలో డిజిటల్ సర్వే చేయడం కష్టమేనని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారట. అదే సమయంలో నక్షాల ప్రమాణికంగా డిజిటల్ సర్వే చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే నక్షాల ఆధారంగా సర్వే చేయాలంటే హద్దురాళ్లు ఉండాలి. ఇప్పుడు ఏ గ్రామంలోనూ హద్దు రాళ్లు కనిపించడం లేదు. సబ్ డివిజన్ల వారీగా మ్యాపులు లేవు. రాష్ట్రంలో ఖాతాల వారీగా సర్వే చేయడం ద్వారా వివాదాలు మరింత పెరిగే అవకాశం ఉందని రెవెన్యూ నిపుణులు చెపుతున్నారు. పైగా రికార్డుల్లోని మొత్తం విస్తీర్ణానికి, క్షేత్ర స్థాయిలోని మొత్తం విస్తీర్ణానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది.

రాష్ట్రంలో సాగు భూమికి ప్రభుత్వ లెక్కలలో ఉన్న భూమికి మధ్య వ్యత్యాసం దాదాపు 38 లక్షల ఎకరాల పైనే ఉంది. ఈ క్రమంలో రైతులు చూపించే హద్దులకే అక్షాంశాలు, రేఖాంశాలు గుర్తించి, పటం తయారు చేస్తే భవిష్యత్‌లో ఇంకా భూ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. అందుకే గ్రామాల వారీగా రికార్డుల ప్రక్షాళన చేస్తూ భూ సమగ్ర సర్వే చేస్తేనే డిజిటల్ సర్వే చేయడం ఈజీ అవుతుందని అంటున్నారు నిపుణులు. అలాగే సర్వే చేసేటప్పుడు వచ్చిన సమస్యలకు పరిష్కారం చూపకపోవడంతోనే భూ భారతి సక్సెస్ కాలేదంటున్నారు నిపుణులు. డిజిటల్ సర్వే పూర్తిగా సక్సెస్ కావాలంటే సర్వేకు చట్టబద్ధత కలిగించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని చెబుతున్నారు.

డిజిటల్ సర్వే చేసేటప్పుడు గ్రామ సభ నిర్వహించడం. ప్రతి పట్టాదారుడికి నోటీసులు జారీ చేయడం తప్పనిసరి. అయితే రెవెన్యూ శాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది. వీఆర్వో వ్యవస్థ రద్దయిన తర్వాత రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, వీఆర్ఎలు మాత్రమే ఉన్నారు. ఈ హక్కుదారులందరికీ నోటీసులు అందజేసే ప్రక్రియలో ఏ ఒక్కరికీ మిస్సయినా సర్వే నిలిచిపోతుంది. అలాగే ఏ ఒక్కరు అభ్యంతరం వ్యక్తం చేసినా చెల్లకుండా పోతుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ముందస్తుగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయకపోతే హక్కుదారులంతా అంగీకరించే అవకాశం లేదు. ప్రతి రెవెన్యూ గ్రామంలోనూ 15 నుంచి 20 శాతం సర్వే నంబర్లలో లెక్కల చిక్కులు యథాతథంగా ఉన్నాయని అంచనా.

పై సమస్యలన్నీ పెండింగ్‌లో ఉండడంతో డిజిటల్ సర్వేపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం లేదు. సర్వే సంస్థలు సర్వే చేపడితే 32 ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. మరి ప్రభుత్వం డిజిటల్ సర్వేపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories