Hyderabad: హైదరాబాద్‌లో తగ్గిన పోలింగ్ శాతం.. గత ఎన్నికల కంటే 5శాతం తగ్గుదల

Decreased Polling Percentage in Hyderabad
x

Hyderabad: హైదరాబాద్‌లో తగ్గిన పోలింగ్ శాతం.. గత ఎన్నికల కంటే 5శాతం తగ్గుదల 

Highlights

Hyderabad: కేవలం 46.65శాతం మాత్రమే పోలింగ్

Hyderabad: రాజధాని నగరం హైదరాబాద్‌లో పోలింగ్‌ శాతం గతం కంటే తగ్గింది. 2018అసెంబ్లీ ఎన్నికల్లో 50.51 శాతం మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనగా, ఈసారి 46.65 శాతం నమోదైంది. జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ పేర్కొన్నారు. గతంతో పోలిస్తే ఇది దాదాపు 5 శాతం తగ్గింది. మొత్తం 15 అసెంబ్లీ సెగ్మెంట్లకుగాను గోషామహల్‌ నియోజకవర్గంలో అత్యధికంగా 45.79 శాతం నమోదైంది. అత్యల్ప పోలింగ్‌ యాకుత్‌పురాలో 27.87 శాతం నమోదైంది. గతంలో కంటే ఈసారి నగర ఓటర్లు మరింత నిరాసక్తత చూపారు. కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారు మాత్రం ఉత్సాహంగా పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు.

నగరంలోని ఉన్నత వర్గాలు, ఉద్యోగులు, వ్యాపార వర్గాల్లో ఓటింగ్‌లో తక్కువగా పాల్గొనట్టు కనిపిస్తోంది. పోలింగ్‌ రోజు సెలవుదినంగా భావిస్తూ చాలామంది ఇంటికే పరిమితమయ్యారు. కాగా.. ఎప్పటి మాదిరిగానే బస్తీలు, మురికివాడలు, సామాన్య, మధ్య తరగతి ప్రజలు మాత్రమే ఓటింగ్‌లో పాలుపంచుకున్నారు. సంపన్నుల కాలనీలు అపార్ట్‌మెంట్ల్లలోని ప్రజలు ఓటింగ్‌కు దూరం పాటించారు. విద్యావంతులున్న చోట కూడా అత్యల్పంగా పోలింగ్‌శాతం నమోదైంది.

ఎన్నికల కమిషన్‌ నిర్లక్ష్యం కారణంగా ఓటరు స్లీప్‌లు కూడా పూర్తి స్థాయిలో పంపిణీ జరగలేదు. మరోవైపు ఓటర్లు అడ్రస్‌లు కూడా తారుమారై ఒకే కుటుంబ సభ్యులు వేర్వేరు పోలింగ్‌ కేంద్రాలకు కేటాయించడం కూడా అనాసక్తికి కారణమైందని చెప్పవచ్చు. పెద్ద ఎత్తున నమోదైన బోగస్‌ ఓటర్లతోపాటు చనిపోయిన ఓటర్లు సైతం తొలగించలేదు. ఈ అంశం కూడా పోలింగ్‌ తగ్గుదలకు కారణమైంది.

చారిత్రాత్మక పాతబస్తీ ఓటర్ల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ప్రతిసారి పోలింగ్‌ శాతం దారుణంగా దిగజారుతోంది. వాస్తవంగా నగరంలోని మిగిలిన చోట్ల పోలింగ్‌ ఓ ఎత్తయితే పాతబస్తిలో ఓటింగ్‌ మరో ఎత్తు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి కనబర్చడంలేదు. గత రెండు పర్యాయాల పోలింగ్‌ పరిశీలిస్తే మొత్తం ఓటర్లలో సగం మంది కూడా పోలింగ్‌లో పాల్గొనక పోవడం ఇందుకు నిదర్శనం.

నగరంలోని పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో గురువారం ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్‌ చివరిదాకా అదే స్ధాయిలో కొనసాగింది. మొదటి 2 గంటల్లో 5 శాతం, ఆ తర్వాత రెండు గంటల వ్యవధిలో మరో పది శాతం, ఆ తర్వాత మరో రెండు గంటల్లో 12 శాతం నమోదైంది. ఆ తర్వాత ప్రతి రెండు గంటలకు వరసగా పది శాతం చొప్పున ఓటింగ్‌ పెరుగుతూ వచ్చింది.

ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారో తెలియక అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. గుంభనంగా వ్యవహరించిన ఓటర్లు పోలింగ్‌ ముగిసేంత దాకా తమ అంతరంగాన్ని బయట పెట్టకుండా జాగ్రత్త పడ్డారు. పోలింగ్‌ ముగిశాక సైతం ఓటరు నాడి తెలుసుకోలేక సతమతమవుతున్నారు. నిన్నటి వరకూ ఒక పార్టీకి కచ్చితమని భావించిన నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరిగే సమయానికి పరిస్థితి తారుమారు కావడంతో కంగు తిన్నారు. ఈ నేపథ్యంలో ఏ బస్తీలో, ఏ కాలనీలో తమకు ఓట్లు తగ్గాయి. ఎందుకు తగ్గాయి ? అనే అంశాలతో పోస్ట్‌మార్టం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories