తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీఎస్ఈ సీట్ల జోరు… కోర్ గ్రూపులు బేజారు
తెలంగాణలో 2024-25 విద్యాసంవత్సరంలో 1,01,661 ఇంజనీరింగ్ సీట్లు మంజూరయ్యాయి. ఇందులో 70,248 సీట్లు సీఎస్ఈ, ఐటీ ఆధారిత బ్రాంచీలకు సంబంధించినవే.
తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సీఎస్ఈతో పాటు దానికి అనుబంధంగా ఉన్న కోర్సుల్లో సీట్ల సంఖ్య 70,248కు పెరిగింది. ఐటీ ఇండస్ట్రీలో ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయనే నమ్మకంతో కంప్యూటర్ సైన్సెస్ కోర్సుల్లో చేరేందుకే విద్యార్థులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దాంతో ఈఈఈ, ఈసీఈ వంటి కోర్సుల్లో చాలా సీట్లు ఖాళీగా ఉంటున్నాయి.
ఇంజనీరింగ్ కాలేజీల్లో లక్ష సీట్లుంటే 70 వేలు సీఎస్ఈలోనే…
తెలంగాణలో 2024-25 విద్యాసంవత్సరంలో 1,01,661 ఇంజనీరింగ్ సీట్లు మంజూరయ్యాయి. ఇందులో 70,248 సీట్లు సీఎస్ఈ, ఐటీ ఆధారిత బ్రాంచీలకు సంబంధించినవే. ఎలక్ట్రానిక్స్,ఎలక్ట్రికల్ విభాగాల్లో 20,940 సీట్లు, సివిల్, మెకానికల్ ఆధారిత కోర్సుల్లో 9,190 సీట్లు, ఇతర ఇంజనీరింగ్ బ్రాంచీల్లో 1,283 సీట్లున్నాయి.
మొత్తం ఇంజనీరింగ్ సీట్లలో 72,741 సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు. మిగిలినవి మేనేజ్ మెంట్ కోటాలో భర్తీ చేస్తారు. 2023-24 విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ విద్యాసంవత్సరం కంప్యూటర్ సైన్స్ విభాగంలో 10 శాతం అదనంగా సీట్లకు ఇంజనీరింగ్ కాలేజీలు అనుమతిని పొందాయి.
గత విద్యా సంవత్సరంలో కన్వీనర్ కోటా కింద 83,766 బీటెక్ సీట్లున్నాయి. ఇందులో కంప్యూటర్ సైన్స్ , ఐటీ సంబంధిత బ్రాంచీల్లో 56,811 సీట్లున్నాయి. గత విద్యా సంవత్సరం కంప్యూటర్ సైన్స్ బ్రాంచీల్లో 98.70 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ సంబంధిత బ్రాంచీల్లో సగం కంటే తక్కువ సీట్లే భర్తీ అయ్యాయి.
సీఎస్ఈ కోర్సులపై ఎందుకంత క్రేజ్
సీఎస్ఈ కోర్సులపై గత కొంతకాలంగా క్రేజ్ ఉంది. ఇంజనీరింగ్ చదివే విద్యార్థుల్లో ఎక్కువగా సీఎస్ఈ, ఐటీ, సీఎస్ఈ (డేటా సైన్స్), సీఎస్ఈ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్) , సీఎస్ఈ( సైబర్ సెక్యూరిటీ), ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అండ్ డేటా సైన్స్ వంటి కోర్సులను చదువుతున్నారు. సీఎస్ఈ కోర్సును అభ్యసిస్తే సాఫ్ట్ వేర్ జాబ్స్ సంపాదించవచ్చు. ఈ రంగంలో ఉద్యోగావకాశాలతో పాటు ఆకర్షణీయమైన జీతం ఉంటుంది. దీంతో ఎక్కువమంది విద్యార్థులు ఈ కోర్సును చదివేందుకు ఆసక్తిని చూపుతున్నారు. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ కంపెనీలు ఇంజనీరింగ్ కాలేజీల్లో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించి ఇంజనీరింగ్ పూర్తి చేసేలోపుగానే విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తున్నాయి. ఇది కూడా ఈ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు.
కంప్యూటర్ కోర్సులు చదివితే ఉద్యోగాలకు పోటీ ఎక్కువే
సీఎస్ఈ కోర్సు చేసిన వారికి ఉద్యోగాలు సంపాదించేందుకు పోటీ కూడా ఎక్కువే. పరిశ్రమల్లో అధునాతన వ్యవస్థలు, ఆటోమెషన్ పురోగతి సీఎస్ఈ కోర్సుకు డిమాండ్ ను పెంచింది. ప్రస్తుతం ప్రతి రంగంలో కంప్యూటర్ల వినియోగం అనివార్యమైంది. దీని కారణంగా కంప్యూటర్ సైన్స్ చదువుకున్నవారికి ఉద్యోగాలు కల్పించాల్సివస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ లలో ఎంతో సాంకేతిక పురోగతి వస్తోంది. సీఎస్ఈ డొమైన్ లలో అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. టెక్నాలజీకి డిమాండ్ ఉన్నందున సీఎస్ఈ విద్యార్థులకు పోటీ ఉన్నా అవకాశాలు కూడా అదే క్రమంలో పెరుగుతున్నాయి.
సీఎస్ఈ కోర్సుల్లో సీట్ల పెంపుపై జెఎన్టీయూ అభ్యంతరం
సీఎస్ఈ, ఐటీ సంబంధిత బ్రాంచీల్లో సీట్లను ప్రతి విద్యా సంవత్సరం పెంచడం సరైంది కాదని జెఎన్టీయూ హైద్రాబాద్ అఖిల భారత సాంకేతిక విద్యామండలికి ఈ నెల 5న లేఖ రాసింది. ఇంజనీరింగ్ లో కోర్ బ్రాంచీల సీట్ల సంఖ్యను తగ్గించడం సహేతుకం కాదని జేఎన్టీయూ ఆ లేఖలో అభిప్రాయపడింది. ఆయా కాలేజీలు తమ కాలేజీల్లో కంప్యూటర్ ఆధారిత కోర్సుల్లో సీట్లకు అనుమతి కోరుతూ ధరఖాస్తులు చేసుకొంటే ఏఐసీటీఈ అనుమతిని ఇచ్చింది.
సామాజిక సమతూకం దెబ్బతింటుందా…
సీఎస్ఈ కోర్సులనే విద్యార్థులు ఎక్కువగా చదువుకోవడంతో సమాజంలో సమతుల్యత లోపిస్తుందనే అభిప్రాయాలున్నాయి. సోషల్ సైన్సెస్ పై విద్యార్థులకు అవగాహన లేకపోవడం సమాజంపై దుష్ప్రభావాలను చూపే అవకాశం ఉంది. విద్యార్థుల్లో పర్సనాలిటీ పెరగదు. మానవ సంబంధాల గురించి అవగాహన ఉండదనే అభిప్రాయాలను సామాజికవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. విదేశాల్లో ఐటీ రంగంలో ఉద్యోగావకాశాలకు సీఎస్ఈ కోర్సు అవకాశం కల్పిస్తున్నందున ఎక్కువ మంది విద్యార్థులు ఈ కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారని ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ హరగోపాల్ చెప్పారు. అమెరికాలో మాదిరిగానే నాలుగేళ్లు సోషల్ సైన్స్ చదివిన తర్వాతే డాక్టర్ కోర్సుకు అనుమతి ఇస్తారు.అలానే మన దేశంలో కూడా సోషల్ సైన్సెస్ చదివితేనే వైద్య, ఇంజనీరింగ్ కోర్సులు చదివేందుకు అవకాశం కల్పించాలని ఆయన సూచించారు.
సాఫ్ట్ వేర్ జాబ్స్ పై ఏఐ ప్రభావం ఉంటుందా?
సోషల్ సైన్సెస్ సబ్జెక్టులు చదవడం తెలుగు రాష్ట్రాల్లో చాలా తగ్గిపోయింది. ఈ సబ్జెక్టుల నుండి ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్సెస్ వైపు వెళ్లారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్సెస్ లో కూడా అనేక మార్పులు వస్తున్నాయి. కంప్యూటర్ సైన్సెస్ లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కోర్సు వైపు విద్యార్థులు ఎక్కువగా మళ్లుతున్నారు. రానున్న రోజుల్లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లపై ఎఐ ఎంతమేరకు ప్రభావం చూపుతుందోననే చర్చ ప్రస్తుతం సాగుతోంది. నాన్ ఇంజనీరింగ్ విభాగంలో కూడా రానున్న రోజుల్లో ఎఐ ప్రవేశించనుంది. అదే జరిగితే రానున్న 20 ఏళ్లలో సాఫ్ట్ వేర్ జాబ్స్ పై దీని ప్రభావం ఎంత ఉంటుందనే విషయమై అధ్యయనం సాగుతోందని ఐటీ నిపుణులు ఉమా మహేష్ చెప్పారు.
ఇంటర్మీడియట్ లో ఆర్ట్స్ సబ్జెక్టుల నుంచి సైన్స్ వైపు మళ్లినట్టుగానే ఇంజనీరింగ్ లో ఈఈఈ, ఈసీఈ వంటి కోర్సుల స్థానంలో సీఎస్ఈ వైపు విద్యార్థులు మళ్లుతున్నారు. అయితే సమాజంలో ఇన్ బ్యాలెన్స్ కలగకుండా ఉండేందుకుగాను ప్రభుత్వం విద్యావ్యవస్థలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire