Covid Vaccine: వ్యాక్సిన్‌ కేంద్రాలకు పోటెత్తుతున్న జనం

Covid Vaccine: Large Queue for Covid Vaccination Center
x

కరోనా వాక్సినేషన్ సెంటర్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Covid Vaccine: నిన్నమొన్నటి వరకు కోవిడ్ టీకా అంటే లేనిపోని అపోహలు ఉండడంతో వేసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు

Covid Vaccine: నిన్నమొన్నటి వరకు కోవిడ్ టీకా అంటే లేనిపోని అపోహలు ఉండడంతో వేసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కానీ.. ఇప్పుడు పరిస్థితులు మారాయి. సామాన్యుల నుంచి సంపన్నుల వరకూ కరోనాను ఎదుర్కొనేందుకు టీకాయే ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు ముందుకొస్తున్నారు. దీంతో వాక్సినేషన్ సెంటర్ల దగ్గర జనాలు బారులు తీరుతున్నారు. గంటల కొద్దీ లైన్లలో నిల్చొని టీకా తీసుకుంటున్నారు.

ఇక.. అధికారులు, కిందిస్థాయి సిబ్బంది మధ్య సమన్వయలోపంతో కొన్ని వ్యాక్సినేషన్‌ సెంటర్ల దగ్గర ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో టీకా వేయించుకునేందుకు వచ్చిన వృద్ధులు, మహిళలు విసిగెత్తిపోతున్నారు. తమకు కేటాయించిన సమయానికి టీకా ఇవ్వకపోవడంతో గంటల తరబడి లైన్లలో వేచి చూస్తున్నారు. లైన్లలో ఉన్నవాళ్ళను కాదని.. తమకు తెలిసిన వాళ్లకు లేదా పైరవీలతో వచ్చిన వాళ్ళకి టీకాలు వేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని తొర్రూరులో వ్యాక్సిన్ కేంద్రం వద్ద ప్రజలు ఆందోళనకు దిగారు. టోకన్లు లేనివారికి కూడా టీకాలు వేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొన్నిచోట్ల సరిపడా టీకాలు లేకపోవడంతో.. మరుసటి రోజు రావాలని ప్రజలను వెనక్కి పంపేస్తున్నారు.

కుత్బుల్లాపూర్‌ గాజులరామారం మహారాజా గార్డెన్స్‌లోని వ్యాక్సినేషన్‌ కేంద్రం దగ్గర.. టీకా తీసుకునేందుకు జనాలు పోటెత్తారు. సుమారు 2వేల మందికి పైగా ప్రజలు కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ సెంటర్‌కు చేరుకోగా.. స్లాట్ బుకింగ్‌లో గందరగోళం నెలకొంది. దీంతో ప్రజలు గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురైంది. సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు.. టీకా ఎప్పుడు వేస్తారంటూ అధికారులను నిలదీశారు.

సికింద్రాబాద్ నియోజకవర్గంలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లోని సిబ్బంది.. వారికి తెలిసినవారిని డైరెక్ట్‌గా తీసుకొని వెళ్లి వ్యాక్సిన్‌ వేయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో.. ఆన్‌లైన్‌లో బుక్‌చేసుకున్న తాము.. గంటల కొద్దీ వ్యాక్సిన్‌ కోసం లైన్లలో నిల్చోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుషాయిగూడ జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్‌ సెంటర్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం 6 గంటల నుంచి క్యూలైన్లలో నిలబడ్డా.. టోకెన్లు అందడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రికి వ్యాక్సినేషన్‌ కోసం వచ్చిన ప్రజలు.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు.

మరోవైపు.. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని ఆరాంఘర్‌ మెట్రో క్లాసిక్‌ గార్డెన్‌లో వ్యాక్సినేషన్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు డిప్యూటీ కమిషనర్‌ జగన్‌. గత 15 రోజులుగా.. రోజుకు 13 వందల మందికి పైగా టీకా ఇస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ రూపొందించిన యాప్‌ ద్వారా సూపర్‌ స్ప్రెడర్స్‌ను గుర్తించి వ్యాక్సిన్‌ ఇస్తున్నామన్నారు. అలాగే.. 18ఏళ్లు పైబడి హైరిస్క్‌ కేటగిరీలో ఉన్నవారికి కూడా వ్యాక్సిన్‌ ఇవ్వడం జరుగుతోందన్నారు డిప్యూటీ కమిషనర్‌ జగన్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories