Corona: తెలుగురాష్ట్రాల్లో కరోనా కలవరం

Coronavirus Tension in the Telugu States
x

కరోన వైరస్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Corona: రెండు రాష్ట్రాల్లో వేల మందిని తన గుప్పిట్లో బంధించి గుబులు పుట్టిస్తోన్న కరోన

Corona: తెలుగురాష్ట్రాల్లో కరోనా కలవరపెడుతోంది. విశృంఖలంగా వ్యాపిస్తున్న కోవిడ్ రెండు రాష్ట్రాల్లో వేల మందిని తన గుప్పిట్లో బంధించి గుబులు పుట్టిస్తోంది. సెకండ్‌వేవ్‌ ఆరంభమైన నాటి నుంచి దూకుడు పెంచిన కోవిడ్‌ ఉపద్రవంలా ముంచెత్తి ప్రమాదకరస్థాయికి చేరింది.

తెలంగాణలోవరుసగా నాలుగో రోజు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 4వేల 4వందల 46 మందికి కోవిడ్ సోకినట్టు తెలంగాణ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. మరో 12 మంది కోవిడ్ బారిన పడి మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 3 లక్షల 46 వేల 331కు చేరగా.. ఇప్పటివరకు కోవిడ్ కారణంగా 1809 మంది మృత్యువాత పడ్డారు. రోజువారీ కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తుండటంతో రాష్ట్రంలో నానాటికీ రికవరీ రేటు పడిపోతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 33 వేల 5 వందలకు పైగా యాక్టివ్ కేసులు ఉండగా.. రికవరీ రేటు 87 శాతం ఉంది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రోజూ పదుల సంఖ్యలో కేసులు వస్తున్నాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 15 జిల్లాల్లో వందకు పైగా రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. ఇందులో అత్యధికంగా జీహెచ్ఎంసీలోనే ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 598 మందికి కోవిడ్ సోకింది. గత పది రోజులుగా జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏకంగా 4 వేల 5 వందల కేసులు నమోదయ్యాయి. రోజూ హైదరాబాద్‌లో 3 వందల నుంచి 6 వందల మంది దాకా కోవిడ్ బారిన పడుతున్నారు.

ఇక హైదరాబాద్ తర్వాత మేడ్చల్ జిల్లాలో అత్యధిక కేసులు వెలుగుచూశాయి. తాజాగా మేడ్చల్‌ జిల్లాలో 435 పాజిటివ్ కేసులొచ్చాయి. ఇక రంగారెడ్డిలో 326 కేసులు నమోదైతే, నిజామాబాద్ జిల్లాలో 314 కొత్త కేసులొచ్చాయి. ఇక సంగారెడ్డిలో 235, కామారెడ్డి జిల్లాలో 184, జగిత్యాల జిల్లాలో 180, నల్గొండ జిల్లాలో 168, నిర్మల్ జిల్లాలో 160 కొత్త కేసులొచ్చాయి.

అటు ఏపీలోనూ కోవిడ్ సెకండ్ వేవ్‌ కల్లోలం సృష్టిస్తోంది. శుక్రవారం రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో ఏకంగా 6 వేల 96 మంది కోవిడ్ బారిన పడ్డారు. గురువారం 5 వేల 96 మందికి కోవిడ్ సోకగా ఒక్కరోజులోనే ఆ సంఖ్య వెయ్యికి పెరిగింది. ఒక్కరోజులో కోవిడ్ బారిన పడి 20 మంది బలయ్యారు.

గురువారం నుంచి శుక్రవారం వరకు రాష్ట్రంలో 6 వేల 96 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అవగా అందులో వెయ్యికి పైగా కేసులు కేవలం చిత్తూరు జిల్లాలోనే నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో 750, గుంటూరు జిల్లాలో 735, కర్నూలు జిల్లాలో 550, శ్రీకాకుళం జిల్లాల్లో 534 కేసులతో కోవిడ్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మిగిలిన జిల్లాల్లోనూ పశ్చిమగోదావరి మినహా అన్ని జిల్లాల్లో 2వందలు ఆపైనే కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.

గడిచిన రెండు రోజులుగా చిత్తూరు జిల్లాలో 8 వందలు, వెయ్యికి పైగా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ రెండు రోజుల్లోనే చిత్తూరు జిల్లాలో దాదాపు 2వేల కేసులు నమోదయ్యాయి. ఇక తూర్పుగోదావరి జిల్లాలోనూ భారీగా కోవిడ్ కేసులొస్తున్నాయి. నిన్న తూర్పుగోదావరి జిల్లాలో 750 పాజిటివ్ కేసులు నమోదవగా.. మూడు రోజుల్లో 18 వందలకు పైగా కేసులొచ్చాయి. గుంటూరు జిల్లాలోనూ మూడు రోజుల్లో దాదాపు 18 వందల కొత్త కేసులు వచ్చాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories