కోవిడ్ వ్యాక్సిన్ వచ్చేసింది...కానీ

Corona Vaccine Fear in Front End Warriors
x

Representational Image

Highlights

కోవిడ్ వ్యాక్సిన్ వచ్చేసింది. దాంతో అందరిలోనూ ఆనందం కనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా తమకెప్పుడు వ్యాక్సిన్ వేసుకునే అవకాశం వస్తుందా అంటూ ఎదురుచూపులు ఉన్న...

కోవిడ్ వ్యాక్సిన్ వచ్చేసింది. దాంతో అందరిలోనూ ఆనందం కనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా తమకెప్పుడు వ్యాక్సిన్ వేసుకునే అవకాశం వస్తుందా అంటూ ఎదురుచూపులు ఉన్న క్షణాలవి ఇదంతా నాలుగైదు రోజుల క్రితం మాట. కానీ, ఇప్పుడు వ్యాక్సిన్‌ అంటేనే భయపడుతున్నారు. వ్యాక్సినేషన్ మొదలైన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు క్రమంగా ఫ్రంట్ వారియర్స్‌లో భయం నింపుతోంది.

కరోనా మహమ్మారి 2020లో ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ వైరస్‌ను అరికట్టడంలో ప్రపంచ దేశాలు పోటీ పడ్డాయి. వ్యాక్సిన్ కోసం అనేక దేశాలు ఏడాదిగా కష్టపడుతూనే ఉన్నాయి. అయితే.. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ ముందుంది. ప్రజలకు అత్యధిక వ్యాక్సిన్‌ డోసులను వేసి, అంతర్జాతీయ రికార్డు సృష్టించింది. వ్యాక్సిన్‌ ఆవిష్కరించిన తొలివారం రోజుల్లోనే కోవిడ్‌–19 వ్యాప్తని అడ్డుకునేందుకు 12 లక్షల మంది ఆరోగ్యకార్యకర్తలకు వ్యాక్సినేషన్‌ చేసినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెపుతున్నాయి.

ఈ నెల 19న కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వరంగల్‌కు చెందిన అంగన్ వాడీ టీచర్ గన్నారపు వనిత 25న మృతి చెందింది. ఇందుకు కారణాలను విశ్లేషించే దిశగా ఆమె మృతదేహానికి పోస్ట్ మార్టమ్ నిర్వహించారు. మరో ఇద్దరు అంగన్ వాడీ కార్యకర్తలు కూడా వ్యాక్సినేషన్ తర్వాత ఏడు రోజులకు అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

అసలు వ్యాక్సిన్ సేఫ్ సైడా కాదా అనేది ఫ్రంట్ లైన్ వారియర్స్ లో ఆందోళన మొదలైంది. అయితే.. అసలు వ్యాక్సిన్ అనేది చర్చ జరుగుతుంది. అయితే వైద్యులు మాత్రం కరోనా వ్యాక్సిన్ సురక్షితమైందంటున్నారు. ఒకవేళ వ్యాక్సిన్‌లో లోపాలుంటే ఒకే బ్యాచ్‌కు చెందిన టీకా వేసుకున్న వారందరికీ సైడ్‌ఎఫెక్ట్స్‌ వస్తాయంటున్నారు డాక్టర్ లలిత.

ఎవరికైనా వ్యాక్సిన్‌తో అనారోగ్య సమస్యలు తలెత్తితే తక్షణమే చికిత్స అందించడానికి రాష్ట్రాలలోని ప్రతీ జిల్లాలో ప్రధాన అస్పత్రుల్లో ఐసీయూ పడకలను సిద్ధం చేసి ఉంచారు. వాక్సినేషన్ విషయంలో ఎవరూ భయపడవద్దని, ఇప్పటివరకు చాలామందికి టీకా వేసినా వారికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని. ప్రతీ ఒక్కరూ ధైర్యంగా టీకా వేసుకోవాలని వరంగల్ అడిషినల్ డీఎంహెచ్ఓ డాక్టర్ మదన్ మోహన్ సూచించారు.

అసలు వాక్సినేషన్ ప్రక్రియ మొత్తం చాలా ప్రత్యేకంగా జరుగుతుంది. కొవిడ్‌ వ్యాక్సిన్‌ కేంద్రంలోకి ప్రవేశించిన లబ్ధిదారుడిని అక్కడి డాక్టర్లు మొదట శరీర ఉష్ణోగ్రతను పరిశీలిస్తారు. జ్వరం ఉన్నట్టు తేలితే లోపలికి అనుమతించరు. కొవిడ్‌ పాజిటివ్‌ ఉన్నా, లేదా ఆ లక్షణాలు కనిపించినా టీకా ఇవ్వరు. తొలి డోసు పొందాక లబ్ధిదారుడు 2వ డోసు ఎప్పుడు పొందాలో ఆయన మొబైల్‌ ఫోన్‌కు మెసేజ్‌ వస్తుంది. రెండో డోసు పూర్తయ్యాక కొవిడ్‌ టీకా పొందినట్లుగా మొబైల్‌ ఫోన్‌కు ధ్రువపత్రం అందుతుంది.

సాధారణంగా వ్యాక్సిన్లలో లోపాలుంటే వికటిస్తాయి.కానీ మన వ్యాక్సిన్లు ఎంతో భద్రతా ప్రమాణాలు ఉన్నవన్నారు. ఇక కొన్నిసార్లు మానవ తప్పిదంతో మూడు రకాలుగా వ్యాక్సిన్లు వికటిస్తుంటాయని వైద్యారోగ్య శాఖ అంతర్గతంగా విశ్లేషించింది. ఒకటి వ్యాక్సిన్లను సరైన ఉష్ణోగ్రతలో ఉంచకపోవడం వల్ల దాన్ని వేసుకున్న వారికి రియాక్షన్లు వచ్చే అవకాశం ఉంది. రెండోది అవసరం లేకపోయినా ఒక్కోసారి ఫ్రీజర్ల నుంచి ఎక్కువ వ్యాక్సిన్లు తీసి బయట పెడుతుంటారు. అప్పుడూ వ్యాక్సిన్‌ వికటించే అవకాశం ఉంది.

ఇక మూడోది వ్యాక్సిన్‌ను కండరానికి కాకుండా ఇంకోచోట పొరపాటున వేయడం వల్ల కూడా ఒక్కోసారి వికటిస్తుందని తెలుస్తోంది. ఈ మూడు కోణాల్లోనూ జరిగిన అన్ని ఘటనలను విచారిస్తున్నారు. అంతేకాకుండా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కొంత రెస్ట్ తీసుకోవాలని, 28 రోజుల వరకు పూర్తిగా కేర్ పుల్ గా ఉండాలని చెప్పినప్పటికీ కొందరు జాగ్రత్తలు పాటించకపోవడం మూలానే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయట. సహజంగా వాక్సినేషన్ తర్వాత జరిగిన సంఘటనలు టీకాల కార్యక్రమంపై వ్యతిరేక ప్రభావం చూపుతున్నాయి. ఇతర టీకాల విషయంలోనూ ఇలాంటివి చూశామని ఒక సీనియర్‌ అధికారి ఆఫ్ ది రికార్డ్ గా వ్యాఖ్యానించారు. అయితే వ్యాక్సిన్‌కు, ప్రస్తుతం జరిగిన మృతి సంఘటనలకు ఎలాంటి సంబంధం లేదని విరివిగా ప్రచారం చేస్తామని తెలిపారు.

వేలు, లక్షల్లో వ్యాక్సిన్లు వేసినప్పుడు యాదృచ్ఛికంగా ఒకటీ అరా ప్రతికూల సంఘటనలు జరుగుతుంటాయని అంతమాత్రాన దాన్ని వ్యాక్సిన్‌కు ముడిపెట్టడం సరికాదని వారు చెబుతున్నారు. ప్రస్తుతం టీకా వేసుకుంటున్న వైద్య సిబ్బంది ఈ విషయాన్ని అర్థం చేసుకుని సాధారణ ప్రజలకు ఆదర్శంగా నిలవాలని డాక్టర్లు చెబుతున్నారు.

కరోనా మహమ్మారి రాబోయే కాలంలో ఏ రూపు తీసుకుంటుందో తెలియదు. కనుక జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మనపై ఉంది.కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో తలెత్తుతున్న అనుమానాలపై ఇప్పటివరకు జరిగిన మరణాలకు సంబంధించి సైడ్ ఎఫెక్ట్స్ కమిటీ, పోస్ట్ మార్టమ్ తదితర రిపోర్ట్ లు వచ్చిన తర్వాతే అసలు కారణం తెలుస్తుంది. అయినప్పటికీ వైద్యారోగ్య శాఖ ప్రాథమిక విచారణలో మాత్రం ఈ మరణాలకు వ్యాక్సినేషన్ కాదని తేలింది. ప్రజల్లో ఈ టీకాపై ఉన్న అపోహలు తొలిగిపోవలసిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories