Telangana Congress: తెలంగాణలో అభ్యర్ధుల ఎంపికకు సిద్ధమైన కాంగ్రెస్

Congress Ready To Select Candidates In Telangana
x

Telangana Congress: తెలంగాణలో అభ్యర్ధుల ఎంపికకు సిద్ధమైన కాంగ్రెస్ 

Highlights

Telangana Congress: 28 మంది సభ్యులతో ప్రదేశ్‌ ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసిన హైకమాండ్

Telangana Congress: రానున్న ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు కాంగ్రెస్‌ సిద్ధమైంది. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ప్రాథమిక వడపోతలో కీలకమైన ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ రేపు గాంధీ భవన్‌లో భేటీ కానుంది. ఈ సమావేశంలో స్ర్కీనింగ్‌ కమిటీ చైర్మన్‌ మురళీధర్‌, సభ్యులు కూడా పాల్గొననున్నారు. ఈ ఎన్నికల కమిటీలు ఏర్పాటయ్యాక జరుగుతున్న తొలి భేటీలో ప్రధానంగా అభ్యర్థుల ఎంపికకు విధి విధానాలను నిర్ణయించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 2018 ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ముగింపు దశకు వచ్చే దాకా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయలేకపోయిన టీ కాంగ్రెస్‌ పార్టీ భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. ఈ ఎన్నికల్లో ఆ పరిస్థితి రాకుండా నోటిఫికేషన్‌ విడుదలకు నెలల ముందే ప్రక్రియ ప్రారంభించింది.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి చైర్మన్‌గా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు కలుపుకుని 28 మంది సభ్యులతో గత నెల 20న ప్రదేశ్‌ ఎన్నికల కమిటీని అధిష్ఠానం ఏర్పాటు చేసింది. పీఈసీ వడపోసిన జాబితాను స్ర్కీనింగ్‌ చేయడానికి మురళీధర్‌ చైర్మన్‌గా, జిగ్నేష్‌ మేవానీ, బాబా సిద్దికీలు సభ్యులుగా, రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా స్ర్కీనింగ్‌ కమిటీని ఈ నెల 2న నియమించింది. అభ్యర్థులకు సంబంధించి వివాదం లేని 38 స్థానాల్లో, ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లో వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుని తొలి జాబితా విడుదల చేసే ఆలోచనలో ఉన్న అధిష్టానం.. ఈ ప్రక్రియను ముందుగానే ప్రారంభించిందని చెబుతున్నారు. కాగా, ఆదివాసీ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో గాంధీభవన్‌ ఆవరణలోని ప్రకాశం హాల్లో రేపు ఆదివాసీ గిరిజన మహాసభ జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories