Congress: కాంగ్రెస్‌లో అధికారంలోకి వస్తామనే ధీమానా..? లేక భయమా..?

Congress Party Is Already Ten Years Not In Power In Telangana
x

Congress: కాంగ్రెస్‌లో అధికారంలోకి వస్తామనే ధీమానా..? లేక భయమా..?

Highlights

Congress: ఉద్యోగుల జీతాల పరిస్థితి ఏంటి..? అభివృద్ధి మాటేంటి..?

Congress: ఆరు గ్యారెంటీల పథకాలు, సామాజిక వర్గాల వారిగా డిక్లరేషన్లు. ఎన్నికల్లో గెలుపే లక్ష‌్యంగా కాంగ్రెస్ కురిపిస్తోన్న హామీల వర్షం ఇది. ఇంకా చెప్పాలంటే.. కాంగ్రెస్ గెలుపు ఆశలన్నీ ఈ మేనిఫెస్టో మీదనే పెట్టుకుంది. ఎలాగైనా జనాలను తమ వైపు తిప్పుకోవాలని చూస్తోంది. అందుకే అన్ని వర్గాలను టార్గెట్‌ చేస్తూ.. వారి కోసం ఏదో ఒక సంక్షేమ పథకం ఉండేలా మేనిఫెస్టోను తయారు చేసింది. ఐతే కాంగ్రెస్‌ ప్రకటనలను చూస్తుంటే.. అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉందా లేక ఓటమి భయంతో ఇంతలా వాగ్దానాల వర్షం కురిపిస్తోందా అనే చర్చ జరుగుతోంది. నిజంగా ప్రజల అవసరాలు గుర్తించి.. వారికి మేలు చేసే ఉద్దేశంతోనే హామీలు ఇచ్చిందా లేక అధికారం కోసమా..? అనే ఆసక్తి నెలకొంది.

తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు పేరున్నా.. రెండు టర్మ్‌లు అధికారానికి దూరంగానే ఉంది. జరిగిన రెండు ఎన్నికల్లోనూ గులాబీ పార్టీనే సీఎం పీఠాన్ని దక్కించుకుంది. స్వరాష్ట్ర్రంలో ఇప్పుడు జరుగుతుంది మూడో ఎన్నిక. ఇప్పుడు కూడా అధికారానికి దూరం అయితే.. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి గందరగోళంగా మారుతుందని పార్టీ హైకమాండ్‌ భావించి ఉండొచ్చు. అందుకే ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని సర్వశక్తులు ఒడ్డుతోంది. అన్ని అస్త్రాలను వాడుతోంది. అందులో మేనిఫెస్టోను ప్రధానాస్త్రంగా ఎంచుకుంది హస్తం పార్టీ.

సంక్షేమానికి కేరాప్‌గా మారిన కేసీఆర్‌ను దెబ్బకొట్టాలంటే.. సంక్షేమ మంత్రమే ఉపయోగిస్తోంది. రైతు బంధు 15వేలకు పెంపు, కౌలు రైతులకు రైతుబంధుతో పాటు రైతు కూలీలకు కూడా నగదు సాయం చేస్తామంటోంది. మహిళలకు ప్రతి నెలా 2500రూపాయాలు, 5వందలకే గ్యాస్ సిలిండర్, ఇళ్లు కట్టుకోవడానికి 5లక్షలు, ఆరోగ్య భీమా కార్డు, 5వేలకు అసరా పెన్షన్ పెంపు, నిరుద్యోగులకు లోన్ వంటి ఎన్నో పథకాలను మేనిఫెస్టోలో పొందు పరిచింది.

ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన వాగ్ధానాలను చూస్తుంటే అమలు సాధ్యం అవుతాయా లేదా అనే సందేహాలు అయితే కలుగకమానదు. ఎందుకంటే రాష‌్ట్ర బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకునే హామీలు ఇచ్చారా..? లేక గెలిస్తే చూద్దాంలే అన్నట్టుగా ఎడాపెడా వాగ్ధానాలు చేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే..బడ్జెట్‌లో సగం డబ్బు వాటికే పోతోంది.

ప్రతి ఏడాది లక్ష కోట్లకుపైనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితిలో సంక్షేమ పథకాల అమలుకు అంత పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారు.. అప్పు చేసి హామీలను నెరవేర్చుతారా అనే ప్రశ‌్నలు తలెత్తుతున్నాయి. ఓట్ల కోసం చేసే సంక్షేమ పథకాల కోసం భారీ ఎత్తున ఖర్చు చేస్తే.. ఉద్యోగుల జీతాల మాటేంటి.. అభివృద్ధి మాటేంటని.. పొలిటికల్ విశ్లేషకుల నుంచి ఎదురవుతున్న ప్రశ్న. అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలను నెరవేర్చుతామానే నమ్మకం కాంగ్రెస్ నేతల్లో ఉందా.. లేక ఇదంతా ఎన్నికల స్టంటా అనే చర్చ జరుగుతోంది జనాల్లో.

Show Full Article
Print Article
Next Story
More Stories