పార్లమెంటు ఎన్నికల తరువాత తెలంగాణ ఎన్నికల ముఖచిత్రం మారింది.
పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ లో చేరారు. కేసీఆర్ మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా, రెండో విడతలో స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన పోచారం... ఇప్పుడు కారు దిగి రేవంత్ రెడ్డితో చేయి కలిపారు.
గతంలో టీడీపీని ఖాళీ చేసేందుకు కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్నే ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నారనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. 2014లో టీడీపీ తరఫున గెలిచిన 15 మంది ఎమ్మెల్యేలలో 12 మంది అప్పటి టీఆర్ఎస్‌లో చేరిపోయారు.
పదేళ్ళు తిరిగేప్పటికి సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో దాదాపు 25 మందికి గాలం వేసిందని అంటున్నారు. వారం , పది రోజుల్లో బీఆర్ఎస్ కు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేలా రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారని చెబుతున్నారు. శుక్రవారం నాడు పోచారం శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఈ ప్రణాళికకు తొలి అడుగు అని భావిస్తున్నారు.
బీఆర్ఎస్ కీలక నేత పోచారం
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి వరుస విజయాలు సాధించిన నాయకులు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాన్సువాడ నుండి తెలుగుదేశం, బీఆర్ఎస్ అభ్యర్ధిగా ఆయన విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత బీఆర్ఎస్ అభ్యర్ధిగా ఇదే స్థానం నుండి గెలుపొందారు.
తొలుత కాంగ్రెస్ పార్టీలో ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి 1984 లో తెలుగుదేశంలో చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి మంత్రిగా కూడా పనిచేశారు. 1994, 1999, 2009 తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా గెలుపొందారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్ధి బాజిరెడ్డి గోవర్ధన్ చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో 2011 మార్చిలో పోచారం శ్రీనివాస్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ లో చేరారు.
టీడీపీ ద్వారా దక్కిన ఎమ్మెల్యే పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిపై పోచారం శ్రీనివాస్ రెడ్డి గెలిచారు. ఆ ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉంది. 2014, 2018, 2023 ఎన్నికల్లో ఇదే స్థానం నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా ఆయన గెలుపొందారు. 2014లో కేసీఆర్ మంత్రివర్గంలో పోచారం వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 2018 నుండి 2023 వరకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరించారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. అలాంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడడం చర్చకు దారి తీసింది. పోచారం శ్రీనివాస్ రెడ్డికి పార్టీ ఏం తక్కువ చేసిందని బీఆర్ఎస్ లీడర్ , మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రశ్నించారు. రైతులకు అన్యాయం చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ ను రైతు పక్షపాతిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రశంసలు కురిపించడంపై ఆయన మండిపడ్డారు.
కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కట్టారా?
రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ శాసనసభా పక్షాన్ని ఖాళీ చేయించే ఆలోచనతో ఉన్నారని చెబుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక వైపు బీఆర్ఎస్, మరో వైపు బీజేపీ నాయకులు ఈ ప్రభుత్వం కూలిపోతుందని చేసిన ప్రకటనలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గానే స్పందించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఈ వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు.
పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజు నుంచే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షించే ప్రక్రియను ప్రారంభించింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. అంతకు ముందే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ కాంగ్రెస్ లో చేరారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కూతురితో సహా కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ లో కీలక నాయకులు పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ఇవాళ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు నేతలు కూడా బీఆర్ఎస్ ను వీడనున్నారని ప్రచారం సాగుతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితిని చూసి ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు తమ పార్టీలో చేరుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నిరంజన్ చెప్పారు.
బీఆర్ఎస్ నుంచి ఇంకా ఎవరెవరు...
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోనేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలవలేదు. జీహెచ్ఎంసీ పరిధిలో పార్టీని బలోపేతం క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకొనే వ్యూహరచన చేస్తుంది అధికార పార్టీ. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ , చేవేళ్ల ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. తమ భేటీ మర్యాదపూర్వకమేనని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు చెప్పారు. గద్వాల ఎమ్మెల్యే బి. కృష్ణ మోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారాన్ని కృష్ణమోహన్ రెడ్డి ఖండించారు. తాను బీఆర్ఎస్ లో ఉంటానని ప్రకటించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, గద్వాల జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, జీహెచ్ఎంసీ పరిధిలోని పలువురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకత్వంతో టచ్ లో ఉన్నారనే ప్రచారం సాగుతుంది.
బీఆర్ఎస్ శాసనసభా పక్షం కాంగ్రెస్‌లో విలీనమవుతుందా?
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఎమ్మెల్యే పదవిని కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే ఎమ్మెల్యే పదవిని కోల్పోకుండా ఉండాలంటే మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు పార్టీ మారాలి. అసెంబ్లీలో ఆ పార్టీ శాసనసభపక్షం కాంగ్రెస్ లో విలీనం చేసుకోవచ్చు.
తెలంగాణ అసెంబ్లీలో గతంలో రెండు సార్లు ఇదే రకమైన ఉదంతాలు చోటు చేసుకున్నాయి. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్షాలు బీఆర్ఎస్ లో విలీనమయ్యాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ కు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ ఇదే వ్యూహంతో ముందుకు వెళ్తుందనే ప్రచారం సాగుతోంది. అదే జరిగితే కేసీఆర్ చూపిన దారిలోనే రేవంత్ రెడ్డి వెళ్లినట్లవుతుంది.
అయితే భవిష్యత్తులో ఏం జరుగుతుందో తాము ఇప్పుడే చెప్పలేమని కాంగ్రెస్ నాయకులు నిరంజన్ చెప్పారు. పార్టీలో మొదటి నుండి పనిచేసిన వారికే పార్టీలో ప్రాధాన్యం ఉంటుందన్నారు. మరో వైపు తమకు కూడా మంచి రోజులు వస్తాయని బీఆర్ఎస్ నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుండి డి.శ్రీనివాస్, సురేష్ రెడ్డి, కె.కేశవరావు వంటి నాయకులు ఇప్పటికే బీఆర్ఎస్ లో చేరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఆనాడు టీడీపీకి జరిగిందే ఈనాడు బీఆర్ఎస్‌కు..?
2014, 2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత టీడీపీ శాసనసభపక్షం, బీఆర్ఎస్ శాసనసభపక్షంలో విలీనమైంది. 2014లో టీడీపీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు, 1 ఎంపీ గెలిచారు. 2018లో ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు. మొదటిసారి బొటాబొటీ మెజారిటీతో అధికారంలో ఉన్న టీఆర్ఎస్.. తెలుగుదేశం ఎమ్మెల్యేలను గంపగుత్తగా 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను లాగేసుకుంది. అలా చేరినవారు అప్పట్లో తాము బంగారు తెలంగాణ కోసమే పార్టీలు మారాల్సి వచ్చిందని చెప్పారు. తమ శాసనసభపక్షాన్ని బీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నామని అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ కు లేఖ రాశారు. బీఆర్ఎస్ లో టీడీపీ శాసనసభపక్షాన్ని విలీనం చేయడంపై రేవంత్ రెడ్డి అప్పట్లో హైకోర్టును కూడా ఆశ్రయించారు. కొంతకాలానికి రేవంత్ రెడ్డి కూడా టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఆర్.కృష్ణయ్య, సండ్ర వెంకటవీరయ్య మాత్రమే తెలుగుదేశం పార్టీలో కొనసాగారు.
పార్లమెంటు ఎన్నికల తరువాత తెలంగాణ ఎన్నికల ముఖచిత్రం మారింది. రాష్ట్రంలో బీజేపీ బలపడుతున్న సూచనలు స్పష్టంగా కనిపించాయి. ఆ పార్టీ నుంచి 8 మంది ఎంపీలు గెలిచారు. వీరి విజయంలో బీఆర్ఎస్ నాయకుల పాత్ర ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ క్రమంలోనే బీజేపీ వేగానికి బ్రేకులు వేసేందుకు కాంగ్రెస్ వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి, ఎన్నికల పర్వం ముగిసిన తరువాత రాష్ట్ర రాజకీయాల్లో విలీనాల పర్వానికి తెరలేచింది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire