తెలంగాణ కాంగ్రెస్‌లో రాములమ్మ కామెంట్ల కాక..రాములమ్మ స్వరం ఎందుకు మారింది?

తెలంగాణ కాంగ్రెస్‌లో రాములమ్మ కామెంట్ల కాక..రాములమ్మ స్వరం ఎందుకు మారింది?
x
Highlights

నలుగురికీ నచ్చినది, ఆమెకసలే నచ్చదు. నలుగురు నడిచేదారిలో, ఆమె పొరపాటున కూడా నడవరు. ఆమె తీరే భిన్నం. ఆమె మాట విభిన్నం. ఇప్పుడు కశ్మీర్‌పై కాంగ్రెస్‌...

నలుగురికీ నచ్చినది, ఆమెకసలే నచ్చదు. నలుగురు నడిచేదారిలో, ఆమె పొరపాటున కూడా నడవరు. ఆమె తీరే భిన్నం. ఆమె మాట విభిన్నం. ఇప్పుడు కశ్మీర్‌పై కాంగ్రెస్‌ పార్టీ, ఒక స్టాండ్‌ తీసుకుని బీజేపీ మీద విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే, ఆమె మాత్రం పార్టీ లైన్‌ను దాటి మాట్లాడారు. కశ్మీర్‌ విభజనను సమర్థిస్తున్నట్టు ప్రకటించి, సొంత పార్టీ నేతలనే కాదు, ప్రత్యర్థులనూ ఆశ్చర్యంలో ముంచెత్తారు. అయితే ఆమె కామెంట్ల వెనక అంతులేని వ్యూహముందన్నది, పార్టీలోనే వినిపిస్తున్న చర్చ. ఇంతకీ ఆమె ఎవరు పార్టీ లైన్‌కు డిఫరెంట్‌గా, ప్రత్యర్థి పార్టీకి సమర్థనగా, ఎందుకు మాట్లాడారు?

దేశమంతా జమ్మూకాశ్మీర్‌ విభజనపై, ఆర్టికల్ 370 రద్దుపై వాడివేడిగా చర్చ జరుగుతోంది. పార్లమెంట్‌లో హాట్‌హాట్‌ డిస్కషన్‌ జరిగి, బిల్లు ఆమోదం పొందింది. బీజేపీ తీసుకున్న నిర్ణయం పూర్తి అప్రజాస్వామికం అంటూ కాంగ్రెస్‌ ఖండించింది. మోడీ సర్కారుకు నిరసనగా పెద్ద ఎత్తున విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. అయితే కశ్మీర్ విభజనపై బీజేపీ నిర్ణయం పట్ల కాంగ్రెస్‌లోనే భిన్నవాదనలు వినిపిస్తున్నారు నేతలు. కొందరు వ్యతిరేకిస్తే, మరికొందరు సమర్థించారు. ఇప్పుడు ఈ జాబితాలో తెలంగాణ ఫైర్‌ బ్రాండ్ లీడర్, మాజీ ఎంపీ విజయశాంతి చేరారు.

దశాబ్దాలుగా రావణకాష్టంలాగా మండుతున్న జమ్మూకశ్మీర్‌కు, మేలు చేసేందుకే తాము నిర్ణయం తీసుకున్నామని, దేశమంతా దేశభక్తి సెంటిమెంట్‌ను రగిలించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. అయితే కాంగ్రెస్‌లో హేమాహేమీలు మాత్రం ఏ స్టాండ్‌ తీసుకోవాలో అర్థంకాక తర్జన భర్జనపడుతున్నారు. కానీ తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో కశ్మీర్ అంశంపై మాట్లాడ్డానికి ఏమాత్రం సాహసించని హస్తం పార్టీనేతలు వెననుకడగు వేస్తుంటే, మాజీ ఎంపీ, పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ విజయశాంతి మాత్రం కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. తాను ఆర్టికల్ 370 రద్దును పూర్తిగా సమర్థిస్తున్నట్టు ప్రకటన విడుదల చేశారు. దీంతో హస్తం పార్టీలో రాములమ్మ కాంమెట్స్ చర్చనీయాంశంగా మారాయి.

కశ్మీర్‌లో 370 రద్దుతో దేశమంతా బిజేపికి అనుకూలంగా హవా వీస్తుండడంతో, తెలంగాణలో ఆ ప్రభావం ఉంటుందని విజయశాంతి భావించిన్నట్లు తెలుస్తోంది. టి కాంగ్రెస్ ముఖ్యనేతలంతా సైలెంటుగా, అధినేత ఆదేశాల కోసం మాట్లాడకుండా చూస్తుంటే, ధైర్యంగా ఫైర్ బ్రాండ్ మాత్రం 370 రద్దును స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను విమర్శించే అవకాశం బీజేపీకి ఇవ్వకుండా, ముందుగానే ప్రకటన చేసి, పార్టీని కాపాడే ప్రయత్నం చేశారనే చర్చ కూడ పార్టీలో జోరుగా సాగుతోంది.

విజయశాంతి ప్రకటనలో పార్లమెంటు వేదికగా 370 రద్దుకు మద్దతుగా మాట్లాడిన కాంగ్రెస్‌ ప్రముఖుల పేర్లను ప్రస్తావించడంతో పాటు, తాను కూడా రద్దును మద్దతిస్తున్నట్లు చెప్పారు. ఆమె ప్రకటనలో జ్యోతిరాధిత్య సింధియా, జనార్దన్ ద్వివేది మద్దతును కోడ్ చేశారు. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ ఎదురుదాడికి, ప్రతిదాడి చేసేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్న చర్చ జరుగుతోంది.

రాములమ్మ మద్దతు వాఖ్యలు చేసి సొంతపార్టీలో హడల్ రేపినా ప్రత్యర్థి పార్టీలను మాత్రం, ఆశ్చర్యంలో ముంచెత్తారు. కశ్మీర్‌పై రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఎండగట్టాలని బీజేపీ అస్త్రశస్త్రాలకు పదునుపెడుతుంటే, విజయశాంతి వ్యాఖ్యలతో బీజేపీని కాస్త కన్‌ఫ్యూజన్‌లోకి నెట్టినట్టయ్యిందన్న విశ్లేషణలు జరుగుతున్నాయి. సొంతపార్టీ కంటే కూడా బీజేపీలో ఉన్న అనుభవం, జాతీయవాద భావాలతోనే ధైర్యంగా ఇలాంటి మద్దతు స్టేట్‌మెంట్‌ ఇచ్చారన్న వాదలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే జ్యోతిరాధిత్య సింధియా తరహాలోనే విజయశాంతి వ్యాఖ్యలను కాంగ్రెస్ పెద్దలు లైట్ తీసుకుంటారా, లేదా ప్రశ్నిస్తారా అన్నది కూడా ఉత్కంఠ కలిగిస్తోంది. అయితే, పార్టీ స్టాండ్‌కు భిన్నంగా మాట్లాడినా, ఎంతోకొంత మేలు చేసేలా కామెంట్ చేశారన్న చర్చ పార్టీలో జరుగుతోంది. దీంతో విజయశాంతిపై అధిష్టానం, ఎలాంటి కారాలు మిరియాలు నూరే అవకాశం లేదని తెలుస్తోంది. చూడాలి, కశ్మీర్‌‌పై రాములక్క మాటలు, ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories