జూన్ 2న ఉదయం.. సాయంత్రం ఆవిర్భావ వేడుకలు..

Congress Government Made Arrangements for Telangana State Formation Day
x

జూన్ 2న ఉదయం.. సాయంత్రం ఆవిర్భావ వేడుకలు..

Highlights

Telangana Formation Day: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Telangana Formation Day: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా వేడుకలకు ఏర్పాట్లు చేశారు. జూన్ 2న ఉదయం 9 గంటల 30 నిమిషాలకు గన్ పార్క్‌లో అమర వీరుల స్థూపం వద్ద సీఎం అమరులైన వారికి నివాళులు అర్పిస్తారు. ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్‌లో సీఎం జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తారు. పోలీసు బలగాల పరేడ్‌, మార్చ్‌ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమం ఉండనుంది.

ఇక వేడుకల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం సోనియాగాంధీ ప్రసంగం ఉండనుంది. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. పోలీసు సిబ్బందికి, ఉత్తమ కాంటింజెంట్లకు అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డు స్వీకర్తలతో ఫోటో సెషన్ అనంతరం కార్యక్రమం ఉండనుంది.

జూన్ 2 సాయంత్రం ట్యాంక్ బండ్‌పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రారంభం అవుతాయి. తెలంగాణకు సంబంధించిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు సీఎం రేవంత్ ట్యాంక్‌బండ్‌కు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనకు అద్దం పట్టే కార్నివాల్ నిర్వహిస్తారు. దాదాపు 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు.

అనంతరం ట్యాంక్‌బండ్‌పైన ఏర్పాటు చేసిన వేదికపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి. స్టేజ్​ షో అనంతరం జాతీయ జెండాలతో ట్యాంక్‌బండ్‌పై భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు. దాదాపు 5 వేల మంది ఇందులో పాల్గొంటారు. ఈ ఫ్లాగ్ వాక్​ జరుగుతున్నంత సేపు 13 నిమిషాల 30 సెకండ్ల నిడివి గల జయ జయహే తెలంగాణ ఫుల్​వర్షన్ గీతాన్ని విడుదల చేస్తారు. అదే వేదికపై తెలంగాణ కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణికి సన్మానం చేస్తారు. రాత్రి 8 గంటల 50 నిమిషాలకు 10 నిమిషాల పాటు హుస్సేన్ సాగర్ మీదుగా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా బాణాసంచా కార్యక్రమంతో వేడుకలను ముగిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories