తెలంగాణలో స్థానిక ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత.. ఇప్పట్లో లేనట్టేనా...?

Confusion Continues Over Local Body Election in Telangana
x

తెలంగాణలో స్థానిక ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత.. ఇప్పట్లో లేనట్టేనా...?

Highlights

జూన్‌ 6వ తేదీ వరకు పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ ఉండడంతో స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ముందస్తు కార్యాచరణ చేపట్టేందుకు వీలు లేదు.

Local Body Elections: స్థానిక ఎన్నికల నిర్వహణపై సందిగ్థత నెలకొంది. లోక్‌సభ ఎన్నికలు ముగిశాక.. జూన్‌లో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినా.. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వపరంగా అడుగులు ముందుకు పడడం లేదనే చెప్పాలి. బీసీ కమిషన్‌ ఆధ్వర్యంలో జనగణన చేపట్టినా.. క్షేత్రస్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు కాకపోవడంతో ఇప్పట్లో ఈ ఎన్నికలు జరిగే అవకాశాలు లేవనే ఊహాగానాలు వినబడుతున్నాయి.

జూన్‌ 6వ తేదీ వరకు పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ ఉండడంతో స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ముందస్తు కార్యాచరణ చేపట్టేందుకు వీలు లేదు. గ్రామపంచాయతీ పాలకమండళ్ల పదవీకాలం ముగిసి ఈ నెలాఖరుకు నాలుగు నెలలు పూర్తికానుండగా...జూలై 4 నాటికి జిల్లా, మండల ప్రజా పరిషత్‌, పాలకమండళ్ల కాలపరిమితి కూడా ముగియనుంది. అదే విధంగా వచ్చే ఏడాది మొదట్లో వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు పాలకమండళ్ల పదవీకాలం పూర్తికానుంది. ఈ నేపథ్యంలో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం చర్చనీయాంశమవుతోంది.

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా...కాంగ్రెస్‌ పార్టీ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని చెప్పడంతో పాటు ఉపకులాల వారీగా కూడా రిజర్వేషన్లు ఇస్తామని హామీనిచ్చింది. ఈ మేరకు బీసీ కమిషన్‌ నుంచి నివేదిక తెప్పించుకుంటామని ప్రకటించింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు, ఇతర గ్రూపులకు రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు గతంలోనే ట్రిపుల్‌ టెస్ట్‌ పేరిట మార్గదర్శకాలు నిర్దేశించింది. మొత్తంగా రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా ఉండాలని స్పష్టం చేసింది.

స్థానిక సంస్థల పరిధిలో ఆయా గ్రూపుల వెనుకబాటుపై బీసీ కమిషన్‌ ద్వారా విచారణ జరపాలని, ఏయే నిష్పత్తిలో రిజర్వేషన్లు ఇవ్వాలనే దానిపై తేల్చాలని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో బీసీ కమిషన్‌ విచారణ జరిపి తుది నివేదిక ఇస్తే దాని ఆధారంగానే పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో కొత్తగా రిజర్వేషన్లను ఖరారు చేసే అవకాశముంది. బీసీ కమిషన్‌ చైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు ఆధ్వర్యంలో ట్రిపుల్‌ టెస్ట్‌ మేరకు క్షేత్రస్థాయి పరిశీలనలు ఇప్పటికే పూర్తి చేసినట్టు సమాచారం.

కొత్త ఓటర్ల జాబితా ప్రాతిపదికన పంచాయతీరాజ్, మున్సిపల్‌ శాఖలను నోడల్‌ ఏజెన్సీలుగా నియమించి. ఓటర్ల జాబితా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఓటర్ల వివరాలను సేకరించాలని బీసీ కమిషన్‌ భావిస్తున్నట్టు కమిషన్‌ వర్గాల సమాచారం. అయితే ఇప్పుడు ఓటర్ల లిస్ట్‌కు అనుగుణంగానా..? లేక క్షేత్రస్ధాయిలో చేపట్టే సామాజిక, ఆర్థిక, కుల సర్వే ఆధారంగా ముందుకెళ్లాలా అనే దానిపై స్పష్టత కొరవడినట్టు సమాచారం.

ఓటర్ల జాబితాకు అనుగుణంగా అయితే పెద్దగా శ్రమ లేకుండా త్వరగానే క్షేత్రస్థాయిలో ఆయా సామాజికవర్గాల జనాభా వివరాలు తేల్చొచ్చునని, సామాజిక, ఆర్థిక కుల సర్వే అయితే ఇంకా సమయం ఎక్కువ పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓటర్ల జాబితా ప్రకారం కసరత్తు పూర్తిచేసి ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, ఆ తర్వాత మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు నిర్వహించుకోవచ్చుననే సూచనలను రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ కమిషన్‌ ద్వారా వెళ్లినట్టుగా తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అంటున్నారు.

దీనిని బట్టి ఈ ఎన్నికలు ఏడాది చివరి వరకు వెళ్లొచ్చుననే ఊహాగానాలు సాగుతున్నాయి. దీంతో ఏ ఎన్నికలు ముందు జరుగుతాయి..? ముందుగా జిల్లా పరిషత్ ఎన్నికలుంటాయా లేక జడ్పీటీసీ, ఎంపీటసీ ఎలక్షన్లు మొదట నిర్వహిస్తారా...? లేక ఈ ఏడాది చివర్లో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకటి తర్వాత మరొకటి వరుసగా నిర్వహిస్తారా అన్న దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే...తొలుత జిల్లా పరిషత్ ఆ తర్వాత 10, 15 రోజులకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories