Hyderabad: గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ పోలీసుల ఆంక్షలు.. ఎవరెవరు ఏయే రూట్‌లో వెళ్లాలంటే..
Hyderabad: ప్రధాన ఊరేగింపు మార్గాల్లో ఇతర వాహనాలకు నో పర్మిషన్
1. భాగ్యనగర వీధుల్లో ఎటు చూసినా గణనాథుల సందడే కనిపిస్తుంది. ఇన్నిరోజులు గణపతి బప్పా మోరియా అంటూ పలికిన భక్తులు, ఇప్పుడు గణేషుడికి బైబై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. 9 రోజుల పాటు మండపాల్లో విశేష పూజలందుకున్న గణనాథులు ట్యాంక్‌బండ్ వైపు కదిలిరానున్నాయి. ఈ నేపథ్యంలోనే ట్యాంక్‌బండ్‌లో గణేష్ నిమజ్జనాలను సంబంధించిన రూట్ మ్యాప్‌ను హైదరాబాద్ పోలీసులు విడుదల చేశారు. ఏయే రూట్ల నుంచి విగ్రహాలను ట్యాంక్ బండ్ వైపు తీసుకురావాలనే దానిపై ఈ రూట్ మ్యాప్ ద్వారా స్పష్టత ఇచ్చారు. పోలీసుల ఆంక్షలను ఫాలో అవుతూ వినాయక ప్రతిమలను తరలించాలని సూచించారు.
2. గణేష్ నిమజ్జనం సందర్భంగా 17, 18వ తేదీల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధాన ఊరేగింపు మార్గాల్లో విగ్రహాలను మోసుకెళ్లే వాహనాలకు తప్ప ఇతర వాహనాలకు అనుమతి ఉండదని పోలీసులు స్పష్టం చేశారు. 17వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 18వ తేదీ వరకు ఈ ఆంక్షలు ఉంటాయన్నారు. అవసరమైతే పొడిగించే అవకాశం ఉందని తెలిపారు. ఊరేగింపు సందర్భంగా, ట్రాఫిక్ నిబంధనలు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల రూట్ ఎంట్రీపై ఆంక్షలు, అతిభారీ వాహనాలపై ఆంక్షలు విధించారు. వాహనదారులు ముందస్తుగా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. అతిభారీ వాహనాలు ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా వెళ్లాలని సూచించారు. నిమజ్జనం సందర్భంగా ఆర్టీసీ బస్సు రూట్‌పై ఆంక్షలు విధించారు.
3. గణనాథుల నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు ఏరియాలను మొత్తం ఏడు జోన్లుగా విభజించారు. రూట్ వన్‌ను సౌత్ ఈస్ట్ జోన్‌గా, రెండో రూట్‌ను సౌత్ జోన్‌గా, మూడో రూట్‌ను ఈస్ట్ జోన్‌గా, రూట్ ఫోర్‌ను సౌత్ వెస్ట్ జోన్‌గా, ఐదో రూట్‌ను వెస్ట్ జోన్‌గా, ఆరో రూట్‌ను నార్త్ జోన్‌గా డివైడ్ చేశారు. ఇక లాస్ట్ ఏడో రూట్‌ను సెంట్రల్ జోన్‌గా నిర్ణయించారు. ఈ చివరి రూట్‌లోనే ఖైరతాబాద్ బడా గణేష్ ఊరేగింపు కొనసాగనుంది.
4. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ విగ్రహాలు గుర్రం చెర్వు ట్యాంక్, కట్ట మైసమ్మ ఆలయం వద్ద హైదరాబాద్ కమిషనరేట్‌లో పరిధిలోకి ప్రవేశిస్తాయి. ఊరేగింపు కేశవగిరి నుంచి ప్రారంభమవుతుంది. చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్, ఎడమ మలుపు, మహబూబ్‌నగర్ ఎక్స్ రోడ్, ఫలక్‌నుమా రైల్వే ఓవర్ బ్రిడ్జి, అలియాబాద్, నాగుల్చింత, చార్మినార్, మదీనా, అఫ్జల్‌గంజ్, ఎస్‌ఏ బజార్, ఎంజే మార్కెట్, అబిడ్స్ ఎక్స్ రోడ్, బషీర్‌బాగ్, లిబర్టీ జంక్షన్, ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్ఆర్ మార్గ్ వైపు వెళతాయి.
5. సికింద్రాబాద్ నుంచి వచ్చే విగ్రహాలు సంగీత్ థియేటర్, ప్యాట్నీ, ప్యారడైజ్ జంక్షన్, ఎంజీ రోడ్, రాణిగంజ్, కర్బలా మైదాన్, సోనాబాయి మసీదు, ట్యాంక్ బండ్ గుండా వెళ్తూ ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్ఆర్ మార్గ్‌కు చేరుకుంటాయి. చిలకలగూడ ఎక్స్ రోడ్ల నుంచి వచ్చే విగ్రహాలు గాంధీ హాస్పిటల్, ఆర్టీసీ ఎక్స్ రోడ్స్, నారాయణగూడ ఫ్లై ఓవర్, నారాయణగూడ వై జంక్షన్, హిమాయత్‌నగర్ మార్గంలో వెళ్లి లిబర్టీ జంక్షన్ వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తాయని రూట్ మ్యాప్‌లో వివరించారు.
6. ఈస్ట్‌జోన్ ఉప్పల్ ప్రాంతం నుంచి ఊరేగింపుగా వచ్చే విగ్రహాలు రామంతాపుర్, శ్రీరమణ జంక్షన్, ఆరో నెంబర్ జంక్షన్, తిలక్‌నగర్, శివం రోడ్, ఉస్మానియా వర్సిటీ ఎన్‌సీసీ, విద్యానగర్ జంక్షన్, హిందీ మహావిద్యాలయ ఎక్స్ రోడ్, ఫీవర్ హాస్పిటల్, టీవై మండలి, బర్కత్‌పురా ఎక్స్ రోడ్ల మీదుగా వెళతాయి. వైఎమ్‌సీఏ, నారాయణగూడ ఎక్స్ రోడ్ చేరుకుని ఆర్టీసీ ఎక్స్ రోడ్ నుంచి ఊరేగింపులో చేరాలని సూచించారు.
7. దిల్‌సుఖ్‌నగర్ నుంచి ఐఎస్ సదన్, సైదాబాద్, చంచల్‌గూడ నుంచి వచ్చే విగ్రహాలు నల్గొండ ఎక్స్ రోడ్‌లో చేరతాయి. భారీ విగ్రహాలు మూసారాంబాగ్ మీదుగా అంబర్‌పేట్ వైపు వెళ్తాయి. తార్నాక వైపు నుంచి వచ్చే విగ్రహాలు ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ రోడ్, అడిక్‌మెట్ వైపు వెళ్లి విద్యానగర్ మీదుగా ఫీవర్ హాస్పిటల్ వద్ద ఊరేగింపులో కలుస్తాయి.
8. టోలిచౌకి, రేతిబౌలి, మెహదీపట్నం వైపు నుంచి వచ్చే విగ్రహాలు మాసబ్ ట్యాంక్, అయోధ్య జంక్షన్, నిరంకారి భవన్, ద్వారకా హోటల్ జంక్షన్, ఇక్బాల్ మినార్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్‌కు చేరుకుంటాయి.
9. ఎర్రగడ్డ నుంచి వచ్చే విగ్రహాలు ఎస్‌ఆర్‌నగర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్ మీదుగా మెహదీపట్నం నుంచి వచ్చే ఊరేగింపులో నిరంకారీ భవన్ వద్ద చేరి ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్ఆర్ మార్గ్ వరకు వెళ్తాయి. టప్పాచబుత్ర, ఆసిఫ్‌నగర్ ప్రాంతాల నుంచి విగ్రహాలు, సీతారాంబాగ్, బోయిగూడ కమాన్, వోల్గా హోటల్ ఎక్స్ రోడ్, అఘాపురా, గోషామహల్ బారాదరి, అలాస్కా, మలకుంట జంక్షన్ మీదుగా వెళ్లి ఎంజే మార్కెట్ వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తాయి.
10. గణేష్ విగ్రహాలను తీసుకువెళ్లే వాహనాలు కాకుండా ఇతర వాహనాల రాకపోకలకు ప్రధాన ఊరేగింపు మార్గాల్లో ఎంట్రీని నిలిపివేశారు. ప్రధాన మార్గాలు, ఇతర ఉపనది ఊరేగింపుల మార్గాలకు ఆనుకుని ఉన్న అనేక పాయింట్ల వద్ద పరిమితం చేసి దారి మళ్లిస్తారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని పోలీసులు చెప్పారు.
11. ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనాలను చూసేందుకు వచ్చే సందర్శకుల కోసం పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. వాహనాలను పార్క్ చేసి నిమజ్జన ప్రదేశాలను కాలినడకన వెళ్లాలని సూచించారు. ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ దేవాలయం, లోయర్ ట్యాంక్ బండ్, పబ్లిక్ గార్డెన్స్, బుద్ధ భవన్ వెనుక వైపు, ఆదర్శ్‌నగర్ రోడ్, బీఆర్కే భవన్, జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం రోడ్, ఖైరతాబాద్ జంక్షన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్‌లో పార్కింగ్ సౌకర్యం కల్పించారు.
12. గణేష్ నిమజ్జనాల కోసం హైదరాబాద్ సిటీలో 10 చోట్ల బేబీ పాండ్స్‌ను ఏర్పాటు చేశారు. జైపాల్‌రెడ్డి స్ఫూర్తి స్టాల్, సంజీవయ్య పార్క్ ఎదురుగా ఉన్న హెర్బల్ స్పైసెస్ గార్డెన్ పక్కన, జల విహార్ పక్కన ఉన్న గ్రీన్ పార్క్ పాయింట్, సైదాబాద్ హౌసింగ్ బోర్డ్ కాలనీ, గౌలిపురలోని బతుకమ్మ బావి, వైశాలి నగర్, ఐఎస్ సదన్, శివాలయం రియాసత్‌నగర్, స్వామి దేవాలయం హమామ్ బౌలి, రాజనా బావి, జంగమెట్‌లో బేబీ పాండ్స్ ఏర్పాటు చేశారు.
13. సిటీలోని పలుచోట్ల పోర్టబుల్ వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ స్టేడియం, రాంలీలా గ్రౌండ్, చింతల్‌బస్తీ, మారేడ్‌పల్లి ప్లే గ్రౌండ్, జీహెచ్‌ఎంసీ గ్రౌండ్, చిలకలగూడ, అమీర్‌పేట్ ప్లే గ్రౌండ్, అలీ కేఫ్, అంబర్‌పేట్, ఎస్బీఏ గార్డెన్, హండ్రెడ్ ఫీట్ రోడ్, కుల్సుంపురా, నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో వాటర్ ట్యాంకుల ద్వారా నిమజ్జనం చేస్తారు.
14. గణేష్ నిమజ్జనాల రోజు మార్గదర్శకాలు, ప్రయాణ సహాయం కోసం హెల్ప్ లైన్ నంబర్లు 040-27852482, 8712660600, 9010203626 లను సంప్రదించాలని సూచించారు. ప్రధాన ఊరేగింపు, చెరువుల వద్ద, నిష్క్రమణ మార్గాలు, పార్కింగ్ స్థలాలు, వివిధ ప్రదేశాల్లో ప్రదర్శించబడే సమాచార సంకేతాలను చూపించే రూట్ మ్యాప్ అనుసరించాలని హైదరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ హైదరాబాద్ పోలీసుల ట్రాఫిక్ డైవర్షన్ ఆంక్షలు పాటిస్తూ తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire