తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీలు సిద్ధం!

తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీలు సిద్ధం!
x
Highlights

తెలంగాణలో రెండు పట్టభద్రుల స్థానాలకు జరగబోయే ఎన్నికలకు పార్టీలన్నీ సన్నద్ధమవుతున్నాయి. కమ్యూనిస్టులు కూడా పోటీకి ప్రణాళికలు రచిస్తున్నారు. వామపక్షాల...

తెలంగాణలో రెండు పట్టభద్రుల స్థానాలకు జరగబోయే ఎన్నికలకు పార్టీలన్నీ సన్నద్ధమవుతున్నాయి. కమ్యూనిస్టులు కూడా పోటీకి ప్రణాళికలు రచిస్తున్నారు. వామపక్షాల ఐక్యత కోసం ఉమ్మడి అభ్యర్థిలను నిలపాలని అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తోంది. మద్దతు ఇవ్వాలని ఇప్పటికే కోదండరాం, చెరుకు సుధాకర్‌లను​ ఇరు పార్టీల రాష్ట్ర కార్యదర్శులను కలిసి కోరారు. కానీ కోదండరాం ఆలోచనలు వేరుగా ఉన్నాయి. రెండు రోజుల క్రితం ఇప్పటికే పోటీలో ఉన్న చెరుకు సుధాకర్‌ని కలసి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.

తెలంగాణలో వచ్చే ఏడాది మార్చిలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేసేందుకు కామ్రేడ్స్‌ సిద్ధమవుతున్నారు. తమకు మద్దతివ్వాలంటూ ఇతర పార్టీల నేతలు కమ్యూనిస్టులను అభ్యర్థిస్తున్నారు. కానీ కామ్రేడ్స్‌ మాత్రం అభ్యర్థులను బరిలో నిలిపేందుకే మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న అనేక సమస్యలపై సీపీఎం, సీపీఐ, తెలంగాణ జన సమితి, తెలుగుదేశం పార్టీలు కలిసి పోరాటాలు నిర్వహించాయి. భవిష్యత్‌లో జరగబోయే ఎన్నికలకు ఈ పార్టీలు కూటమిగా జట్టుకట్టే అవకాశం ఉందని అంతా భావించారు. పట్టభధ్రుల ఎన్నికల్లో మాత్రం ఎవరికి వారే పోటీకి దిగుతామని ప్రకటించుకుంటున్నారు.

ఇప్పటికే కమ్మునిస్ట్ పార్టీలో తమ పార్టీకి చెందిన నాయకులే పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే పట్టబద్రుల ఎన్నికల్లో అందరి మద్దతుతో కలసి పోటీ చేయాలా లేదంటే రెండు కమ్యూనిస్టు పార్టీ లతో ముందుకు వెళ్లాలా అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే అభ్యర్థులు తామంటే తాము పోటీ చేస్తామని చెప్తున్న నేపద్యంలో కేంద్ర కార్యవర్గం కూడా పట్టభద్రుల ఎన్నికలపై దృష్టి సారించింది.

ఇటు ఇప్పటికే చట్టసభల్లో అడుగు పెట్టాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం మూడు నెలల నుండే అనేక వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటనలు, సమావేశాలతో ప్రచారాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, తెలుగుదేశం, తెలంగాణ ఇంటి పార్టీల నేతలను కలిశారు. MLC ఎన్నికల్లో తమకు మద్దతివ్వాలని కోదండరాం అభ్యర్థించారు. పార్టీలో చర్చించాక తమ నిర్ణయం ప్రకటిస్తామని అన్ని పార్టీలు తెలియజేశాయి. కమ్యూనిస్టులు కూడా కోదండరాం కు మద్దతిస్తారని అంతా భావించినప్పటికీ ఊహించనీ విధంగా వామపక్ష పార్టీలు ఉమ్మడిగా అభ్యర్థిని నిలిపేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇదే జరిగితే ఖమ్మం, నల్గొండ, వరంగల్​ జిల్లాల్లో కాస్తో కూస్తో కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉన్నందున కోదండరాం విజయావకాశాలు తక్కువగానే ఉంటాయి.

వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల స్థానం నుంచి సీపీఐ అభ్యర్థిగా మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన ఓ జర్నలిస్ట్‌ను బరిలో నిలిపేందుకే యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అభ్యర్థిని నిలపాలా? మద్దతు కోరిన వారిని బలపరచాలా? అనేది రాష్ట్ర కార్యవర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సీపీఎం మాత్రం పోటీకి దూరంగా ఉంటున్నట్టు స్పష్టం చేసింది. హైదరాబాద్‌- రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానంలో మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగితే వామపక్షాలు మద్దతివ్వనున్నట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు.

కోదండరాంకు చెక్​ పెట్టేందుకు TRS బాస్ పక్కా వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. కోదండరాంకు మద్దతివ్వకుండా అభ్యర్థులను బరిలో నిలపాలని కామ్రేడ్స్​ను కేసీఆర్​ కోరినట్టు ప్రచారం సాగుతోంది. అందులో భాగంగానే కలిసి ఐక్య ఉద్యమాలు చేసిన సీపీఎం, సీపీఐ, టీజేఎస్, టీడీపీ పట్టభద్రుల ఎన్నికల్లో వేర్వేరుగా ముందుకెళ్తున్నాయని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ ఎన్నికల్లో కమ్యూనిస్టులు పోరులోకి దిగుతారా? ఇతర పార్టీలకు మద్దతిస్తారా? అనేది వేచిచూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories