Anganwadi: పక్కదారి పట్టకుండా తెలంగాణ సర్కార్ చర్యలు.. అంగన్వాడీ గుడ్లపై ప్రత్యేక ముద్ర

Color Of Eggs In Telangana Anganwadi Centres
x

Anganwadi: పక్కదారి పట్టకుండా తెలంగాణ సర్కార్ చర్యలు.. అంగన్వాడీ గుడ్లపై ప్రత్యేక ముద్ర

Highlights

Anganwadi: సప్లయ్ ట్రాకింగ్ విధానంతో బ్యాచ్‌ల వారీగ సరఫరా

Anganwadi: గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. అందులో ముఖ్యమైంది అంగన్వాడీ కేంద్రాల్లో కోడిగుడ్ల సరఫరా. మరి అంగన్వాడీ కేంద్రాల్లో కోడిగుడ్లు అర్హులకు అందజేస్తున్నారా? అందులో నాణ్యత ఉంటుందా? అన్న దానిపై చాలానే విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో అక్రమాలను నియంత్రించేందుకు కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ సర్కార్. అర్హులకు మాత్రమే పౌష్టికాహారం అందించేలా అంగన్వాడీ గుడ్లపై ప్రత్యేక ముద్ర వేస్తోంది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 4 వేలకు పైగా అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. వీటిలో 19వేల 144 మంది గర్భిణీలు ఉన్నారు. 19వేల 779 మంది బాలింతలు, లక్షా 95వేల 43 మంది చిన్నారులు నమోదై ఉన్నారు. వీరందరికీ నిత్యం పౌష్టికాహారంతో పాటు కోడిగుడ్లు పంపిణీ చేస్తున్నారు. బరువు తక్కువగా, బలహీనంగా ఉన్న వారికి రెట్టింపు పౌష్టికాహారం సైతం అందజేస్తోంది. అయితే వివిధ కారణాలతో అంగన్వాడీ కేంద్రాలకు రాని వారికి కూడా అందజేస్తున్నట్లు కోడిగుడ్లను దారి మళ్లిస్తున్నారే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటివి జరగకుండా ఉండేందుకు విడతల వారీగా ఒక్కో రంగుతో కోడిగుడ్లకు ముద్ర వేస్తున్నారు.

జూలై నుంచి ఫిబ్రవరి వరకు నెలకు రెండు విడతలుగా గుడ్లు అందిస్తారు. మార్చి నుంచి జూన్ వరకు వేసవిలో గుడ్లు త్వరగా పాడైపోయే ప్రమాదం ఉండటంతో నెలకు మూడు దఫాలుగా సరఫరా చేస్తారు. వేసవిలో అందించే గుడ్లపై నీలం, ఎరుపు, ఆకుపచ్చ రంగులు, చలికాలం, వర్షాకాలం అందించే గుడ్లపై ఎరుపు, ఆకుపచ్చ రంగులను ముద్రిస్తారు. ప్రత్యేకమైన ముద్ర వేసిన ఈ గుడ్లనే ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో అందజేస్తు.న్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై బ్యాచ్ నంబరు కూడా ఉండడంతో లబ్ధిదారులకు అందించడం సులువుగా మారింది.

అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేసే గుడ్లు పక్క దారి పట్టకుండా సప్లయ్ ట్రాకింగ్ విధానం ద్వారా బ్యాచ్ ల వారీగా సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ముద్ర ఉన్న కోడిగుడ్లను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు, ఇతరులు భయపడతారని... దీంతో గుడ్ల అక్రమ రవాణా, వినియోగాన్ని ప్రాథమిక దశలోనే కట్టడి చేయొచ్చంటున్నారు. అసలైన లబ్ధిదారులకు మాత్రమే గుడ్లు అందజేసే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మొత్తానికి ప్రత్యేక ముద్రతో కోడిగుడ్లకు చెక్ పెట్టినట్లు అయింది. ఇప్పటినుంచైనా అసలైన అర్హులకు పౌష్టికాహారం చేరుతుందని భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories