ఇద్దరి మధ్య వివాదమే యుద్ధంగా మారిందా?

ఇద్దరి మధ్య వివాదమే యుద్ధంగా మారిందా?
x
Highlights

ఆ ఇద్దరు ఒకే పార్టీకి చెందిన నాయకులు. ఐనా వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్‌లో వైరం. అందులో ఒకరికి మంత్రి అండదండలు పుష్కలంగా ఉండటంతో...

ఆ ఇద్దరు ఒకే పార్టీకి చెందిన నాయకులు. ఐనా వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్‌లో వైరం. అందులో ఒకరికి మంత్రి అండదండలు పుష్కలంగా ఉండటంతో స్థానిక ఎమ్మెల్యేకు కొరకరాని కొయ్యలా మారారట. వారిద్దరూ కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ది చేయాల్సింది పోయి గ్రూపులను పోషిస్తూ వ్యక్తిగత వైరంతో రగిలిపోతున్నారట. వారే జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన జడ్పీ చైర్ పర్సన్ సరిత, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. అసలు ఈ ఇద్దరికి వైరం ఎక్కడ మొదలైంది....?

జోగులాంబ గద్వాల జిల్లా. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నడిగడ్డగా పిలిచే, ప్రాంతం. గద్వాల రాజకీయాలు ఓ పట్టానా ఎవ్వరికీ అంతుచిక్కవు. ఎక్కడైనా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల సెగలు కక్కుతుంటాయి. కానీ ఇక్కడ మాత్రం అధికారపక్షంలోనే లుకలుకల మంటలు నిత్యం మండుతూనే వుంటాయి. గద్వాల ఎమ్మేల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో అంతర్గత వైరం సాగుతోంది. జడ్పీ చైర్‌ పర్సన్ ఎన్నిక సందర్భంగా ప్రారంభమైన వైరం, ఇటీవల జరిగిన జడ్పీ సీఈఓల బదిలీలతో తారాస్థాయికి చేరింది. ఇందులో జడ్పీ చైర్ పర్సన్ సరితకు మంత్రి నిరంజన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం అండదండలు ఉండటంతో, ఆమె గద్వాల ఎమ్మెల్యేతో సై అంటే సై అన్నట్టు దూసుకుపోతున్నారట.

ఇక మేనత్త డీకె అరుణతో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి సైతం, ఢీ అంటే ఢీ అన్నట్టు వ్యవహరిస్తుండటంతో గద్వాలలో రాజకీయం రసవత్తరంగా మారింది. అలంపూర్ నియోజకవర్గం, మానవపాడు మండలం జడ్పిటిసిగా ఎన్నికయ్యారు సరిత. అయితే, హైకమాండ్ నుంచి తనకు ఎలాంటి సమాచారం లేకుండా మంత్రి నిరంజన్ రెడ్డి అండదండలతో, సరితకు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి వరించిందన్న బండ్ల ఆగ్రహం. అదే ఇరువురి నడుమ వైరానికి కారణమైంది. ఎలాగైనా తన వర్గీయులనే జడ్డీ పీఠంపై కూర్చోబెట్టాలని చివరి వరకూ ప్రయత్నించినా ఫలించలేదట. ఐతే సరిత జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జడ్పీ సీఈఓగా ఆమెకు అనుకూలమైన వ్యక్తి యాదయ్యను నియమించడంతో పుండుమీద కారం చల్లినట్లయ్యింది బండ్ల కృష్ణమోహన్‌కు.

గద్వాల ప్రాంతంలో డి.ఆర్.డి.ఏ పి.డిగా పనిచేస్తున్న జ్యోతిని జడ్పీ సీఈఓగా నియమించాలని ఎమ్మెల్యే విశ్వప్రయత్నాలు చేశారు. కానీ ఇది కూడా నెరవేరలేదు. దీంతో రగిలిపోయిన బండ్ల, ఇందుకు నిరసనగా, గన్‌మెన్లను గవర్నమెంట్‌కు సరెండర్ చేసి సంచలనం రేపారు. ఈ పరిణామాల తర్వాత ఎమ్మెల్యే మద్దతు తెలిపిన జ్యోతినే జడ్పీ సీఈఓగా నియమిస్తున్నట్టు రాత్రికి రాత్రే ఉత్తర్వులు వెలువడ్డాయి. నాటి నుంచి నేటి వరకు ఇద్దరి మధ్య వైరం అంతకంతకూ పెరుగుతూనే వుంది.

ప్రస్తుతం గద్వాల నియోజకవర్గంలో ఏ అధికార కార్యక్రమం జరిగినా, ఈ ఇద్దరు కలిసి పాల్గొనడం లేదు. మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటన ఉన్నప్పుడు మాత్రమే జడ్పీ చైర్ పర్సన్ సరిత గద్వాల నియోజక వర్గంలో జరిగే కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఇక ఎమ్మెల్యే పాల్గొనే ఏ కార్యక్రమాల్లోనూ అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు సరిత.

ఇక అటు అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహంతో కలిసి, నియోజకవర్గంలో మాత్రం అన్నింటిలో పాల్గొంటున్నారు తప్ప, గద్వాలలో పర్యటించడం లేదట సరిత. జడ్పీ చైర్ పర్సన్ జిల్లా అంతట పర్యటించి అభివృద్దికి నిధుల కేటాయింపు వంటివి చర్చించి, పైనుంచి ఫండ్స్ తెచ్చేలా కృషి చెయ్యాలి. కాని ఎమ్మెల్యే-జడ్పీ చైర్మన్‌ మధ్య కోల్డ్‌వార్‌తో, జిల్లా అభివృద్ది కుంటుపడుతోందని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గొడవలు పక్కనపెట్టి జిల్లా అభివృద్దికి కృషి చెయ్యాలని కోరుకుంటున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories